హరిహర వీరమల్లు.. పవన్ తో భారీ వర్క్ షాప్
పవన్ హీరోగా నటిస్తున్న సినిమా హరిహర వీరమల్లు. ఈనెల రెండో వారం నుంచి ఈ సినిమా కొత్త షెడ్యూల్ ఉంటుంది. దీని కోసం వర్క్ షాప్ నిర్వహించారు.
పవన్ కల్యాణ్, క్రిష్ కాంబోలో 'హరిహర వీరమల్లు' అనే సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఇలాంటి హిస్టారికల్ ఫిక్షన్ మూవీ చేయడం పవన్ కు ఇదే తొలిసారి. అందుకే పవన్ తో పాటు టోటల్ యూనిట్ అంతా భారీ వర్క్ షాప్ నిర్వహించింది. సెట్స్ పైకి వెళ్లకముందే హోమ్ వర్క్ చేస్తోంది.
ఈ వర్క్‌షాప్ గురించి పవన్ కళ్యాణ్ తో దర్శకుడు క్రిష్ చర్చించాడు. పవన్ కళ్యాణ్ లాంటి పెద్ద స్టార్ ఇలా వర్క్ షాప్ కు ఒప్పుకోవడం చాలా పెద్ద విషయం. కథ అలాంటిది కావడంతో పవన్ కూడా వర్క్ షాప్ చేయాల్సి వస్తోంది. యూనిట్ అంతాస్క్రిప్ట్ పై కూలంకుషంగా చర్చించుకుంటున్నారు.
ఇలా ప్రీ-షెడ్యూల్ వర్క్ షాప్ నిర్వహించడం వల్ల చాలా ఉపయోగాలున్నాయి. తక్కువ టైమ్ లో షూటింగ్ పూర్తి చేయొచ్చు. ఎవరి పాత్రలు ఏంటి, ఎలా నటించాలనే విషయంపై సెట్స్ పైకి వెళ్లకముందే అవగాహన వస్తుంది. దీంతో సమయం, డబ్బు రెండూ కలిసొస్తాయి.
ఈ ప్రీ షెడ్యూల్ వర్క్‌షాప్‌లో పవన్ కళ్యాణ్‌తో పాటు నిధి అగర్వాల్, సునీల్, సుబ్బరాజు, రఘుబాబు, రచయిత-హాస్యనటుడు హైపర్ ఆది, వారితో పాటు చిత్ర సమర్పకులు ఎ.ఎం. రత్నం, నిర్మాత ఎ.దయాకర్ రావు, సంగీత దర్శకులు కీరవాణి, సినిమాటోగ్రాఫర్ జ్ఞానశేఖర్ పాల్గొంటున్నారు.
ఈ వర్క్‌షాప్ ముగిశాక రెండో వారం నుంచి కొత్త షెడ్యూల్ ప్రారంభిస్తారు. సినిమాను వచ్చే ఏడాది వేసవిలో విడుదల చేయాలనుకుంటున్నారు.