T-Series: టాలీవుడ్ లోకి టీ- సిరీస్ వచ్చేసింది!
T-Series: ఇక టాలీవుడ్ లోకి సుప్రసిద్ధ టీ - సిరీస్ బాలీవుడ్ బ్యానర్ అడుగు పెడుతోంది.
ఇక టాలీవుడ్ లోకి సుప్రసిద్ధ టీ - సిరీస్ బాలీవుడ్ బ్యానర్ అడుగు పెడుతోంది...
విజయవంతమైన ‘ఆదిపురుష్’ నిర్మాణంతో పెంపొందిన ఆత్మవిశ్వాసంతో ఏకంగా తెలుగు సినిమాలు నిర్మించేందుకు ముందుకొచ్చేసింది. టాలీవుడ్ లో కార్యాలయం ప్రారంభించి మరిన్ని పానిండియా తెలుగు సినిమాలు నిర్మించేందుకు ఏర్పాట్లు ప్రారంభించింది. ఏడంతస్తుల కార్యాలయ భవనం కోసం స్థలం కొనుగోలు ప్రక్రియ కూడా పూర్తి చేసింది. దీంతో ఇక తెలుగు స్టార్స్ కి, తెలుగు స్టార్ దర్శకులకీ డిమాండ్ పెరిగినట్టే. అదే సమయంలో తెలుగు బిగ్ బ్యానర్స్ కి పోటీ కూడా పెరిగినట్టే.
బాలీవుడ్ కి చెందిన టీ -సిరీస్ కార్పొరేట్ సంస్థ సంగీత రంగంలో విపరీతమైన పాపులారిటీని సంపాదించిన తర్వాత, హిందీ సినిమాల నిర్మాణాలు చేపట్టి, ఇప్పుడు తెలుగు సినిమా పరిశ్రమలో కూడా తనకంటూ ప్రత్యేక గుర్తింపుని పొందాలని ప్రయత్నిస్తోంది. ఇప్పటికే ప్రభాస్ నటించిన 'ఆదిపురుష్' అనే 600 కోట్ల భారీ వెంచర్ ని సక్సెస్ చేసిన నేపథ్యంలో పెరిగిన పరపతితో తెలుగు స్టార్స్ తో, స్టార్ డైరెక్టర్స్ తో చురుకుగా చర్చలు జరుపుతోంది.
టీ-సిరీస్ తెలుగు పానిండియా సినిమాలు నిర్మించడానికి హైదరాబాద్‌లో విశాలమైన ఏడు అంతస్తుల కార్యాలయాన్ని నిర్మించబోతోంది. 400 చదరపు గజాల స్థలం లో టీ- సిరీస్ ముంబాయి కార్యాలయాన్ని పోలి వుండే ఏడంతస్తుల కార్యాలయ భవనాన్ని అట్టహాసంగా నిర్మించబోతున్నట్టు తెలుస్తోంది. వర్క్ స్పేస్ రెంటల్స్ లో, సింగిల్-ఫ్లోర్ ఆఫీసుల్లో పనిచేసే ఇతర కార్పొరేట్ కంపెనీల వలే కాకుండా, టీ-సిరీస్ తెలుగు సినిమా ఎంట్రీని చాలా సీరియ్స్ గా తీసుకుని, శాశ్వత ప్రాతిపదికన స్థిరపడేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంది.
తెలుగు సినిమాలకి సంబంధించి భవిష్యత్తులో జరిగే అన్ని చర్చలకు ఈ కార్యాలయం కేంద్రంగా పనిచేస్తుంది. టాలీవుడ్‌లోకి టీ-సిరీస్ ఎంట్రీ చుట్టూ ఏర్పడిన ఆసక్తిని మరింత పెంచుతూ ‘అర్జున్ రెడ్డి’ ఫేమ్ దర్శకుడు సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో ‘పుష్ప’ పానిండియా స్టార్ అల్లు అర్జున్ తో కొత్త మూవీ నిర్మాణాన్ని చేపట్ట బోతోంది.
1983 నుంచీ సూపర్ క్యాసెట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ , టీ -సిరీస్ ఆడియో కంపెనీగా ముంబాయిలో పనిచేస్తోంది. దీని మార్కెట్ వాటా 35 శాతం. 1998 లో దీని వ్యవస్థాపకుడు గుల్షన్ కుమార్ మరణం తర్వాత కుమారుడు భూషణ్ కుమార్, మేనమామ క్రిషన్ కుమార్ తో కలిసి కంపెనీని సినిమా నిర్మాణ రంగంలో కూడా విస్తరించి బాలీవుడ్ లో పట్టు సాధించాడు. హిందీతో బాటు టీ -సిరీస్ నుంచి వివిధ భాషల్లో ఆడియోలు విడుదలయ్యాయి. 1987 లో తొలి తెలుగు టీ -సిరీస్ ఆడియో నాగార్జున నటించిన ‘మజ్నూ’. ఆ తర్వాత ‘స్వయం కృషి’, ‘లారీ డ్రైవర్’, ‘ముద్దుల మేనల్లుడు’, ‘గ్యాంగ్ లీడర్’ మొదలైన సినిమాల దగ్గర్నుంచీ, ‘పుష్ప 1’, ‘ఆర్ ఆర్ ఆర్’, ‘ఆది పురుష్’, ‘పుష్ప 2’ వరకూ మొత్తం 210 తెలుగు సినిమాల ఆడియోలు విడుదల చేసింది కంపెనీ.
ఇక హిందీలో ఇటీవలి సంవత్సరాల్లో ‘యానిమల్’,’షెహజాదా’, ‘తూ ఝూటీ, మై మక్కార్’ మొదలైన 13 సినిమాలు నిర్మించింది. టాలీవుడ్ లో బాలీవుడ్ బ్యానర్ ప్రవేశం ఇదే మొదటిది కాదు, గతంలో ఈరోస్ ఇంటర్నేషనల్ బ్యానర్ కూడా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చి సినిమాలు నిర్మించింది. మహేష్ బాబుతో ‘నేనొక్కడినే’, ‘ఆగడు’ రెండు సినిమాలు నిర్మించింది. హిందీలో ‘భజరంగీ భాయిజాన్’ సూపర్ హిట్ సినిమా నిర్మాణం తర్వాత బాలకృష్ణ తో తెలుగు సినిమా ప్లాన్ చేసింది గానీ ఇది ముందు కెళ్ళలేదు. ‘భజరంగీ భా యిజాన్’ రచయిత వి విజయేంద్ర ప్రసాద్‌తో కలిసి స్క్రిప్టులు తయారుచేసి హిందీ, తెలుగు తమిళ భాషల్లో సినిమాలతో బాటు వెబ్-సిరీస్‌లు నిర్మించి, పంపిణీ చేయడానికి పథక రచన చేసింది గానీ ఇదీ ఆగిపోయింది.
బాలీవుడ్ బ్యానర్లు టాలీవుడ్ లో సినిమాలు నిర్మించాలంటే కార్పొరేట్ కల్చర్ పనిచేయదు. సాధారణ- సాంప్రదాయ నిర్మాతగా పనిచేయాల్సిందే. కొన్ని ప్రముఖ బాలీవుడ్ నిర్మాణ సంస్థలు అనేక తెలుగు సినిమాల్ని నిర్మించాయి. అయితే అవి చలనచిత్ర నిర్మాణ సంస్థలా పనిచేయకుండా, కార్పొరేట్ కంపెనీలా పనిచేయడం వల్ల నష్టాలు మూటగట్టుకుని వెళ్ళాయి. ఇప్పుడు టీ- సిరీస్ తనవంతు అదృష్ట పరీక్షకి కార్పొరేట్ స్టయిల్లో పూనుకుంది. దీని ప్రయత్నం ఏమేరకు ఫలిస్తుందో వేచి చూడాలి.
తెలుగులో బిగ్ ప్రొడ్యూసర్స్ కీ, స్టార్ డైరెక్టర్స్ కీ కొదవ లేదు. బిగ్ స్టార్సే తక్కువ. ఈ బిగ్ స్టార్స్ ఒకొక్కరి చుట్టూ అయిదారుగురు స్టార్ డైరెక్టర్లు చక్కర్లు కొడుతూ వుంటారు. ఏ ఒక్కరికో లాటరీ తగులుతుంది. అదెప్పుడు తగులుతుందో తెలీదు. అప్పటి వరకూ ఆ బిగ్ స్టార్ కి లాక్ అయి వుండాల్సిందే. ఉన్న స్టార్ డైరెక్టర్స్ కి తోడు, ఏదో చిన్న లేదా మధ్యస్థ బడ్జెట్ సినిమా హిట్టయితే, ఆ కొత్త దర్శకుడు కూడా బిగ్ స్టార్ దగ్గర వాలిపోతాడు. వీళ్ళ సంఖ్య తక్కువేం లేదు. ఇలా కొత్తా పాతా దర్శకులందరికీ బిగ్ స్టార్సే కావాలి. ఉన్న కొద్ది మంది బిగ్ స్టార్స్ తో డజన్ల కొద్దీ దర్శకుల వృత్తి పోరాటం. ఈ కుమ్ములాటలో టీ- సిరీస్ ఏం చేస్తుంది? టీ- సిరీస్ తెలుగు బిగ్ స్టార్స్ కోసం తెలుగు బిగ్ ప్రొడ్యూసర్స్ తో సిగపట్లకి దిగాలి. బిగ్ స్టార్స్ ఎటువైపు వుంటారు? ముందు నుంచీ అనుబంధమున్న తెలుగు ప్రొడ్యూసర్స్ వైపే వుంటారు. సంపద సృష్టి బయటికి వెళ్ళి పోకూడదనే కోరుకుంటారు. వీటన్నిటినీ టీ- సిరీస్ ఎలా అధిగమిస్తుందన్నదే టాలీవుడ్ లో ఆసక్తి రేకెత్తిస్తున్న సన్నివేశం!