కోవిడ్ పంజా : ముందు ముందు పరిస్థితి ఏంటో.. నిర్మాతల్లో వణుకు

కరోనా మళ్లీ రాదేమోనని ఎంతోమంది నిర్మాతలు భారీ ప్రాజెక్టులు చేపట్టారు. అవి పూర్తవడానికి ఇంకా సంవత్సరమైనా పట్టొచ్చు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ కరోనా ఆంక్షలు మొదలైతే మళ్లీ నష్టపోవాల్సి వస్తుందని నిర్మాతలు భయపడుతున్నారు.

Advertisement
Update:2022-12-24 12:28 IST

కరోనా వల్ల మూడేళ్ల పాటు సినీ ఇండస్ట్రీ బాగా దెబ్బతింది. వీళ్లకు ఏళ్లు సినిమాల షూటింగ్ జరగడం, సినిమాలు బాగున్నప్పటికీ ప్రేక్షకులు థియేటర్లకు రాకపోవడం వంటి కారణాలతో నిర్మాతలు ఆర్థికంగా నష్టపోయారు. గత ఏడాది ఆఖరు, ఈ ఏడాది ప్రారంభం నుంచి దాదాపు 13 నెలలపాటు కరోనా కేసులు లేకపోవడంతో సినీ ఇండస్ట్రీ మళ్ళీ కోలుకుంది. ఇక కరోనా మళ్లీ రాదేమోనని ఎంతోమంది నిర్మాతలు భారీ ప్రాజెక్టులు చేపట్టారు. అవి పూర్తవడానికి ఇంకా సంవత్సరమైనా పట్టొచ్చు. ఈ పరిస్థితుల్లో మళ్ళీ కరోనా ఆంక్షలు మొదలైతే మళ్లీ నష్టపోవాల్సి వస్తుందని నిర్మాతలు భయపడుతున్నారు.

ప్రస్తుతం తెలుగులో అల్లు అర్జున్ - సుకుమార్ కాంబినేషన్లో వస్తున్న పుష్ప 2, పవన్ కళ్యాణ్- క్రిష్ కాంబినేషన్లో హరిహర వీరమల్లు, రామ్ చరణ్ - శంకర్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఆర్సీ15, మహేష్ బాబు - త్రివిక్రమ్ మూవీ, ప్రభాస్ - ప్రశాంత్ నీల్ సలార్ మూవీ, అలాగే ప్రభాస్ - నాగ్ అశ్విన్ ప్రాజెక్ట్ కే, ఎన్టీఆర్ - కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న సినిమాలను భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాలు పూర్తయేందుకు ఇంకా చాలా సమయం పట్టే అవకాశం ఉంది. ఆలోగా మళ్లీ కరోనా విజృంభిస్తే తమ పరిస్థితి ఏంటని నిర్మాతలు ఆలోచనలో పడిపోయారు.

ఇక ఈ సంక్రాంతికి వాల్తేరు వీరయ్య, వీర సింహారెడ్డి వంటి భారీ బడ్జెట్ సినిమాలు థియేటర్లలో విడుదల కానున్నాయి. ఈ సినిమాలకు సంబంధించి ఇప్పటికే ప్రమోషన్లు కూడా మొదలుపెట్టారు. ఇదిలా ఉండగా.. ప్రస్తుతం చైనా, జపాన్, అమెరికాలలో కరోనా తీవ్రత పెరగడంతో కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. భౌతిక దూరం పాటించాలని, మాస్కులు పెట్టుకోవాలని మార్గదర్శకాలు జారీ చేస్తోంది. ఇప్పుడే పరిస్థితి ఈ విధంగా ఉంటే సంక్రాంతి సమయానికి ఎలా ఉంటుందోనని నిర్మాతలు భయపడుతున్నారు. సంక్రాంతికి వచ్చే సినిమాలు సజావుగా విడుదల అవుతాయా లేదా అనే సందేహాలు నెలకొన్నాయి. అప్పటికి ఒకవేళ కరోనా ఆంక్షలు కొంతమేర విధించినా, ప్రజల్లో మళ్లీ కరోనా భయం పెరిగినా తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని నిర్మాతలు ఆందోళన చెందుతున్నారు.

Tags:    
Advertisement

Similar News