Paytm | ప‌ది రోజుల్లో 55 శాతం షేర్ న‌ష్టం.. రూ.26 వేల ఎం-క్యాప్ కోల్పోయిన పేటీఎం.. క‌స్ట‌మ‌ర్ల సేవ‌ల‌పై ఆర్బీఐ ఇలా..!

Paytm | ఆర్బీఐ నిసేధం విధించిన 10 రోజుల్లో కంపెనీ స్టాక్ సుమారు 55 శాతం న‌ష్ట‌పోయింది. త‌ద్వారా కంపెనీ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.26 వేల కోట్లు కోల్పోయింది.

Advertisement
Update:2024-02-14 17:00 IST

Paytm | ప్ర‌ముఖ ఫిన్‌టెక్ సంస్థ పేటీఎం ప‌ది రోజుల్లో రూ.26 వేల కోట్ల మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ కోల్పోయింది. బుధ‌వారం బీఎస్ఈలో పేటీఎం షేర్ తొమ్మిది శాతం కోల్పోయి రూ.344.90 వ‌ద్ద క‌నిష్ట స్థాయిని తాకింది. ఆర్బీఐ ఆంక్ష‌ల నేప‌థ్యంలో కిరాణా స్టోర్లు పేటీఎం క‌రో అనే ప్ర‌చార స్టిక్క‌ర్ల‌ను తొల‌గిస్తున్నాయి. పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్‌)పై విధించిన నిషేధాజ్ఞ‌లపై స‌మీక్షించే ప్ర‌సక్తే లేద‌ని ఆర్బీఐ తేల్చి చెప్ప‌డంతో కిరాణా స్టోర్లు పేటీఎం స్టిక్క‌ర్లు తొల‌గించి వేస్తున్నాయి.

ఆర్బీఐ నిసేధం విధించిన 10 రోజుల్లో కంపెనీ స్టాక్ సుమారు 55 శాతం న‌ష్ట‌పోయింది. త‌ద్వారా కంపెనీ మార్కెట్ క్యాపిట‌లైజేష‌న్ రూ.26 వేల కోట్లు కోల్పోయింది. ఒడిదొడుకుల మ‌ధ్య కొన‌సాగుతున్న పేటీఎం స్టాక్ అండ‌ర్ ప‌ర్‌ఫామ్‌ కింద రూ.275కు ప‌డిపోతుంద‌ని గ్లోబ‌ల్ బ్రోకింగ్ సంస్థ మాక్వైర్ అంచనా వేసింది. స‌రిగ్గా ఏడాది క్రితం పేటీఎం షేర్ విలువ దాదాపు రూ.800ల‌తో డ‌బుల్ చేస్తూ ప్ర‌క‌టించింది. అంత‌కుముందు 2022లోనూ అండ‌ర్ ప‌ర్‌ఫామ్‌ రేటింగ్ కింద పేటీఎం షేర్ విలువ స‌వ‌రిస్తూ రూ.450 వ‌ద్ద స‌వ‌రించింది. ఫిబ్ర‌వ‌రి 29 త‌ర్వాత క‌స్ట‌మ‌ర్ల నుంచి డిపాజిట్ల సేక‌ర‌ణ‌, క్రెడిట్ ఫెసిలిటీ, ఇత‌ర లావాదేవీలు నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని గ‌త నెల 31న పేటీఎం పేమెంట్స్ బ్యాంకింగ్ లిమిటెడ్ (పీపీబీఎల్‌)ను ఆర్బీఐ ఆదేశించిన సంగ‌తి తెలిసిందే.

ఈ నెల 29 త‌ర్వాత క‌స్ట‌మ‌ర్ల నుంచి డిపాజిట్ల సేక‌ర‌ణ చేప‌ట్ట‌వ‌ద్ద‌ని, ఫాస్టాగ్ లావాదేవీలు నిర్వ‌హించ‌వ‌ద్ద‌ని పేటీఎంను ఆదేశించిన ఆర్బీఐ.. గ‌డువు దాటిన త‌ర్వాత పేటీఎం క‌స్ట‌మ‌ర్లు ఇబ్బందుల పాలవ్వ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకోవ‌డంపై దృష్టిని కేంద్రీక‌రించింది. ప్ర‌త్యేకించి టోల్ పేమెంట్స్‌, మొబైల్ పేమెంట్స్‌, యుటిలిటీ బిల్లుల చెల్లింపులు త‌దిత‌ర అంశాల‌పై క‌స్ట‌మ‌ర్లు ఇబ్బందుల పాల‌య్యే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ స‌మ‌స్యలు, ఇబ్బందుల‌కు ప‌రిష్కారాలు చూపుతూ ఆర్బీఐ బుధ‌వారం సాయంత్రం లేదా గురువారం గానీ ఆర్బీఐ ఫ్యాక్ట్‌షీట్‌ విడుద‌ల చేయ‌నున్న‌ద‌ని తెలుస్తున్న‌ది.

ఈ విష‌య‌మై ఫాస్టాగ్‌ల ద్వారా టోల్ ఫీజు వ‌సూలు చేసే నేష‌న‌ల్ ఎల‌క్ట్రానిక్ టోల్ క‌లెక్ష‌న్ (ఎన్ఈటీసీ), పాపుల‌ర్ మొబైల్ పేమెంట్స్ ప్లాట్‌ఫామ్ - యూనిఫైడ్ పేమెంట్స్ ఇంట‌ర్‌ఫేస్ (యూపీఐ)ను నిర్వ‌హించే నేష‌న‌ల్ పేమెంట్స్ కార్పొరేష‌న్ ఆఫ్ ఇండియా (ఎన్పీసీఐ), బిల్లుల చెల్లింపులను నిర్వ‌హించే బీబీపీఎస్ ప్ర‌తినిధుల‌తో ఆర్బీఐ సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ది. ఈ సేవ‌ల‌న్నీ నిర్వ‌హించేందుకు పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ లిమిటెడ్ (పీపీబీఎల్‌) స్పాన్స‌ర్ బ్యాంక్‌గా ఉంది. ఈ బిల్లుల చెల్లింపున‌కు నిరంత‌రాయం సేవ‌లందించేందుకు, క‌స్ట‌మ‌ర్లు ఇత‌ర బ్యాంకుల‌కు మ‌ళ్లేందుకు తీసుకోవాల్సిన చ‌ర్య‌ల‌పై బీబీపీఎస్‌, ఎన్పీసీఐ, ఎన్ఈటీసీ అధికారుల‌తో సంప్ర‌దిస్తున్న‌ది.

మ‌రోవైపు, పేటీఎం కూడా త‌న క‌స్ట‌మ‌ర్ల‌కు పేమెంట్ స‌ర్వీస్ ప్రొవైడ‌ర్ (పీఎస్పీ) సేవ‌లందించేందుకు యెస్ బ్యాంక్‌, యాక్సిస్ బ్యాంక్‌, కెన‌రాబ్యాంక్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌, ఎస్బీఐల‌తో సంప్ర‌దిస్తున్న‌ది. గూగుల్ పే, ఫోన్‌పే, పేటీఎం వంటి యూపీఐ ప్లాట్‌ఫామ్ గ‌ల మొబైల్ యాప్స్‌తో పీఎస్పీ బ్యాంకులు (థ‌ర్డ్ పార్టీ అప్లికేష‌న్ ప్రొవైడ‌ర్‌లు) క‌నెక్ట్ అవుతాయి. పేటీఎంకు తొమ్మిది కోట్ల మంది క‌స్ట‌మ‌ర్లు ఉన్నారు.

Tags:    
Advertisement

Similar News