క్యాంప‌స్ ప్లేస్‌మెంట్స్‌లో 70 శాతం వ‌రకు డ్రాప్‌.. ప్రైవేట్ ఇంజినీరింగ్ కాలేజ్‌ల‌ గ‌గ్గోలు

కొత్త నియామ‌కాల మీద ఆచితూచి స్పందిస్తున్నాయి కంపెనీలు. ఉద్యోగాల్లోకి తీసుకున్న‌వారికి కూడా గ‌త ఏడాదితో పోల్చితే జీతాలు త‌గ్గుతున్న‌ట్లు లెక్క‌లు చెబుతున్నాయి.

Advertisement
Update:2023-11-13 15:05 IST

చదువు కొన‌సాగుతుండ‌గానే క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూలు.. స‌ర్టిఫికెట్‌తో బ‌య‌టికొచ్చేస‌రికి ఏడాదికి ల‌క్ష‌ల్లో జీతాలిస్తామంటూ ఆఫ‌ర్ లెట‌ర్లు ప‌ట్టుకుని ఆహ్వానించేవి కంపెనీలు.. గ‌త 10, 15 సంవ‌త్స‌రాలుగా ఇంజినీరింగ్ కాలేజీల్లో జ‌రుగుతున్న తంతు ఇదే. కానీ, ఈసారి ప‌రిస్థితి అంత ఈజీగా లేదు. ప్లేస్‌మెంట్లు లేక ప్రైవేట్ ఇంజినీరింగ్ క‌ళాశాల‌లు గ‌గ్గోలు పెడుతున్నాయి. గ‌త ఏడాదితో పోల్చుకుంటే ప్లేస్‌మెంట్ల‌లో 50 నుంచి 70 శాతం త‌గ్గుద‌ల క‌నిపిస్తుండటం విద్యార్థుల‌ను, తల్లిదండ్రుల‌ను కూడా క‌ల‌వ‌ర‌ప‌రిచే అంశమే.

ఐటీ కంపెనీలు ముఖం చాటేస్తున్నాయి!

ఇంజినీరింగ్ కాలేజీల్లో క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూలు పెట్టి ఉద్యోగాలిచ్చేవి ప్ర‌ధానంగా ఐటీ కంపెనీలే. అయితే ఈసారి క్ల‌యింట్ల నుంచి ఆశించినంత స్థాయిలో ప్రాజెక్టులు రాక‌పోవ‌డంతో కంపెనీలు ఆచితూచి అడుగులేస్తున్నాయని గుర్గావ్‌లోని బీఎంఎల్ ముంజాల్ యూనివ‌ర్సిటీ కెరీర్ గైడెన్స్ డెవ‌ల‌ప్‌మెంట్ సెంట‌ర్ సీనియ‌ర్ డైరెక్ట‌ర్ సంతానిల్ దాస్ గుప్తా చెబుతున్నారు. గ‌త సంవ‌త్స‌రం ఈపాటికే 95 శాతం మంది విద్యార్థుల‌కు ప్లేస్‌మెంట్స్ దొరికాయ‌ని, ఈసారి త‌మ విద్యార్థుల్లో ఉద్యోగాల‌కు ఎంపికైన వారి ప‌ర్సంటేజీ 30 దాట‌లేద‌ని గుప్తా చెప్ప‌డం ప్ర‌స్తుత ప‌రిస్థితిని తేట‌తెల్లం చేస్తోంది. విజ‌య‌వాడ‌లో కోనేరు ల‌క్ష్మ‌య్య యూనివర్సిటీలో ప్లేస్‌మెంట్ల‌కు సిద్ధంగా 2 వేల మంది విద్యార్థులుంటే 35 శాతం మందికే ఆఫ‌ర్ లెట‌ర్లు వ‌చ్చాయి. క్యాంప‌స్ ప్లేస్‌మెంట్లు గ‌త ఏడాది మాదిరిగా ఇంప్రెసివ్‌గా లేవ‌ని కేఎల్‌ యూనివ‌ర్సిటీ ప్లేస్‌మెంట్స్ విభాగం సీనియ‌ర్ డైరెక్ట‌ర్ శ‌ర‌వ‌ణ‌బాబు చెప్పారు. ఐటీ స‌ర్వీసెస్ కంపెనీలు ఉద్యోగుల‌ను పెద్ద‌గా రిక్రూట్ చేసుకోవ‌డం లేద‌ని, అది ప్లేస్‌మెంట్ లెక్క‌ల మీద విప‌రీత‌మైన ప్ర‌భావం చూపుతోంద‌ని ఆయ‌న వివ‌రించారు. నోయిడాలోని అమిటీ యూనివ‌ర్సిటీలో 1200 మంది విద్యార్థుల‌కు గాను క్యాంప‌స్ ప్లేస్‌మెంట్లు పొందిన‌వారు 30 శాతం మాత్ర‌మే.

కార‌ణాలేంటి?

ఐటీ ఎక్స్‌పోర్ట్‌ల్లో వృద్ధి బాగుంటుంద‌ని గ‌త రెండేళ్లుగా కంపెనీలు పెద్ద ఎత్తున ఇంజినీరింగ్ గ్రాడ్యుయేట్ల‌ను క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూల్లో సెల‌క్ట్ చేసి ఉద్యోగాలు క‌ల్పించాయి. అయితే క్ల‌యింట్ స్పెండింగ్ తగ్గుతుండ‌టంతో ఈసారి ఐటీ కంపెనీలు క్యాంప‌స్ ప్లేస్‌మెంట్ల విష‌యంలో చాలా జాగ్ర‌త్తలు పాటిస్తున్నాయి. ఉన్న‌వారికే ప‌ని క‌ల్పించ‌లేని ప‌రిస్థితి కూడా ఉంద‌ని, అందుక‌నే కొత్త ప్లేస్‌మెంట్ల మీద దూకుడు త‌గ్గించిన‌ట్లు ఐటీ కంపెనీ హెచ్ఆర్‌లు చెబుతున్నారు. ర‌ష్యా - ఉక్రెయిన్ యుద్ధం, ఇప్పుడు పాల‌స్తీనా - ఇజ్రాయెల్ మ‌ధ్య ఉద్రిక్త‌త‌లు ప్ర‌పంచ మార్కెట్‌ను బాగా ప్ర‌భావితం చేస్తున్నాయి. ఐటీలో వృద్ధి నిల‌క‌డగా ఉందే త‌ప్ప వేగంగా దూసుకెళ్లిపోవ‌డం లేదు. అందుకే కొత్త నియామ‌కాల మీద ఆచితూచి స్పందిస్తున్నాయి కంపెనీలు. ఉద్యోగాల్లోకి తీసుకున్న‌వారికి కూడా గ‌త ఏడాదితో పోల్చితే జీతాలు కూడా త‌గ్గుతున్న‌ట్లు లెక్క‌లు చెబుతున్నాయి.

ఆ కాలేజీల గురించి చెప్పే ప‌నే లేదు

బెస్ట్ క్యాండెట్ల‌ను ప్లేస్‌మెంట్ల‌కు సిద్ధం చేసే కాలేజీల ప‌రిస్థితే ఇలా ఉంటే.. ఇక సాధార‌ణ ఇంజినీరింగ్ కాలేజీల ప‌రిస్థితి ఏంటి? అస‌లు వాటి గురించి ఆలోచించే ప‌నే లేదంటున్నారు కంపెనీల హెచ్ఆర్‌లు. పేరున్న కాలేజీల్లో సీటు సాధించి చ‌దువుకునే నాలెడ్జ్ బాగున్న విద్యార్థుల‌కే ప్లేస్‌మెంట్ల దొర‌క‌డం క‌ష్టంగా మారితే సాధార‌ణ కాలేజీల్లోని యావ‌రేజ్ స్టూడెంట్స్‌కు క్యాంప‌స్ ప్లేస్‌మెంట్లు దొర‌క‌డం ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో క‌ష్ట‌మేనంటున్నారు.

ఇత‌ర బ్రాంచ్‌ల్లో మొత్తానికి నిల్

ఐటీ బ్రాంచ్‌ల్లోని విద్యార్థుల‌కే కాస్తో కూస్తో ప్లేస్‌మెంట్లు దొరుకుతున్నాయి.. మిగ‌తా బ్రాంచ్‌ల్లో అయితే ప‌రిస్థితి మ‌రీ దారుణంగా ఉంది. చాలా కాలేజీల్లో అస‌లు మిగ‌తా బ్రాంచ్‌ల‌కు క్యాంప‌స్ ఇంట‌ర్వ్యూలు జ‌ర‌గ‌డం లేదు. పెద్ద కాలేజీలు పట్టుబ‌ట్టి కంపెనీలను ర‌ప్పించినా ఏదో నామ్‌కే వాస్తే ఉద్యోగాలు వ‌స్తున్నాయి త‌ప్ప ఎక్కువ మందికి ప్లేస్‌మెంట్ గ్యారంటీ అనే ప‌రిస్థితి ఎక్క‌డా క‌నిపించ‌డం లేదు.

Tags:    
Advertisement

Similar News