Bharateeyudu 2 | భారతీయుడు-2 సినిమాకు లైన్ క్లియర్
Bharateeyudu 2 - భారతీయుడు-2 ఈరోజు సాఫీగా రిలీజైంది. కోర్టు క్లియరెన్స్ ఇచ్చింది. ఇంతకీ ఏం జరిగింది?
ఓ పెద్ద టెన్షన్ తీరింది. ఆఖరి నిమిషంలో భారతీయుడు-2కు లైన్ క్లియర్ అయింది. ఈ సినిమా విడుదలకు మద్రాసు హైకోర్టులోని మధురై బెంచ్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా భారతీయుడు-2 (ఇండియన్-2) సినిమా ఈరోజు రిలీజ్ అయింది.
భారతీయుడు సినిమాలో సేనాపతి పాత్ర పోషించిన కమల్ హాసన్ మర్మకళ అనే విద్యను ప్రదర్శిస్తారు. దీని కోసం ఆయన శిక్షణ తీసుకున్నారు. కేరళకు చెందిన ఈ సంప్రదాయ యుద్ధకళను ఆసన్ రాజేంద్రన్ అనే వ్యక్తి కమల్ కు నేర్పించారు.
ఆయనే ఇప్పుడు భారతీయుడు-2 పై కేసు వేశారు. భారతీయుడు సినిమా కోసం నేర్చుకున్న కళను, తన అనుమతి తీసుకోకుండా, సీక్వెల్ కోసం కూడా వాడేశారనేది ఆయన ఆరోపణ. కాబట్టి సినిమా విడుదల కాకుండా అడ్డుకోవాలి ఆయన కోర్టును కోరారు.
దీనిపై ప్రతివాదనలు వినిపించింది లైకా సంస్థ. వేలాది మంది సిబ్బంది, కళాకారుల భవిష్యత్తు, జీవితం ఈ సినిమాకు ముడిపడి ఉందని.. ఆఖరి నిమిషంలో సినిమా రిలీజ్ ఆపేస్తే చాలామంది సిబ్బంది రోడ్డున పడతారని వాదించారు. అంతేకాకుండా, ఇప్పటికిప్పుడు రిలీజ్ పై స్టే విధిస్తే శాంతిభద్రతల సమస్య కూడా తలెత్తుతుందని వివరించారు. పైగా నిర్మాతకు వందల కోట్లలో నష్టం వస్తుందని కూడా వెల్లడించారు.
ఈ వాదనలతో ఏకీభవించిన కోర్టు.. ఇండియన్-2 సినిమాను విడుదల చేసుకోవచ్చంటూ తీర్పునిస్తూ, పిటిషన్ ను కొట్టేసింది. కమల్ హాసన్, సిద్దార్థ్ హీరోలుగా నటించిన ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహించారు.