Bholaa Shankar | భోళాశంకర్ రిలీజ్ కు లైన్ క్లియర్
Bholaa Shankar Release - భోళాశంకర్ విడుదలకు లైన్ క్లియర్ అయింది. ఈ మేరకు సిటీ సివిల్ కోర్టు, ఈ సినిమా విడుదలకు క్లియరెన్స్ ఇచ్చింది.
చిరంజీవి హీరోగా నటించిన సినిమా భోళాశంకర్. ఈ సినిమా ఊహించని విధంగా కోర్టు కేసును ఎదుర్కోవాల్సి వచ్చింది. వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్, భోళాశంకర్ విడుదలకు వ్యతిరేకంగా కోర్టులో కేసు వేశారు. సినిమా విడుదల ఆపాలని కోరారు. అయితే సతీష్ వేసిన పిటిషన్ ను హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు కొట్టేసింది.
ఇంతకీ ఏం జరిగింది..
ఏజెంట్ టైమ్ లో అనీల్ సుంకర తనను మోసం చేశారనేది సతీష్ ఆరోపణ. తనకు వైజాగ్ తో పాటు, తమిళ-కన్నడ థియేట్రికల్ రైట్స్ కూడా ఇస్తానని చెప్పి 30 కోట్ల రూపాయలు తీసుకున్నారని, కానీ కేవలం వైజాగ్ రైట్స్ మాత్రమే ఇచ్చారని ఆయన ఆరోపించారు. ఆ తర్వాత పలు సందర్భాల్లో అనీల్ సుంకరను, సతీష్ కలిశారట.
ఆ టైమ్ లో కూడా అనీల్ సుంకర నుంచి సతీష్ కు స్పష్టమైన హామీ వచ్చిందట. ఒక దశలో భోళాశంకర్ రిలీజ్ కు ముందే సెటిల్ మెంట్ చేస్తానని అనీల్ తనకు మాటిచ్చారంటున్నారు సతీష్. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని, ఏజెంట్ నష్టాలను తనకు భర్తీ చేసేంతవరకు భోళాశంకర్ సినిమా రిలీజ్ ను ఆపాలంటూ కోర్టుకెట్టారు సతీష్.
సతీష్ పిటిషన్ ను కోర్టు కొట్టేసింది. భోళాశంకర్ తో సంబంధం లేకుండా ఈ వివాదాన్ని తేల్చుకోవాలని సూచించింది. దీంతో భోళాశంకర్ రిలీజ్ కు లైన్ క్లియర్ అయింది. రేపు ప్రపంచవ్యాప్తంగా చిరంజీవి సినిమా థియేటర్లలోకి వస్తోంది.
మెహర్ రమేష్ డైరక్ట్ చేసిన ఈ సినిమా, తమిళ్ లో వచ్చిన వేదాళం సినిమాకు రీమేక్ గా తెరకెక్కింది. సినిమాలో చిరంజీవి చెల్లెలుగా కీర్తిసురేష్ నటించగా, చిరంజీవి సరసన హీరోయిన్ గా తమన్న నటించింది.