RC16 | చరణ్ సినిమా గ్రాండ్ ఓపెనింగ్
Ramcharan - ఎట్టకేలకు రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా లాంఛ్ అయింది. ఓపెనింగ్ చాలా గ్రాండ్ గా జరిగింది.
అభిమానులు, ప్రేక్షకులు ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న రామ్ చరణ్, బుచ్చిబాబు సినిమా ఎట్టకేలకు మొదలైంది. హైదరాబాద్‌లో బుధవారం జరిగిన ఈ చిత్ర ప్రారంభోత్సవానికి రామ్ చరణ్, జాన్వీ కపూర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. వీళ్లతో పాటు సినిమాలో కీలక పాత్రలు పోషించబోతున్న నటీనటులు, టెక్నీషియన్స్ అంతా ఓపెనింగ్ కు హాజరయ్యారు. సంగీత దర్శకుడు రెహ్మాన్ కూడా రావడం విశేషం. రామ్ చరణ్ స్టయిలిష్ గా కనిపిస్తే, జాన్వి కపూర్ చీరకట్టులో మెరిసింది.
రామ్ చరణ్ కెరీర్ లో 16వ చిత్రం ఇది. దాదాపు ఏడాదిగా ఈ సినిమా సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతూనే ఉంది. ఎప్పటికప్పుడు అప్ డేట్స్ బయటకొస్తూనే ఉన్నాయి. తాజాగా ఈ సినిమా కోసం దర్శకుడు బుచ్చిబాబు, ఉత్తరాంధ్రలో ఆడిషన్స్ కూడా చేశాడు. దాదాపు 150 మంది నటీనటుల్ని తీసుకున్నాడని సమాచారం. ప్రస్తుతం రామ్ చరణ్, గేమ్ చేంజర్ షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.
ఈ సినిమా షూట్ కొలిక్కి రావడంతో, అతడు బుచ్చిబాబు సినిమాను స్టార్ట్ చేశాడు. అటు జాన్వి కపూర్, ఎన్టీఆర్ సరసన దేవర సినిమాలో నటిస్తోంది. ఆ సినిమా కూడా త్వరలోనే కొలిక్కిరాబోతోంది. ఇక చరణ్-బుచ్చిబాబు సినిమాకు సంబంధించి రెహ్మాన్ ఇప్పటికే మ్యూజిక్ సిట్టింగ్స్ స్టార్ట్ చేశాడు.
మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్ పై ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి రాబోతోంది. రూరల్ బ్యాక్ డ్రాప్ లో స్పోర్ట్స్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమాకు పెద్ది అనే టైటిల్ పెట్టినట్టు టాక్.