Affordable Homes | హైదరాబాద్‌లో సొంతిల్లు యమ కాస్ట్‌లీ గురూ.. కానీ ఈ సిటీలోనే చౌక ఇల్లు..!
Affordable Homes | తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సిటీ అత్యంత విలాసవంతమైన ఇండ్లలో రెండో స్థానానికి చేరుతుంది.
Affordable Homes | ప్రతి ఒక్కరూ సొంతింటి కల సాకారం చేసుకోవాలని కోరుకుంటారు.. పెరిగిన ధరలు, ఖర్చులతో సొంతింటి కల నిజం చేసుకోవడం ఎంతో కష్టమైన పని. ఇప్పుడు ఇల్లు కావాలంటే బ్యాంకులో రుణం తీసుకుని ఇల్లు కొనుక్కోవాల్సిందే. అలా తీసుకున్న రుణం దాదాపు 15 ఏండ్ల నుంచి.. 20 ఏండ్ల టెన్యూర్ ఉంటుంది. నెలవారీ వాయిదా చెల్లింపులు తడిసిమోపెడవుతాయి.. ఇక కరోనా మహమ్మారితో వర్క్ ఫ్రం హోం లేదా లెర్నింగ్ ఫ్రం హోం సంస్కృతి ప్రారంభం కావడంతో విశాలమైన, అన్ని వసతులు గల ఇంటికోసం ప్రతి ఒక్కరూ అన్వేసిస్తున్నారు.
అయినా ఎవరైనా అత్యంత తక్కువ ధరకే ఇల్లు సొంతం చేసుకోవాలని భావిస్తారు. తక్కువ ధర.. చౌక ధరకు పలు పారామీటర్లు ఉంటాయి. దీనికి నిర్దిష్ట బెంచ్‌మార్క్‌లు ఉండవు. దేశంలోని ఏ నగరం కూడా సింగిల్‌గా చౌక ధరకు ఇల్లు లభిస్తుందని చెప్పలేం. కనుక రియాల్టీ కన్సల్టింగ్ సంస్థ నైట్ ఫ్రాంక్ ఇండియా.. కొన్ని పారామీటర్ల మేరకు చౌకధరకు లభించే ఇల్లుపై ఒక అంచనా వేసింది. దేశంలోని ప్రధాన నగరాల్లో అహ్మదాబాద్‌లో అత్యంత చౌక ధర గల ఇల్లు లభిస్తాయని తెలిపింది.
బ్యాంకుల్లో తీసుకునే ఇండ్ల రుణాలు తీసుకున్న వారు ప్రతి నెలా.. నెలవారీ వాయిదా (ఈఎంఐ) చెల్లించాల్సి ఉంటుంది. అలా ఇండ్ల రుణాల ఈఎంఐ చెల్లించే వారిలో అహ్మదాబాద్ వాసులు 2023లో తమ నెలవారీ ఆదాయంలో 21 శాతం ఖర్చు చేశారు. తర్వాతీ స్థానాల్లో పుణె, కోల్‌కతా వాసులు తమ ఆదాయంలో 24 శాతం ఇండ్ల రుణాల ఈఎంఐ చెల్లింపు కోసం ఖర్చు చేశారని నైట్ ఫ్రాంక్ వెల్లడించింది. కరోనాకు ముందు ఆదాయంలో ఇంటి రుణ వాయిదా చెల్లింపు 2019 నుంచి 8 శాతం, 2022తో పోలిస్తే నిష్పత్తి ఒక శాతం తగ్గింది. ఈ రెండు నగరాల తర్వాత చెన్నై నిలిచింది. చెన్నై వాసులు 2022లో తమ ఆదాయంలో ఇంటి రుణ వాయిదా చెల్లింపునకు 27 శాతం చెల్లిస్తే, 2023లో 25 శాతానికి తగ్గింది.
గతేడాది ఇండ్ల రుణాలపై అధిక వడ్డీరేట్లు అమలులో ఉన్నా 2023లో చౌక ఇండ్ల నిష్పత్తి పాజిటివ్‌గా నిలుస్తుందని గణాంకాలు చెబుతున్నాయి. 2022తో పోలిస్తే 2023లో స్వల్పంగా మెరుగుదల నమోదైంది. కరోనాకు ముందు 2019తో పోలిస్తే, దేశంలోని ప్రధాన నగరాల్లో గతేడాది ఇండ్ల ధరలు గణనీయంగా తగ్గుముఖం పట్టాయని నైట్ ఫ్రాంక్ ఇండియా వెల్లడించింది. ఏదేనీ నగరంలో చౌక ఇండ్ల సూచీకి ప్రతి ఒక్కరి ఆదాయంలో నెలవారీ ఈఎంఐ నిష్పత్తే గీటురాయి అని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపింది. ప్రతి ఒక్కరి ఆదాయంలో 40 శాతాన్ని ఇంటి రుణ వాయిదా చెల్లించడమే చౌక ఇంటి సూచికి నిదర్శనంగా తేలింది. ఆదాయంలో 50 శాతానికి పైగా ఈఎంఐకి చెల్లించాల్సి వస్తే అది చౌక ధర కాదని తెలుస్తోంది. ఇండ్ల ధరలు తగ్గినా, సంబంధిత నగర నివాసుల ఆదాయం పెరిగినా, ఒక్కోసారి రెండూ జరిగినా చౌక ఇండ్ల సూచీ పెరుగుతుంది.
దేశంలోకెల్లా అత్యంత విలాసవంతమైన ఇల్లు కావాలంటే ఆర్థిక రాజధానిగా పేరొందిన ముంబై నిలుస్తుంది. 2022లో ఇండ్ల రుణాలపై ఈఎంఐగా రుణ గ్రహీతలు తమ ఆదాయంలో 53 శాతం చెల్లించారు. 2023లో అది రెండు శాతం తగ్గి 51 శాతానికి దిగి వచ్చింది. ఇండ్ల రుణ గ్రహీతల ఆదాయంలో 2019 స్థాయి వడ్డీ కం ఇండ్ల రుణంపై ఈఎంఐ చెల్లింపు నిస్పత్తి 67 శాతం, తాజాగా 16 శాతం తగ్గడం సంకేతంగా నిలుస్తుందని నైట్ ఫ్రాంక్ ఇండియా తెలిపారు.
తెలంగాణ రాష్ట్ర రాజధాని హైదరాబాద్ సిటీ అత్యంత విలాసవంతమైన ఇండ్లలో రెండో స్థానానికి చేరుతుంది. 2022, 2023ల్లో హైదరాబాదీలు తమ ఆదాయంలో ఇంటి రుణంలో ఈఎంఐగా 30 శాతం చెల్లించారు. 2023లో ఇండ్ల ధరలు 11 శాతం పెరిగాయి. ఢిల్లీతోపాటు దేశ రాజధాని ప్రాంతం (ఎన్‌సీఆర్0 పరిధిలో 2022లో ఇండ్ల రుణాల కోసం రుణ గ్రహీతలు తమ ఆదాయంలో 29 శాతం చెల్లిస్తే 2023లో 27 శాతానికి దిగి వచ్చింది. ముంబై, హైదరాబాద్ తర్వాత బెంగళూరు అత్యంత విలాసవంతమైన ఇండ్ల మార్కెట్‌గా నిలిచింది. 2023లో బెంగళూరు వాసులు తమ ఆదాయంలో ఇంటి రుణ వాయిదా చెల్లింపు కోసం 26 శాతం ఖర్చు చేస్తున్నారు. 2022తో పోలిస్తే ఒకశాతం, 2019తో పోలిస్తే ఆరు శాతం తగ్గిందని నైట్ ఫ్రాంక్ ఇండియా నివేదిక తెలిపింది.
ద్రవ్యోల్బణం స్వల్పంగా తగ్గుతుందని, పరిస్థితులు ఇలాగే కొనసాగితే ఆర్బీఐ వడ్డీరేట్లు తగ్గిస్తే చౌక ధరకు లభించే ఇండ్లు 2024లో పెరుగుతాయని నైట్ ఫ్రాంక్ ఇండియా చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శిశిర్ బైజాల్ పేర్కొన్నారు. 2024-35లో స్థిరంగా జీడీపీ వృద్ధిరేటు పెరగడంతోపాటు ద్రవ్యోల్బణం తగ్గితే ధరలు మరింత తగ్గుతుందని అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది చివర్లో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ).. ఇండ్ల రుణాలపై వడ్డీరేట్లు తగ్గిస్తుందని అంచనా వేస్తున్నారు.