షాకింగ్ న్యూస్ : సాలార్ విడుదల వాయిదా- అడ్వాన్సు బుకింగ్స్ వాపస్!

ఈ సెప్టెంబర్ 28 న విడుదలవుతోందని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్న ‘సాలార్’ నిర్మాతల నుంచి షాకింగ్ న్యూస్ వెలువడింది. పానిండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా, ‘సాలార్’ థియేట్రికల్ విడుదల అధికారికంగా వాయిదా పడింది.

Advertisement
Update:2023-09-02 14:29 IST

Prabhas's Salaar Movie: మరో నెల రోజుల్లో సలార్ పూర్తి

ఈ సెప్టెంబర్ 28 న విడుదలవుతోందని ఎన్నో ఆశలు పెట్టుకుని ఎదురు చూస్తున్న ‘సాలార్’ నిర్మాతల నుంచి షాకింగ్ న్యూస్ వెలువడింది. పానిండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న గ్యాంగ్‌స్టర్ డ్రామా, ‘సాలార్’ థియేట్రికల్ విడుదల అధికారికంగా వాయిదా పడింది. ప్రకటించిన సెప్టెంబర్ 28 న కాక డిసెంబర్ లేదా జనవరిలో విడుదల చేసేందుకు యోచిస్తున్నారు. విడుదల వాయిదా పడడం, డిసెంబర్ లేదా జనవరికి కొత్త తేదీ వచ్చే అవకాశం వుండడంతో మార్కెట్లో గుండెలు గుభేలు మన్నాయి. అటు యూఎస్ బయ్యర్లు, ఇటు టాలీవుడ్ నిర్మాతలూ అయోమయంలో పడిపోయారు. యూఎస్ బయ్యర్లు ఆగస్టులోనే ‘సాలార్’ అడ్వాన్స్ బుకింగ్స్ ప్రారంభించి ఇరుకున పడితే; డిసెంబర్, జనవరి మాసాల్లో కొత్త సినిమాల విడుదలకి ముహూర్తాలు పెట్టుకుంటున్న టాలీవుడ్ అగ్ర నిర్మాతలు గందరగోళంలో పడ్డారు.

‘కేజీఎఫ్’ రెండు భాగాల బ్లాక్ బస్టర్ ఫేమ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ రూపొందిస్తున్న ‘సాలార్ : పార్ట్ 1- సీజ్ ఫైర్’ గ్రాఫిక్స్ వర్క్స్ పూర్తి కాకపోవడం విడుదల వాయిదాకి కారణం. గ్రాఫిక్స్ వర్క్స్ పూర్తి కాలేదని కాదు, షెడ్యూల్ ప్రకారం పూర్తయింది. అయితే అది సంతృప్తికరంగా లేకపోవడంతో, తిరిగి మొత్తం గ్రాఫిక్స్ వర్క్స్ ఫ్రెష్ గా చేపట్టాల్సి వస్తోంది. ప్రభాస్ సినిమాలకే ఇలా ఎందుకు జరుగుతోందో తెలీదు. ‘ఆదిపురుష్’ తో ఇదే జరిగింది. ‘ఆదిపురుష్’ టీజర్ క్వాలిటీ మీద ప్రేక్షకులు హాస్యాస్పద కామెంట్లు చేయడంతో, కళ్ళు తెరిచిన దర్శకుడు ఓం రౌత్ గ్రాఫిక్స్ వర్క్స్ మళ్ళీ మొదట్నుంచీ మొదలు పెట్టాల్సి వచ్చింది. అయితే ‘సాలార్’ ట్రైలర్ విడుదల కాలేదు. సెప్టెంబర్ 6న విడుదలవుతుందని రెండు రోజుల క్రితం ప్రకటించారు. ఇప్పుడేమౌతుందో తెలీదు.

తాజా అప్డేట్స్ ప్రకారం, యూఎస్ లోని అనేక మల్టీప్లెక్స్ చైన్‌లు ‘సాలార్’ ని తొలగించడం మొదలెట్టాయి. అడ్వాన్సు బుకింగ్స్ అయిన టికెట్లని రద్దు చేసి సెప్టెంబర్ చివరి వారంలో డబ్బు వాపసు చేయాలని నిర్ణయించాయి. అదృష్టం బావుండి ఇండియాలో అడ్వాన్సు బుకింగ్ ప్రారంభించలేదు. యూఎస్ లో అడ్వాన్సు బుకింగ్స్ ద్వారా వసూలైన మొత్తం రూ. 3.45 కోట్లు. 400 స్క్రీన్స్ లో 1012 షోలకి 20 వేల టిక్కెట్లు అమ్ముడయ్యాయి.

విశేషమేమిటంటే, యూఎస్ లో షారుఖ్ ఖాన్ అడ్వాన్స్ బుకింగ్స్ ని మించిపోయి రికార్డులు సృష్టించ సాగింది ‘సాలార్’. అటువంటిది ఇప్పుడు తలకిందులైంది పరిస్థితి. ఇది శుభసూచకం కాదని ట్రేడ్ వర్గాలు అంటున్నాయి. విడుదల రద్దయి డబ్బులు వెనక్కి ఇచ్చే పరిస్థితి సినిమాకి మంచిది కాదని చెప్తున్నారు. అయితే నిర్మాతలకి తెలియజేకుండా యూఎస్ బయ్యర్లు అడ్వాన్స్ బుకింగులు ప్రారంభించేశారు. ఏమంత తొందర వచ్చిందని ఇప్పుడు నిర్మాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇదివరకు నిర్మాణ సమస్యలు, మహమ్మారి సంబంధిత సమస్యల కారణంగా ‘సాలార్’ విడుదల ఒకసారి వాయిదా పడింది. ప్రారంభ విడుదల తేదీని ఏప్రిల్ 14, 2022 గా నిర్ణయించారు. దీన్ని సెప్టెంబర్ 28, 2023 కి రీషెడ్యూల్ చేశారు. ఇప్పుడు డిసెంబర్ లేదా జనవరికి జరిపేశారు. ‘సాలార్’ విడుదలలో ఈ అనూహ్య జాప్యం ప్రభాస్ అభిమానులందరికీ భారీ షాక్‌గా మారిందని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అడ్వాన్సు బుకింగ్స్ రద్దు కారణంగా బయ్యర్లూ కొంత నష్టపోక తప్పదు. ముఖ్యంగా ప్రకటనల ఖర్చులు. డబ్బు వాపసు పొందే ప్రేక్షకులకి కూడా కొంత కోత తప్పదు. ఇక నిర్మాతలకీ వడ్డీల భారం పెరగక తప్పదు.

ఇక తెలుగు నిర్మాతల విషయానికొస్తే, అక్టోబర్ నుంచి జనవరి మధ్య భారీ సినిమాలతో తలపడేందుకు సిద్ధమవుతున్నారు. దసరా, దీపావళి, క్రిస్మస్, సంక్రాంతి పండుగల సీజన్ ని సొమ్ము చేసుకోవాలని విడుదల ప్రణాళికలు రచిస్తున్నారు. జనవరిలో మహేష్ బాబు ‘గుంటూరు కారం’, నాగార్జున ‘నా సామిరంగా’ రవితేజ ‘ఈగిల్’ - ఇవేగాక ప్రభాసే నటిస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ విడుదల కూడా వుంది. ‘సాలార్’, ‘కల్కి’ ప్రభాస్ రెండు మెగా సినిమాల విడుదలల్ని గ్యాప్ లేకుండా డిసెంబర్, జనవరి మాసాల్లో ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. డిసెంబర్ లో ఇతర పెద్ద సినిమాల్లేవు. ఒకవేళ ‘సాలార్’ జనవరికి వస్తే జనవరిలో క్యూ కట్టిన తమ సినిమాల పరిస్థితేమిటనేది నిర్మాతల్ని వేధిస్తున్న ప్రశ్న. ‘సాలార్’ విడుదలైతే వేరే సినిమాల విడుదలకి రెండు వారాల గ్యాప్ అయినా ఇవ్వాలి. అయితే సంక్రాంతికి కాకుండా ‘సాలార్’ జనవరి 26 రిపబ్లిక్ డేకి విడుదల చేసే అవకాశముందని అంటున్నారు. అయినా జనవరిలోనే ప్రభాస్ సినిమాలు రెండూ (సాలార్, కల్కి) ఢీకొనే పరిస్థితిని ఎలా నివారిస్తారో తెలీదు.

200 కోట్ల బడ్జెట్‌తో ప్రభాస్ గ్యాంగ్‌స్టర్‌గా నటిస్తున్న ‘సాలార్‌’ లో మలయాళ నటుడు పృథ్వీరాజ్ సుకుమారన్ విలన్‌గా నటిస్తున్నాడు. జగపతి బాబు, శృతీ హాసన్, టిన్నూ ఆనంద్ కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. భూవన్ గౌడ ఛాయాగ్రహణం, రవి బస్రూర్ సంగీతం, నిర్మాత విజయ్ కిరంగదూర్, దర్శకత్వం ప్రశాంత్ నీల్. 

Tags:    
Advertisement

Similar News