పాత యోధులు కొత్త ఆయుధాలతో వస్తున్నారు!
ఆ నలుగురు- 63 ఏళ్ళ సంజయ్ దత్, 65 ఏళ్ళ సన్నీ డియోల్, 66 ఏళ్ళ జాకీ ష్రాఫ్, 72 మిథున్ చక్రవర్తి- పాత యోధులు కలిసి కొత్త ఆయుధాలతో వస్తున్నారు. 1980- 90 లలో హీరోలుగా, స్టార్లుగా ఓ వెలుగు వెలిగిన నల్గురూ తర్వాత సహాయ పాత్రలు నటిస్తూ వచ్చారు.
ఆ నలుగురు- 63 ఏళ్ళ సంజయ్ దత్, 65 ఏళ్ళ సన్నీ డియోల్, 66 ఏళ్ళ జాకీ ష్రాఫ్, 72 మిథున్ చక్రవర్తి- పాత యోధులు కలిసి కొత్త ఆయుధాలతో వస్తున్నారు. 1980- 90 లలో హీరోలుగా, స్టార్లుగా ఓ వెలుగు వెలిగిన నల్గురూ తర్వాత సహాయ పాత్రలు నటిస్తూ వచ్చారు. జాకీ ష్రాఫ్ గత వారమే విడుదలైన ''ఫోన్ భూత్' హార్రర్ కామెడీలో తాంత్రికుడిగా దుష్ట పాత్ర నటించాడు. సన్నీడియోల్ ఇటీవల విడుదలైన 'చుప్' సీరియల్ కిల్లర్ థ్రిల్లర్ లో పోలీసు అధికారిగా నటించాడు. ప్రస్తుతం అమీషా పటేల్‌తో కలిసి అనిల్ శర్మ దర్శకత్వంలో 'గదర్ 2' లో నటిస్తున్నాడు. ఆ తర్వాత వచ్చే ఏడాది తండ్రి ధర్మేంద్ర, సోదరుడు బాబీ డియోల్, కొడుకు కరణ్ డియోల్‌లతో కలిసి 'అప్నే 2' షూటింగ్ ప్రారంభిస్తాడు.
సంజయ్ దత్ 'కేజీఫ్ 2' లో క్రూర విలన్ గా నటించాడు. రణబీర్ కపూర్, వాణీ కపూర్ లు నటించిన 'షంషేరా' లో కూడా విలన్‌గా నటించాడు. ఇక మిథున్ చక్రవర్తి 'కాశ్మీర్ ఫైల్స్' లో పోలీస్ అధికారిగా నటించాడు. ఇప్పుడీ నల్గురూ కలిసి 'బాప్' అనే ఓ మల్టీ స్టారర్ లో నటిస్తూ ఫస్ట్ లుక్ విడుదల చేశారు.
నవంబర్ 9 న విడుదల చేసిన ఫస్ట్ లుక్ కి నెటిజనులు వెర్రెత్తి పోయారు. ఇది వూహించని గిఫ్ట్ తమకి. ఈ పాత యోధులకి ఇంకా ఎంత ఫాలోయింగ్ వుందో నెటిజన్లని చూస్తే తెలిసిపోతుంది. దీనికి తగ్గట్టు తమ మల్టీ స్టారర్ ని 'బాప్ ఆఫ్ ఆల్ ఫిలిమ్స్, షూట్ ఢమాల్, దోస్తీ బేమిసాల్' అంటూ సన్నీ డియోల్ పోస్టు చేసి ఇంకా క్రేజ్ సృష్టించాడు. ఫస్ట్ లుక్ లో నల్గురు పాత యోధులు కరుడు గట్టిన గ్యాంగ్ స్టార్స్ గా పోజిచ్చారు.
ఈ సీనియర్లు గతంలో యంగ్ హీరోలుగా నలుగురు కాక పోయినా ఇద్దరిద్దరు కలిసి నటించిన సినిమా లున్నాయి. జాకీ ష్రాఫ్, సంజయ్ దత్ లు తమ కెరీర్‌లో అతి పెద్ద బ్లాక్‌బస్టర్‌లలో ఒకటైన సుభాష్ ఘై మూవీ 'ఖల్నాయక్' లో మాధురీ దీక్షిత్ తో కలిసి నటించారు. జాకీ ష్రాఫ్, సన్నీ డియోల్ లు కలిసి జేపీ దత్తా తీసిన అతి పెద్ద హిట్ వార్ మూవీ 'బోర్డర్' తో పాటు 'త్రిదేవ్', 'దుష్మన్' లలో నటించారు. సంజయ్ దత్, సన్నీ డియోల్ లు కలిసి 'యోధ', 'క్షత్రియ', 'క్రోధ్' వంటి సినిమాల్లో నటించారు. ఇక సంజయ్ దత్, మిథున్ చక్రవర్తిలు 'లక్', 'ఇలాకా' సినిమాల్లో నటించారు.
నిర్మాత అహ్మద్ ఖాన్ - జీ స్టూడియో కలిసి కేవలం 25 ఓట్ల బడ్జెట్ తో నిర్మిస్తున్న ఈ మల్టీస్టారర్ 'బాప్' హాలీవుడ్ హిట్ 'దిఎక్స్ పెండబుల్స్' కి లోకల్ వెర్షన్ అని వినిపిస్తోంది. ఇదిలా వుంటే, సినిమాలో మరికొన్ని సర్ ప్రైజ్ ఎలిమెంట్స్ వుండనున్నాయి- అవి క్రమంగా వెల్లడి చేస్తామని దర్శకుడు వివేక్ చౌహాన్ తెలిపాడు. ఇతను 'హై వే', 'తను వెడ్స్ మనూ రిటర్న్స్' తీశాడు.
'ది ఎక్స్ పెండబుల్స్' ఫ్రాంచైజీలో నాలుగు సినిమాలు విడుదలై క్రేజ్ సృష్టించాక, కామిక్ బుక్ సిరీస్ కి కూడా దారి తీసింది. 2010లో విడుదలైన మొదటి మూవీ 'ది ఎక్స్ పెండబుల్స్' లో జేసన్ స్టాథమ్, జెట్ లీ, డాల్ఫ్ లండ్‌గ్రెన్ లతో కలిసి మాజీ సూపర్ స్టార్ సిల్వెస్టర్ స్టాలోన్ నటించాడు. ఫ్రాంచైజీలో తర్వాతి మూవీస్ లో బ్రూస్ విల్లీస్, ఆర్నాల్డ్ స్క్వార్జెనెగర్, చక్ నోరిస్, జీన్-క్లాడ్ వాన్ డామ్, మిక్కీ రూర్కే, హారిసన్ ఫోర్డ్ నటించారు.
దీన్ని పాత యోధులు కలిసి నటిస్తూ యాక్షన్ సినిమాలకే (బాప్) బాబు లాంటిది అంటున్నారు. ఇక వీళ్ళ కొత్త ఆయుధాలేమిటో, వాటిని ఎలా ప్రయోగించి ఈ మల్టీ స్టారర్ ని హిట్ చేస్తారో తెలియాలంటే వచ్చే ఏడాది దాకా ఆగాల్సిందే. ఈ ఏడాది జూన్ లో షూటింగ్ ప్రారంభమయిన 'బాప్' 2023లో విడుదలవుతుంది.