భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్ సూచీలు
వడ్డీ రేట్లపై ఫెడ్ తన నిర్ణయాలను ప్రకటించనుండటంతో అప్రమత్తంగా వ్యవహరిస్తున్న మదుపర్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు భారీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి. ప్రధాన స్టాక్‌లలో మదుపర్లు లాభాల స్వీకరణకు మొగ్గుచూపడంతో సూచీలు నష్టాల్లో కొనసాగుతున్నాయి. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో డొనాల్డ్ ట్రంప్ విజయం సాధించడంతో నిన్నటి ట్రేడింగ్ సెషన్‌లో దూసుకెళ్లిన సూచీలు నేడు ఒత్తిడికి గురవుతున్నాయి. ముఖ్యంగా బ్యాకింగ్, మెటల్ స్టాక్స్‌లో అమ్మకాల సూచీల సెంటిమెంట్‌ను దెబ్బతీశాయి. దీంతోపాటు వడ్డీ రేట్లపై ఫెడ్ తన నిర్ణయాలను ప్రకటించనుండటంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం.
సెన్సెక్స్ ఏకంగా 850 పాయింట్లకు పైగా నష్టపోయింది. నిఫ్టీ 24,300 దిగువన ట్రేడవుతున్నది. ఉదయం 10:45 గంటల సమయంలో సెన్సెక్స్ 845 పాయింట్ల నష్టంతో 79,529 వద్ద ట్రేడవుతుంటే నిఫ్టీ 279 పాయింట్లు కుంగి 24,210 వద్ద కొనసాగుతున్నది.
సెన్సెక్స్ 30 సూచీలో టెక్ మహీద్రా, అల్ట్రాటెక్ సిమెంట్, బజాజ్ ఫిన్‌సర్వ్, ఎంఅండ్‌ఎం, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, సన్‌ఫార్మా, ఇన్ఫోసిస్, టాటా మోటార్స్, ఇండస్‌ఇండ్ బ్యాంక్, ఐసీఐసీఐ బ్యాంక్ షేర్లు నష్టాల్లో ట్రేడవుతున్నాయి. టాటా స్టీల్, ఎల్‌అండ్‌టీ ఈ రెండు షేర్లు మాత్రమే లాభాల్లో కొనసాగుతున్నాయి.