అది సినిమా డైలాగ్ కాదంటా.. చిరంజీవి మనసులో మాటే

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి గ్లామర్ టచ్ ఇవ్వాలని అధిష్టానం ఎప్పటి నుంచో భావిస్తోంది. ఇటీవల పలువురు సెలెబ్రిటీలను కలిసినా.. వాళ్లు పార్టీ కోసం పూర్తి స్థాయిలో పని చేస్తారనే నమ్మకం లేదు. మెగాస్టార్ చిరంజీవి అయితే ఆ స్థానానికి కరెక్ట్‌గా సరిపోతారని అనుకుంటోంది.

Advertisement
Update:2022-09-21 08:18 IST

మెగాస్టార్ చిరంజీవికి సినిమా ఇండ‌స్ట్రీలో ఎదురే లేదు. కొన్ని ఏళ్ల పాటు తన నటన, డ్యాన్సులతో తెలుగు ప్రేక్షకులను ఉర్రూతలూగించారు. కానీ, రాజకీయాల్లోకి వచ్చి తన పేరునంతా చెడగొట్టుకున్నారు. ప్రజారాజ్యం పార్టీ పెట్టిన దగ్గర నుంచి దాన్ని కాంగ్రెస్‌లో విలీనం చేసే వరకు అంతా వివాదాస్పదమే. ఇక ఇప్పుడు చిరంజీవి ఏ పార్టీలో ఉన్నాడంటే చెప్పడం కష్టమే. అసలు రాజకీయాల్లో ఉన్నారో లేదో కూడా తెలియని పరిస్థితి. అయితే తాజాగా మెగాస్టార్ నటించిన 'గాడ్ ఫాదర్' సినిమాకు సంబంధించిన డైలాగ్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. 'నేను రాజకీయాలకు దూరం అయ్యాను. కానీ రాజకీయాలు నాకు దూరం కాలేదు' అని చెప్పిన డైలాగ్ ఇప్పుడు మార్మోగిపోతోంది. అది సినిమా డైలేగే అయినా.. చిరంజీవి మనసులో మాటను బయటపెట్టారనే చర్చ జరుగుతోంది. త్వరలోనే రాజకీయాల్లోకి చిరు రీఎంట్రీ ఇవ్వడం ఖాయమని చెప్తున్నారు.

తెలుగు రాష్ట్రాల్లో బీజేపీకి గ్లామర్ టచ్ ఇవ్వాలని అధిష్టానం ఎప్పటి నుంచో భావిస్తోంది. ఇటీవల పలువురు సెలెబ్రిటీలను కలిసినా.. వాళ్లు పార్టీ కోసం పూర్తి స్థాయిలో పని చేస్తారనే నమ్మకం లేదు. మెగాస్టార్ చిరంజీవి అయితే ఆ స్థానానికి కరెక్ట్‌గా సరిపోతారని అనుకుంటోంది. ముఖ్యంగా ఏపీలో మెగాస్టార్‌ను సీఎం అభ్యర్థిగా ప్రచారం చేసి ఓట్లు దండుకోవాలనేది బీజేపీ ప్లాన్. అందుకే ఇటీవల చిరంజీవి దగ్గరకు రాయబారం నడిపినట్లు కూడా తెలుస్తోంది. చిరంజీవి మాత్రం ఆ ప్రతిపాదనలకు ఓకే చెప్పలేదు. అలాగని పూర్తిగా నో కూడా చెప్పనట్లు సమాచారం. అంటే భవిష్యత్‌లో ఆ పార్టీతో టచ్‌లో ఉండటానికే అలా సందిగ్ధంలో పెట్టినట్లు తెలుస్తుంది.

చిరంజీవి తమ పార్టీ వ్యక్తే అని జనసేన నాయకులు చెప్తున్నారు. రాబోయే రోజుల్లో ఆయన పార్టీ వ్యవహారాల్లో చురుకుగా ఉంటారని అంటున్నారు. సోదరుడు పవన్ కల్యాణ్ పార్టీపై చిరంజీవికి ఎలాంటి వ్యతిరేకత లేదని.. అవసరం అయిన సమయంలో తప్పకుండా పార్టీలోకి వస్తారని అంటున్నారు. ఇప్పటికే తమ్ముడితో కలిసి మరో అన్న నాగబాబు పని చేస్తున్న విషయాన్ని గుర్తు చేస్తున్నారు. వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లోపు చిరంజీవి తప్పకుండా పార్టీలోకి వచ్చి.. ప్రచారం చేస్తారని అంటున్నారు.

కాంగ్రెస్ పార్టీ మాత్రం చిరంజీవి తమ పార్టీలో ఇప్పటికీ కొనసాగుతున్నారని చెప్తున్నారు. ప్రజారాజ్యం పార్టీని విలీనం చేసిన తర్వాత కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ సభ్యత్వం ఇవ్వడమే కాకుండా కేంద్ర మంత్రిని కూడా చేసింది. అయితే కేంద్రంలో కాంగ్రెస్ ఓడిపోయిన తర్వాత చిరంజీవి సైలెంట్ అయిపోయారు. అప్పటికీ రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతున్నా.. కాంగ్రెస్ కార్యక్రమాలకు మాత్రం దూరమయ్యారు. చిరంజీవి ఓకే అంటే ఏపీలో కీలక పదవి కట్టబెడతామని కాంగ్రెస్ అధిష్టానం ఆఫర్ కూడా ఇచ్చింది. అయితే కనీసం పార్టీ క్రియాశీల సభ్యత్వాన్ని కూడా చిరంజీవి రెన్యూవల్ చేసుకోలేదు. కాగా, రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీతో ఈ విషయం చెప్పిస్తామని కొంతమంది ఏపీ కాంగ్రెస్ నాయకులు అంటున్నారు. అసలు రాష్ట్రంలో ఉనికే లేకుండా పోయిన కాంగ్రెస్‌లోకి చిరంజీవి యాక్టీవ్ అవుతారా అనే అనుమానాలు నెలకొన్నాయి.

ఆ మధ్య చిరంజీవి ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా కలిశారు. ఆ భేటీ తర్వాత చిరుకు రాజ్యసభ సభ్యత్వం గ్యారెంటీ అని మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ విషయంపై చిరంజీవి మాత్రం అసలు స్పందించలేదు. వైసీపీ కూడా చిరంజీవి విషయంలో ఆచితూచి వ్యవహరించింది. కాగా, భవిష్యత్‌లో చిరంజీవి వస్తానంటే పార్టీలో మంచి స్థానం ఇవ్వాలని వైఎస్ జగన్ భావిస్తున్నారట. పవన్ కల్యాణ్ ద్వారా కాపుల్లో చెడిపోయిన సంబంధాలను చిరంజీవిని తీసుకొని రావడం ద్వారా బాగు చేసుకోవచ్చని అంచనా వేస్తున్నారు. చిరంజీవి కూడా వైఎస్ జగన్ పాలనపై కానీ, వైసీపీపై కానీ ఇప్పటి వరకు ఎలాంటి నెగెటీవ్ కామెంట్లు చేయలేదు. అలాగని వేరే పార్టీలను కాదని ఆయన వైసీపీలోకి వెళ్లడం అంత ఈజీ కాదు.

ఏదేమైనా చిరంజీవి మాత్రం తన రీఎంట్రీ విషయంలో ఎలాంటి లీకులు ఇవ్వడం లేదు. కానీ సినిమా డైలాగు ద్వారా రాజకీయాలు తనకు దూరం కాలేదని మాత్రం చెప్పుకుంటున్నారు. మరి ఆయన ఏ పార్టీలో చేరతారనేది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్.

Tags:    
Advertisement

Similar News