గెలవక ముందు జనసేని.. గెలిచిన తర్వాత భజనసేనాని : ప్రకాశ్‌రాజ్
జనసేన పార్టీ ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్‌రాజ్ ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు.;
నిన్న జరిగిన జనసేన పార్టీ ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై నటుడు ప్రకాశ్‌రాజ్ ట్విట్టర్లో కౌంటర్ ఇచ్చారు. గెలవక ముందు జనసేని గెలిచిన తర్వాత భజనసేనాని అంతేగా అని ప్రశ్నించారు. హిందీ వద్దంటూ దక్షిణాది రాష్ట్రాలకు మద్దతుగా గతంలో పవన్ కళ్యాణ్ చేసిన పోస్టుల్ని ట్వీట్‌కు జత చేశారు. వ్యాఖ్యలపై తమిళనాడులోని అధికార డీఎంకే నేతలతో పాటు నటుడు ప్రకాష్ రాజ్ కూడా స్పందించారు. ‘మీ హిందీ భాషను మా మీద రుద్దకండి అని చెప్పడం ఇంకో భాషను ద్వేషించడం కాదు.
స్వాభిమానంతో మా మాతృభాషను, మా తల్లిని కాపాడుకోవడం, అని పవన్ కళ్యాణ్‌కు ఎవరైనా చెప్పండి ప్లీజ్’ అని ప్రకాశ్ రాజ్ ట్వీట్ పెట్టారు. దీనికి బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి స్పందించారు. ప్రకాష్ రాజ్‌కు కౌంటర్‌గా ట్వీట్ పెట్టారు. భాషా విధానంపై తమిళనాడు వైఖరిని పవన్ తప్పుగా అర్థం చేసుకున్నారని డీఎంకే అధికార ప్రతినిధి డాక్టర్ సయ్యద్ హఫీజుల్లా వివరణ ఇచ్చారు. వ్యక్తిగతంగా హిందీ లేదా మరే ఇతర భాషలు నేర్చుకోవడానికి తమ సర్కారు అడ్డుపడట్లేదన్నారు. ప్రజలపై హిందీ లేదా మరే ఇతర భాషను బలవంతంగా రుద్దడాన్నే వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు.