SpiceJet-Credit Suisse | సుప్రీంకోర్టు ఎఫెక్ట్.. దిగొచ్చిన స్పైస్‌జెట్.. క్రెడిట్ సూయిజ్‌కు 15 లక్షల డాలర్ల పేమెంట్.. ఎందుకంటే?!
SpiceJet-Credit Suisse | సుప్రీంకోర్టు హెచ్చరికలతో ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ (SpiceJet) దిగి వచ్చింది. స్విట్జర్లాండ్ బ్యాంక్ క్రెడిట్ సూయిజ్ (Credit Suisse) కు 15 లక్షల మిలియన్ల డాలర్ల చెల్లింపులు పూర్తి చేసినట్లు శుక్రవారం ప్రకటించింది.
SpiceJet-Credit Suisse | సుప్రీంకోర్టు హెచ్చరికలతో ప్రముఖ విమానయాన సంస్థ స్పైస్‌జెట్ (SpiceJet) దిగి వచ్చింది. స్విట్జర్లాండ్ బ్యాంక్ క్రెడిట్ సూయిజ్ (Credit Suisse) కు 15 లక్షల మిలియన్ల డాలర్ల చెల్లింపులు పూర్తి చేసినట్లు శుక్రవారం ప్రకటించింది. ఈ నెల 22 లోపు క్రెడిట్ సూయిజ్‌కు చెల్లించాల్సిన రుణ బకాయిలు చెల్లించాలని, లేని పక్షంలో తీహార్ జైలుకు వెళ్లాల్సి ఉంటుందని స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్‌సింగ్‌ను ఈ నెల 11న సుప్రీంకోర్టు తీవ్రంగా హెచ్చరించింది.
సుప్రీంకోర్టు ఆదేశాలకు అనుగుణంగా క్రెడిట్ సూయిజ్‌కు గురువారం 15 లక్షల డాలర్ల చెల్లింపులు పూర్తి చేశామని ఒక ప్రకటనలో స్పైస్‌జెట్ తెలిపింది. ఈ వార్త తెలియడంతో శుక్రవారం బాంబే స్టాక్ ఎక్స్చేంజ్ (బీఎస్ఈ)లో స్పైస్‌జెట్ షేర్ 2.9 శాతం పెరిగి రూ.39.49 వద్ద నిలిచింది.
క్రెడిట్ సూయిజ్‌కు స్పెస్ జెట్‌కు మధ్య 2015 నుంచి న్యాయ వివాదం కొనసాగుతున్నది. తమకు స్పైస్‌జెట్ 24 మిలియన్ డాలర్ల బకాయిలు చెల్లించాల్సి ఉందని పేర్కొంటూ క్రెడిట్ సూయిజ్.. మద్రాస్ హైకోర్టును ఆశ్రయించింది. దీనిపై విచారణ జరిపిన మద్రాస్ హైకోర్టు.. స్పైస్‌జెట్‌ను మూసేయాలని 2021లో తీర్పు చెప్పింది.
మద్రాస్ హైకోర్టు ఆదేశాలను సుప్రీంకోర్టులో స్పైస్‌జెట్ సవాల్ చేసింది. మద్రాస్ హైకోర్టు తీర్పును సస్పెండ్ చేసిన దేశ అత్యున్నత న్యాయస్థానం.. ఇరుపక్షాలు వివాద పరిష్కారానికి ఒక అంగీకారానికి రావాలని ఆదేశాలు జారీ చేసింది. తదనుగుణంగా 2022 ఆగస్టులో ఇరుపక్షాలు అంగీకారానికి వచ్చినట్లు న్యాయస్థానానికి తెలిపాయి. కానీ, సెటిల్మెంట్ ఒప్పందాన్ని స్పైస్‌జెట్ అమలు చేయలేదంటూ సుప్రీంకోర్టులో క్రెడిట్ సూయిజ్ గత మార్చిలో `కంటెంప్ట్ పిటిషన్` వేసింది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం స్పైస్‌జెట్ చైర్మన్ అజయ్‌సింగ్‌పై తీవ్ర వ్యాఖ్యలు చేసింది.
ఈ నెల 22 లోగా పది లక్షల డాలర్ల రుణ బకాయితోపాటు ఐదు లక్షల డాలర్లు చెల్లించాల్సిందేనని స్పైస్‌జెట్‌కు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తమ ఆదేశాలు అమలు చేయకపోతే తీహార్ జైలుకు వెళ్లాల్సిందేనని అజయ్‌సింగ్‌కు హెచ్చరికలు చేసింది. స్పైస్ జెట్ సంస్థ మూసేసినా పర్వాలేదని పేర్కొంది. ఈ దాగుడుమూతలకు స్వస్తి పలకాలని మందలించింది.