మహిళ స్వశక్తి సంఘాలకు సోలార్ ప్లాంట్లు
వెయ్యి మెగావాట్ల పవర్ ప్లాంట్లు కేటాయించే యోచనలో ప్రభుత్వం
మహిళ స్వశక్తి సంఘాలకు సోలార్ పవర్ ప్లాంట్లు ఇవ్వాలనే యోచనలో తెలంగాణ ప్రభుత్వం ఉంది. మహిళ సంఘాలకు వెయ్యి మెగావాట్ల సోలార్ ప్లాంట్లు కేటాయించాలని మంత్రి సీతక్క ప్రభుత్వాన్ని కోరారు. సోలార్ ప్లాంట్ల ఏర్పాటుకు అనువైన భూములు గుర్తిస్తే వాటిని మహిళ సంఘాలు, సమాఖ్యలకు లీజుకు ఇప్పిస్తామని మంత్రి తెలిపారు. ఒక్కో మెగావాట్ ప్లాంట్ ఏర్పాటుకు రూ.3 కోట్లు ఖర్చవుతుందని, మహిళలు పది శాతం కంట్రిబ్యూట్ చేస్తే మిగిలిన 90 శాతం బ్యాంక్ లోన్లు మంజూరు చేస్తామని తెలిపారు. ఎనర్జీ డిపార్ట్‌మెంట్ పర్మిషన్ ఇచ్చిన వారం రోజుల్లోపే సోలార్ ప్లాంట్ల ఇన్‌స్టలేషన్ పూర్తి చేస్తామన్నారు. ఒక్కో మెగావాట్ ప్లాంట్ ద్వారా ఏడాదికి రూ.30 లక్షల వరకు ఆదాయం వస్తుందని తెలిపారు. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం పని చేస్తుందన్నారు.