గ్రాండ్ మాస్టర్ గుకేశ్‌కు హీరోల దీవెనలు
పుస్తకాన్ని బహుమతిగా ఇచ్చిన రజనీ.. గుకేశ్‌కు స్పెషల్ గిఫ్ట్ ఇచ్చిన శివకార్తికేయన్
ప్రపంచ చెస్ ఛాంపియన్ షిప్ లో చరిత్ర సృష్టించిన భారత యువ గ్రాండ్ మాస్టర్ గుకేశ్ సినీ హీరోలను కలిశారు. అగ్రహీరో రజనీకాంత్ నివాసానికి వెళ్లిన గుకేశ్ ఆయనతో కొంత సమయాన్ని గడిపారు. ఆ ఫొటోలను ఎక్స్ వేదికగా పంచుకొని ఎంతో ఆనందంగా ఉందన్నారు.
తన ప్రతిభతో ప్రపంచాన్ని ఆకర్షించిన గుకేశ్‌ను రజనీకాంత్, శివకార్తికేయన్‌లు సన్మానించారు. చెన్నైలో రజనీకాంత్ నివాసానికి వెళ్లిన గుకేశ్ ఆయనతో ప్రత్యేకంగా మాట్లాడారు. రజనీకాంత్ ఒక పుస్తకాన్ని బహుమతిగా అందించారు. ఈ ఫోటోలను పంచుకున్న గ్రాండ్ మాస్టర్.. సూపర్ స్టార్‌కు ధన్యవాదాలు చెప్పారు. మిమ్మల్ని కలిసే అవకాశం ఇచ్చినందుకు, నాతో సమయం గడిపినందకు ధన్యవాదాలు సర్' అని పేర్కొన్నారు. ఇటీవల 'అమరన్'తో సూపర్ హిట్‌ను అందుకున్న శివకార్తికేయన్‌ను కూడా గుకేశ్ కలిశారు. అతడికి శివకార్తికేయన్ ఓ వాచ్‌ను బహుమతిగా ఇచ్చారు. తన అభిమాన నటుడిని కలిసినందుకు ఎంతో ఆనందంగా ఉందని గుకేశ్ అన్నారు. ప్రస్తుతం ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి.
ప్రపంచ చెస్ ఛాంపియన్‌షిప్‌లో చరిత్ర సృష్టించిన గుకేశ్‌పై సినీ ప్రముఖులు ఇటీవల ప్రశంసలు కురిపించిన విషయం విదితమే. అతడిని అభినందిస్తూ ఇండస్ట్రీలోని అగ్ర నటీనటులు పోస్టులు పెట్టారు. అలాగే గుకేశ్ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఇష్టమైన సినిమాల గురించి పంచుకున్నారు. అప్పుడప్పుడు సినిమాలు చూస్తుంటా. ఇష్టమైన సినిమాలు చాలా ఉన్నాయి. తెలుగులో విజయ్ దేవరకొండ నటించిన 'గీత గోవిందం' అంటే ఇష్టం. తమిళంలో సూర్య యాక్ట్ చేసిన 'వారణం ఆయిరం' (సూర్య సన్నాఫ్ కృష్ణన్) హిందీతో హృతిక్ రోషన్ మూవీ 'జిందగీ నా మిలేగీ దోబారా' అంటే ఇష్టం. హాలీవుడ్ 'అబౌట్ టైమ్' నచ్చిందని చెప్పారు.