జేసీ ప్రభాకర్‌రెడ్డిపై సినీ నటి మాధవీలత ఫిర్యాదు

కేవలం ప్రశ్నించాననే కోపంతో నోటికి వచ్చినట్లు మాట్లాడారని, క్షమాపణ చెప్పే సమయంలోనూ అదే తీరుగా వ్యవహరించారని నటి ఆవేదన

Advertisement
Update:2025-01-18 13:25 IST

అనంతపురం జిల్లా తాడిపత్రి మున్సిపల్‌ ఛైర్మన్‌ జేసీ ప్రభాకర్‌రెడ్డిపై సినీ నటి మాధవీలత 'మా'కు, తెలుగు ఫిల్మ్‌ ఛాంబర్‌కు ఫిర్యాదు చేశారు. ప్రభాకర్‌రెడ్డి తన గురించి చేసిన వ్యాఖ్యలపై సినీ పరిశ్రమ స్పందించలేదు కాబట్టే మూవీ ఆర్టిస్ట్‌ అసోసియేషన్‌కు ఫిర్యాదు చేస్తున్నట్లు తెలిపారు. ప్రభాకర్‌ రెడ్డి నా గురించి దారుణంగా మాట్లాడారు. సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరైనది కాదు. ఆయన క్షమాపణలు చెబితే సరిపోదు.. ప్రభాకర్‌రెడ్డిపై న్యాయపోరాటం చేస్తాను. ఆయన నాపై చేసిన వ్యాఖ్యలను సినీ పరిశ్రమ ఖండించలేదు. అందుకే ఫిల్మ్‌ ఛాంబర్‌లో ఫిర్యాదు చేస్తున్నాను అని తెలిపారు. ఫిర్యాదు చేసే ముందు మాధవీలత తన ఇన్‌స్టాలో 'న్యాయం కోసం నా పోరాటం' అని పోస్ట్‌ పెట్టారు.

జేసీ ప్రభాకర్‌రెడ్డి తనపై చేసిన వ్యాఖ్యలను సినీ నటి మాధవీలత తప్పపట్టారు. వ్యక్తిత్వ హననం చేస్తూ సినిమా వాళ్లపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు. కేవలం ప్రశ్నించాననే కోపంతో నోటికి వచ్చినట్లు మాట్లాడారని, క్షమాపణ చెప్పే సమయంలోనూ అదే తీరుగా వ్యవహరించారని ఆవేదన వ్యక్తం చేశారు.

తాము సినిమాల్లోనే నటిస్తామని, కానీ రాజకీయనాయకులు నిజ జీవితంలోనూ నటిస్తారని నటుడు శివబాలాజీ అన్నారు. ప్రజల కోసమే పనిచేస్తామని చెప్పుకునే రాజకీయ నాయకులు వ్యక్తిగత జీవితాలపై మాట్లాడటం సరికాదన్నారు. రాజకీయాలు చేసుకోండి కాని రాజకీయాకులు ఇండస్ట్రీ జోలికి రావద్దని ఆయన హితవు పలికారు. విష్ణు, మేము కమిటీ సభ్యులమంతా కూర్చుని నిర్ణయం తీసుకుంటామన్నారు.

డిసెంబర్‌ 31న తాడిపత్రి జేసీ పార్కులో నిర్వహించిన నూతన సంవత్సర వేడుకలపై మాధవీలతతో పాటు, బీజేపీ నాయకురాలు సాధినేని యామిని చేసిన వ్యాఖ్యలపై జేసీ ప్రభాకర్‌ రెడ్డి స్పందిసతూ అభ్యంతరకరమైన కామెంట్లు చేయడం విమర్శలకు తావుతీసిన విషయం విదితమే. ఈ నేపథ్యంలో తన వ్యాఖ్యలను ఉపసంహరించుకుంటానని, క్షమాపణ కోరుతున్నట్లు జేసీ ఇటీవల పేర్కొన్నారు. ఆవేశంలోనే అలాంటి వ్యాఖ్యలు చేశాను తప్ప.. వారిని కించపరచాలన్న ఉద్దేశం తనకు లేదన్నారు.

Tags:    
Advertisement

Similar News