అల్లు అర్జున్ వివాదానికి ఇక ముగింపు!
రేపు సీఎం రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖుల భేటీ
అల్లు అర్జున్ వివాదానికి ముగింపు పలికే దిశగా అడుగులు పడుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో సినీ ప్రముఖులు భేటీ కానున్నారు. ప్రముఖ నిర్మాత, ఎఫ్‌డీసీ చైర్మన్ దిల్ రాజు చొరవతో ప్రభుత్వ పెద్దలకు, సినీ ప్రముఖులకు మధ్య జరుగుతున్న మాటల యుద్ధానికి ఇక పుల్ స్టాప్ పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. పుష్ప -2 ప్రీమియర్ షో సందర్భంగా ఆర్టీసీ క్రాస్ రోడ్డులోని సంధ్య థియేటర్ లో తొక్కిసలాట జరిగి రేవతి అనే మహిళ మృతిచెందారు.. ఆమె తనయుడు శ్రీతేజ హాస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు. హీరో అల్లు అర్జున్ రోడ్ షో చేయడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని పోలీసులు ఆయనను అరెస్ట్ చేశారు. దీంతో సీఎం రేవంత్ రెడ్డితో పాటు ప్రభుత్వం సినీ రాజకీయ ప్రముఖులు విమర్శలు ఎక్కు పెట్టారు. సీఎం సహా మంత్రులు, కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు అంతే తీవ్రతతో తిప్పికొట్టారు. రేవతి కుటుంబానికి పుష్ప -2 యూనిట్ బుధవారం రూ.2 కోట్ల ఆర్థిక సాయం అందజేసింది. త్వరలోనే సీఎం రేవంత్ రెడ్డితో భేటీ అయి సినీ పరిశ్రమకు సంబంధించిన అంశాలపై చర్చిస్తామని ఇదే సందర్భంలో దిల్ రాజు ప్రకటించారు. ఆయన జోక్యంతో గురువారం ఉదయం 10 గంటలకు బంజారాహిల్స్ లోని పోలీస్ కమాడ్ కంట్రోల్ సెంటర్ లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి చిత్ర పరిశ్రమ నుంచి దిల్ రాజు, చిరంజీవి, అల్లు అరవింద్, వెంకటేశ్ సహా ప్రముఖ నిర్మాతలు, దర్శకులు హాజరవుతారు. ప్రభుత్వం నుంచి సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్క, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి, దామోదర రాజనర్సింహ పాల్గొంటారు.