5 ట్రిలియన్ క్లబ్‌లోకి ఎస్‌బీఐ
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ 5 ట్రిలియన్ రూపాయల (5 లక్షల కోట్ల) మార్కెట్ విలువను అందుకుని అరుదైన మైలురాయిని చేరుకుంది.
స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా సరికొత్త రికార్డు సృష్టించింది. ప్రభుత్వ రంగ బ్యాంకు అయిన ఎస్‌బీఐ 5 ట్రిలియన్ రూపాయల (5 లక్షల కోట్ల) మార్కెట్ విలువను అందుకుని అరుదైన మైలురాయిని చేరుకుంది. దీంతో ఈ ఘనత అందుకున్న తొలి ప్రభుత్వ రంగ బ్యాంకుగా ఎస్‌బీఐ నిలిచింది.
అన్ని కంపెనీలనూ పరిగణనలోకి తీసుకున్నప్పుడు ఈ బ్యాంకు ఏడో స్థానంలో నిలవగా, బ్యాంకింగ్ రంగంలో మాత్రం మూడో స్థానానికి చేరడం విశేషం. బుధవారం జరిగిన ట్రేడింగ్‌లో ఒక శాతం మేరకు ఆ బ్యాంకు షేర్ లాభ పడటంతో ఈ అరుదైన ఘనతను అందుకుంది.
గడచిన కొద్ది రోజులుగా స్టేట్‌బ్యాంక్ ఆఫ్ ఇండియా షేర్లు లాభాల బాటలోనే నడుస్తున్నాయి. ఆ బ్యాంకు షేరు గడచిన ఏడాదిలో 22 శాతం లాభపడటం గమనార్హం. గడచిన మూడు నెలల్లో అయితే ఆ బ్యాంకు షేరు ఏకంగా 26 శాతం లాభ పడటం విశేషం. బ్యాంకింగ్ రంగంలో ఇప్పటివరకు ఈ ఘనతను అందుకున్నది హెచ్‌డీఎఫ్‌సీ, ఐసీఐసీఐ మాత్రమే కావడం గమనార్హం.
ఇటీవల రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇచ్చిన డేటానే బ్యాంకు షేర్ పెరగడానికి దోహదపడింది. రుణాల్లో వృద్ధి పెరుగుతోందని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆ డేటాలో పేర్కొంది. దీంతో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాతో పాటు ఇతర బ్యాంకుల షేర్లు కూడా పెరిగాయి. దేశీయ బ్యాంకుల రుణాలు తొమ్మిదేళ్ల గరిష్టానికి చేరాయంటూ ఆర్‌బీఐ గత నెలలో డేటా ప్రకటించడం బ్యాంకుల షేర్లు లాభపడటానికి ఉపయోగపడింది. దీంతో కొన్ని సెషన్ల నుంచి బ్యాంకుల షేర్లు రాణిస్తున్నాయి. గడచిన ఐదు సెషన్లను పరిశీలిస్తే.. యాక్సిస్ బ్యాంకు షేర్లు 7.5 శాతం, ఐసీఐసీఐ బ్యాంకు షేర్లు 5 శాతం, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు షేర్లు 3 శాతం వృద్ధి చెందాయి.