భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు
అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై అనిశ్చితి, ఐటీ, ఆటో స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కూడా సూచీల పతనానికి కారణం
స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఉదయం లాభాల్లో ప్రారంభమైన సూచీలు.. మధ్యాహ్నం 1.20 గంటల సమయానికి సెన్సెక్స్ 1139.31పాయింట్లు నష్టపోయి 79094.77 వద్ద కొనసాగుతున్నది. నిఫ్టీ 228.00పాయింట్ల నష్టంతో 24046.90 వద్ద ట్రేడవుతున్నది. ఐటీ స్టాక్స్ అమ్మకాలకు లోనవుతుండటంతో నష్టాలు వస్తున్నాయి. అలాగే ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు, అమెరికా ఫెడ్ వడ్డీ రేట్ల కోతపై అనిశ్చితి మార్కెట్ పతనానికి దీనికి కారణం. దీంతో సెన్సెక్స్ వెయ్యి పాయింట్లకు పైగా నష్టపోగా.. నిఫ్టీ 24,00 దిగువన ట్రేడవుతోంది.
సెన్సెక్స్ 30 సూచీలో ఎస్‌బీఐ, టాటామోటార్స్ మినహా మిగిలిన అన్ని షేర్లూ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్, మహీంద్రా అండ్ మహీంద్రా, హెచ్‌సీఎల్ టెక్నాలజీస్, టైటాన్, టీసీఎస్ షేర్లు భారీగా నష్టాల్లో కొనసాగుతున్నాయి.
కారణాలివే..
అమెరికాలో అక్టోబర్ నెలకు సంబంధించి వెలువడిన ద్రవ్యోల్బణ గణాంకాలు ఫెడ్ వడ్డీ రేట్ల కోత ఆందోళనకు కారణమైంది. అక్టోబర్ నెలలో వినియోగదారుల ఖర్చు పెరిగినట్లు తేలడంతో వడ్డీ రేట్ల కోత నెమ్మదించవచ్చన్న అంచనాలు నెలకొన్నాయి. దీంతో ఐటీ స్టాక్స్ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొంటున్నాయి.
అలాగే ఐటీ, ఆటో స్టాక్స్‌లో అమ్మకాల ఒత్తిడి కూడా సూచీల పతనానికి మరో కారణం. నిఫ్టీ ఐటీ ఇండెక్స్ 2 శాతానికి పైగా నష్టపోగా.. నిఫ్టీ ఆటో ఇండెక్స్ 1 శాతానికి పైగా నష్టాల్లో కొనసాగుతుంది.