రూ. 7 లక్షల కోట్లు ఆవిరి

పొరుగు దేశాలైన మెక్సికో, కెనడా దేశాలపై ట్రేడ్‌ టారిఫ్‌లు విధిస్తామని ట్రంప్‌ ప్రకటించడం దీనికి కారణం

Advertisement
Update:2025-01-21 16:40 IST

దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అమెరికా అధ్యక్ష పగ్గాలు చేపట్టిన డొనాల్డ్‌ ట్రంప్‌.. పొరుగు దేశాలైన మెక్సికో, కెనడా దేశాలపై ట్రేడ్‌ టారిఫ్‌లు విధిస్తామని ప్రకటించడం మార్కెట్‌ సెంటిమెంట్‌ను దెబ్బతీసింది. దీనికితోడు రిలయన్స్‌ ఇండస్ట్రీస్, జొమాటో వంటి ప్రధాన షేర్లలో అమ్మకాలు సూచీలను పడేశాయి. సెన్సెక్స్‌ ఓ దశలో 1300 పాయింట్ల మేర నష్టపోగా.. నిఫ్టీ కూడా 23 వేల స్థాయిని కోల్పోయింది. ఆఖర్లో సూచీలు కొద్దిగా కోలుకున్నాయి. మదుపర్ల సంపదగా భావించే బీఎస్‌ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ సుమారు రూ. 7 లక్షల కోట్ల మేర క్షీణించి రూ. 424 లక్షల కోట్లకు చేరింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.58గా ఉన్నది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ 79 డాలర్లు వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్సు 2732.20 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.

సెన్సెక్స్‌ ఉదయం 77,261.72 పాయింట్ల వద్ద స్వల్ప లాభాల్లో ప్రారంభమైంది. కొద్దిసేపటికి నష్టాల్లోకి వెళ్లింది. ఓ దశలో 700 పాయింట్ల మేర కోల్పోయిన సూచీ.. తర్వాత స్వల్ప లాభాల్లోకి వచ్చింది. మళ్లీ నష్టాల్లోకి వెళ్లిన సూచీ.. చివరి గంటలో భారీగా పతనమైంది. ఇంట్రాడేలో 75,641.87 పాయింట్ల వద్ద కనిష్టాన్ని తాకింది. చివరికి 1235 పాయింట్ల నష్టంతో 75,838.36 వద్ద ముగిసింది. నిఫ్టీ కూడా 320 పాయింట్ల నష్టంతో 23,024.65 వద్ద స్థిరపడింది.

సెన్సెక్స్‌ 30 సూచీలో అల్ట్రాటెక్‌ సిమెంట్‌, హెచ్‌సీఎల్‌ టెక్నాలజీస్‌, ఐటీసీ, హిందుస్థాన్‌ యూనిలీవర్‌ షేర్లు మినహా అన్ని షేర్లూ నష్టాల్లో ముగిశాయి. జొమాటో, ఎన్టీపీసీ, అదానీ పోర్ట్స్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా షేర్లు ప్రధానంగా నష్టపోయాయి.

Tags:    
Advertisement

Similar News