వారానికి 90 గంటలు పని.. ఎల్ అండ్ టీ చైర్మన్ కు కౌంటర్ల పరంపర
ఆనంద్ మహీంద్ర వ్యాఖ్యలు సమర్థిస్తూ సీరమ్ సీఈవో ట్వీట్
ఉద్యోగులు వారానికి 90 గంటలు పని చేయాలన్న ఎల్ అండ్ టీ చైర్మన్ ఎస్‌ఎన్ సుబ్రమణ్యన్ చేసిన వ్యాఖ్యలపై దుమారం కొనసాగుతూనే ఉంది. ఇప్పటికే షట్లర్ గుత్తా జ్వాలా, హీరోయిన్ దీపికా పదుకోన్ ఎల్ అండ్ టీ చైర్మన్ వ్యాఖ్యలపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మహీంద్ర గ్రూప్ చైర్మన్ ఆనంద్ మహీంద్ర కూడా సుబ్రమణ్యన్ వ్యాఖ్యలను తప్పుబట్టారు. ఇప్పుడు సీరమ్ సీఈవో వారితో జత కలిశారు. ఉద్యోగులు ఇంట్లో కూర్చొని భార్యలను అలా ఎంతసేపు చూస్తూ ఉంటారు.. ఇంట్లో తక్కువగా ఆఫీసులో ఎక్కువగా ఉంటామని.. అవసరమైతే ఆదివారం కూడా పని చేస్తామని భార్యలకు చెప్పాలని సుబ్రమణ్యన్ వ్యాఖ్యానించారు. ఈ కామెంట్స్ పై ఆనంద్ మహీంద్ర స్పందిస్తూ.. ఎన్ని గంటలు పని చేశామన్నది ముఖ్యం కాదు.. ఎంత పని చేశాం.. ఉత్పాదకే ముఖ్యమని చెప్పారు. తన భార్య ఎంతో మంచిదని.. ఆమెను చూస్తూ ఉండటం తనకెంతో ఇష్టమని కూడా పేర్కొన్నారు. సీరమ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదర్ పూనేవాలా స్పందిస్తూ.. ఆదివారాలు తనను చూస్తూ ఉండటమే తన భార్యకు ఇష్టమన్నారు. క్వాంటిటీ కన్నా క్వాలిటీనే ముఖ్యమని.. పనితో పాటు జీవితాన్ని బ్యాలెన్స్ చేసుకోవాలని ఎక్స్ లో పోస్ట్ చేశారు.