గ్యాప్ రావడానికి కారణం అదే

చాలా తక్కువగా సినిమాలు చేస్తున్నారు అమల. ఆమె తలుచుకుంటే అవకాశాలు క్యూ కడతాయి. కానీ అలా చేయడం లేదు. ఎందుకు?

Advertisement
Update:2022-09-16 21:59 IST

లైఫ్ ఈజ్ బ్యూటిఫుల్ సినిమాతో రీఎంట్రీ ఇచ్చారు అక్కినేని అమల. ఇకపై వరుసగా సినిమాల్లో నటిస్తానని ఆ టైమ్ లో ప్రకటన కూడా చేశారు. కానీ అలా జరగలేదు. మళ్లీ ఆమె మరో తెలుగు సినిమా చేయడానికి చాలా ఏళ్లు పట్టింది. అలా ఒకే ఒక జీవితం సినిమాతో మళ్లీ తెరపైకొచ్చారు ఈ నటి. మరి ఈ గ్యాప్ ఎందుకు? కావాలనే తీసుకున్నారా? లేక వచ్చిందా?

"లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తర్వాత రెండు మలయాళం, మూడు హిందీ సినిమాలు, ఒక వెబ్ సిరీస్ చేశాను. ప్రతి భాషలో ప్రాజెక్ట్స్ చేస్తున్నాను. కానీ తెలుగులో లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్ తర్వాత ఇదే. అయితే గత ఐదేళ్ళుగా అన్నపూర్ణ ఫిల్మ్ అండ్ మీడియా నేనే చూసుకుంటున్నాను. వందల మంది విద్యార్ధుల భవిష్యత్, వాళ్ల బాధ్యత నాపై వుంది. ఈ భాద్యతని పక్కని పెట్టి నటించలేను. అయితే నా మనసుకు హత్తుకునే కథ విన్నపుడు, ఆ పాత్రకి నేను కరెక్ట్ అనిపిస్తే మాత్రం తప్పకుండా చేస్తాను. ఒకే ఒక జీవితం అలా మనసుకు నచ్చిన కథే. నిజాయితీతో తీసిన సినిమా ప్రేక్షకులకు ఎప్పుడూ నచ్చుతుంది. ఒకే ఒక జీవితం మరోసారి దాన్ని రుజువుచేసింది."

ఇలా తన గ్యాప్ కు కారణాన్ని బయటపెట్టారు అమల. పనిలోపనిగా ఒకే ఒక జీవితం సినిమా ఎందుకు చేయాల్సి వచ్చిందో కూడా వెల్లడించారు.

ఈ సినిమా ప్రీమియర్ చూసిన నాగార్జున, భావోద్వేగానికి గురైన సంగతి తెలిసిందే. దీనిపై స్పందించిన అమల, ప్రీమియర్ కు ముందే నాగార్జునను మానసికంగా సిద్ధం చేశానని, ఎమోషనల్ అవుతారని చెప్పానని తెలిపారు. తను ఊహించినట్టుగానే నాగ్ ఎమోషనల్ అయ్యారని, తన అమ్మను గుర్తుచేసుకున్నారని తెలిపారు.

Tags:    
Advertisement

Similar News