కృష్ణంరాజు మృతికి కారణం ఇదే
ఈరోజు ఉదయం హైదరాబాద్ లోని ఓ ప్రైవేట్ హాస్పిటల్ లో ప్రముఖ నటుడు కృష్ణంరాజు కన్నుమూసిన సంగతి తెలిసిందే. ఆయన మృతికి కారణాల్ని వైద్యులు వెల్లడించారు.
ప్రముఖ నటుడు, రెబల్ స్టార్ కృష్ణంరాజు ఈరోజు ఉదయం కన్నుమూసిన సంగతి తెలిసిందే. గత కొంతకాలంగా హైదరాబాద్ లోని ఓ కార్పొరేట్ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న కృష్ణంరాజు ఈరోజు ఉదయం మృతి చెందారు. ఈయన మృతికి కారణాల్ని వైద్యులు వెల్లడించారు.
కొన్ని రోజులుగా కృష్ణంరాజు గుండె కొట్టుకునే తీరులో మార్పులు చోటుచేసుకున్నాయంటున్నారు వైద్యులు. దీనికితోడు షుగర్ వ్యాధి, పోస్ట్ కరోనా సమస్యల వల్ల ఈరోజు ఉదయం తీవ్రమైన గుండెపోటు రావడంతో కృష్ణంరాజు మృతిచెందారు. ఇవి కాకుండా, కొన్ని రోజులుగా కృష్ణంరాజు పలు సమస్యలతో బాధపడుతున్నట్టు వైద్యులు తెలిపారు.
గతేడాది ఆయన కాలికి శస్త్ర చికిత్స జరిగింది. రక్త ప్రసరణ సరిగ్గా లేకపోవడం వల్ల కాలికి ఆపరేషన్ నిర్వహించారు. దీంతోపాటు దీర్ఘకాలంగా మూత్రపిండాలు, ఊపిరితిత్తుల సమస్యతో ఆయన బాధపడుతున్నారు. వీటికి తోడు పోస్ట్ కరోనా సమస్యలతో గతనెల 5వ తేదీన హాస్పిటల్ లో చేరారు కృష్ణంరాజు.
తప్పనిసరి పరిస్థితుల మధ్య అతిగా మందులు తీసుకోవడం వల్ల డ్రగ్ రెసిస్టెంట్ బ్యాక్టీరియా కారణంగా ఆయన ఊపిరితిత్తుల్లో సివియర్ న్యుమోనియా ఉన్నట్టు వైద్యులు గుర్తించారు. అదే సమయంలో కిడ్నీలు కూడా దెబ్బతిన్నాయి. అలా కొన్ని రోజులుగా వెంటిలేటర్ పై ఉంచుతూ చికిత్స అందించారు వైద్యులు.
అయితే ఎంత ప్రయత్నించినప్పటికీ శరీరంలో పలు అవయవాల పనితీరు దెబ్బతినడం వల్ల, ఈరోజు ఉదయం గుండెపోటు వచ్చి కృష్ణంరాజు మృతి చెందినట్టు ప్రకటించారు వైద్యులు.