తెలుగులో అత్యుత్తమ చిత్రాల్లో 'లక్కీభాస్కర్' ఒకటి
ఈ మూవీపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా 'ఎక్స్' ద్వారా తెలిపిన నటుడు విశ్వక్‌సేన్
దుల్కర్ సల్మాన్ హీరోగా వెంకీ అట్లూరీ డైరెక్షన్‌లో వచ్చిన 'లక్కీభాస్కర్' మూవీ విజయవంతంగా ప్రదర్శితమౌతున్నది. ఈ సినిమా మూడు రోజుల్లోనే రూ. 39.9 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసినట్లు చిత్రబృందం ప్రకటించింది. అటు ప్రేక్షకుల ఆదరణతో పాటు సినీ ప్రముఖల ప్రశంసలు అందుకుంటున్నది. ఈ క్రమంలోనే నటుడు విశ్వక్‌సేన్ ఈ మూవీపై తన అభిప్రాయాన్ని సోషల్ మీడియా 'ఎక్స్' ద్వారా తెలియజేశారు. ఈ మేరకు పోస్ట్ పెట్టారు. 'నిన్న రాత్రి 'లక్కీభాస్కర్' చూశా. అత్యుత్తమ చిత్రాల్లో ఇదొకటి. మునుపెన్నడూ లేనివిధంగా ఈ సినిమాను తెరకెక్కించిన డైరెక్టర్‌గా వెంకీ అట్లూరి ఉన్నత శిఖరాలను అందుకున్నారు. దుల్కర్ సల్మాన్ కెరీర్‌లోనే ఇది బెస్ట్ ఫెర్ఫార్మెన్స్. మీనాక్షి చౌదరి కూడా మంచి ప్రదర్శనతో ఆకట్టుకున్నది. జీవీ ప్రకాశ్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అద్భుతంగా ఉన్నది. నిర్మాత నాగవంశీతో పాటు ఉత్తమ కంటెంట్‌ను అందించిన టీమ్ అందరికీ నా అభినందనలు. థియేటర్లలో ఈ అనుభూతిని పొందే అవకాశాన్ని కోల్పోకండి. ఈ సినిమా మరెన్నో విజయాలను అందుకోవాలని కోరుకుంటున్నా' అని రాసుకొచ్చారు.
దీనిపై స్పందించిన దుల్కర్ 'థాంక్యూ బ్రదర్. మీకు ఈ మూవీ నచ్చినందుకు ఆనందంగా ఉంది. 'మెకానిక్ రాకీ' విజయాన్ని అందుకోవాలని కోరకుంటున్నా' అని తెలిపారు. విశ్వక్‌సేన్ ప్రస్తుతం 'మెకానిక్ రాకీ' సినిమా రిలీజ్ పనుల్లో బిజీగా ఉన్నారు. రవితేజ ముళ్లపూడి డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీలో మీనాక్షి చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ హీరోయిన్లు. నవంబర్ 22న విడుదల కానున్నది.
'లక్కీభాస్కర్' కథ ఏమిటంటే?
1980-90ల్లో బ్యాంకింగ్ సెక్టార్ నేపథ్యంలో డైరెక్టర్ ఈ మూవీని తీర్చిదిద్దారు. భాస్కర్ అనే మధ్య తరగతి కుటుంబానికి చెందిన ఓ సాధారణ బ్యాంక్ ఉద్యోగి.. కుటుంబ బాధ్యతలు నెరవేర్చడం కోసం ఎలాంటి రిస్క్ చేశాడనే కథతో దీన్ని తెరకెక్కించాడు. అతని భార్యగా సుమతి పాత్రలో మీనాక్షి చౌదరి నటకు మంచి స్కోప్ ఉన్న పాత్ర పోషించారు. డైరెక్టర్ వెంకీ మేకింగ్, దుల్కర్ యాక్టింగ్‌ను మెచ్చకుంటూ పలువురు పోస్టులు పెడుతున్నారు.