మొదటిసారి 85 వేల మార్క్ దాటిన సెన్సెక్స్
స్టాక్ మార్కెట్‌లో బుల్ జోరు.. సరికొత్త శిఖరాలను తాకుతున్న సెక్సెక్స్, నిఫ్టీ
అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాలు ఉన్నప్పటికీ స్టాక్‌మార్కెట్‌లో బుల్ జోరు కొనసాగుతున్నది. దేశీయంగా మదుపర్ల నుంచి అందుతున్న కొనుగోళ్ల మద్దతుతో సూచీలు రికార్డు లాభాల్లో పరుగులు పెడుతున్నాయి. మంగళవారం సెన్సెక్స్ మొదటిసారి 85 వేల పాయింట్ల మైలురాయిని దాటి సరికొత్త రికార్డును తాకింది. నిఫ్టీ 26 వేల మార్క్‌కు మరింత చేరువైంది.
మంగళవారం ట్రేడింగ్ ప్రారంభమైన కొద్దిసేపటికే సూచీలు లాభాల బాట పట్టాయి. ఉదయం 10 గంటల సమయంలో సెన్సెక్స్ 101.07 పాయింట్ల లాభంతో 85,030 వద్ద, నిఫ్టీ 33 పాయింట్లు పెరిగి 25,972 వద్ద సరికొత్త జీవనకాల గరిష్ఠాల్లో ట్రేడ్ అవుతున్నాయి. లోహ, విద్యుత్, చమురు, గ్యాస్ రంగ షేర్లలో కొనుగోళ్లు సూచీలను బలపరుస్తున్నాయి. టాటా స్టీల్, హిందాల్కో, జేఎస్‌డబ్ల్యూ స్టీల్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్, అదానీ ఎంటర్‌ప్రైజెస్ షేర్లు రాణిస్తున్నాయి. అయితే ఐటీ షేర్లు మాత్రం 0.5 శాతం మేర నష్టాల్లో ఉన్నాయి.