Tunisha Sharma: సెట్‌లోనే ఆత్మహత్య చేసుకున్న సినీ నటి తునిషా శర్మ

Tunisha Sharma Suicide: తునిషా శర్మ మరో 10 రోజుల్లో (జనవరి 4) 21వ పుట్టిన రోజు జరుపుకోవాల్సి ఉన్నది. కానీ ఇంతలోనే విగతజీవిగా మారడాన్ని బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు.

Advertisement
Update:2022-12-25 05:37 IST

బాల నటిగా సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టి.. హీరోయిన్‌గా మారి దశాబ్దకాలంగా వెండితెరపై ప్రేక్షకులను అలరిస్తున్న నటి తునిషా శర్మ ఆత్మహత్య చేసుకున్నది. సినిమా సెట్‌లోనే శనివారం ఆత్మహత్య చేసుకోవడంతో సినీరంగం ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురైంది. ముంబై వాలివ్‌లో జరుగుతున్న ఒక టీవీ షో సెట్ మేకప్ రూమ్‌లో ఉరి వేసుకొని చనిపోయింది. షూటింగ్ విరామ సమయంలో టాయిలెట్‌లోకి వెళ్లిన ఆమె ఎంత సేపటికీ బయటకు రాలేదు. దీంతో సెట్‌లో ఉన్న వాళ్లు తలుపులు పగులగొట్టి చూడగా.. ఉరి వేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే ఆమెను హుటాహుటిన ఆసుపత్రికి తరలించినా.. అప్పటికే చనిపోయినట్లు వైద్యులు దృవీకరించారు.

సినీనటి తునిషా శర్మ మరణ వార్త విని బాలీవుడ్‌లో విషాద ఛాయలు అలుముకున్నాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ ప్రారంభించారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. అయితే సూసైడ్ చేసుకోవడానికి గల కారణాలు ఏంటో ఇంకా తెలియరాలేదు. తునిషా శర్మ మరో 10 రోజుల్లో (జనవరి 4) 21వ పుట్టిన రోజు జరుపుకోవాల్సి ఉన్నది. కానీ ఇంతలోనే విగతజీవిగా మారడాన్ని బాలీవుడ్ ప్రముఖులు, అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఇక ఆత్మహత్యకు ముందు ఆమె సెట్‌లో తీసుకున్న వీడియోను ఇన్‌స్టాలో పోస్టు చేసింది. అక్కడ మేకప్ వేసుకుంటూ.. చేతిపై కోసుకున్నట్లు మేకప్ మ్యాన్ గాటు పెట్టాడు. అంతే కాకుండా తన ఫొటో పంచుకుంటూ 'అభిరుచితో పని చేసే వారు ఎప్పటికీ ఆగరు' అని కూడా రాసుకొచ్చింది.

తునిషా శర్మ బాల నటిగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది. 'భారత్ కా వీర్‌పుత్ర - మహారాణా ప్రతాప్' అనే టీవీ సీరియల్‌లో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ఆ తర్వాత పలు సీరియల్స్‌లో కూడా నటించింది. 'అలీ బాబా : దస్తాన్-ఏ-కాబుల్' లో యువరాణి మరియమ్ పాత్రను పోషిస్తోంది. అలాగే బాలీవుడ్‌లో కూడా పలు సినిమాల్లో నటించింది. 'బార్ బార్ దేఖో', 'కహానీ 2 : దుర్గా రాణి సింగ్', 'దబాంగ్ 3' వంటి చిత్రాల్లో కనిపించింది. కలర్స్ టీవీలో ప్రసారం అయిన 'ఇంటర్నెట్ వాలా లవ్' సీరియల్ ద్వారా మంచి పాపులారిటీ తెచ్చుకున్నది.

సోషల్ మీడియాలో చాలా యాక్టీవ్‌గా ఉండే తునిషా శర్మకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఎప్పుడూ చలాకీగా, సంతోషంగా కనపడే తునిషా.. ఎప్పటికప్పుడు తన ఫొటోలను అప్‌లోడ్ చేస్తూ.. అభిమానులను అలరిస్తూ ఉండేది. అయితే అకస్మాత్తుగా ఇలా ఆత్మహత్య చేసుకోవడంతో అందరూ షాక్‌కు గురవుతున్నారు.

Full View
Tags:    
Advertisement

Similar News