రెండో రోజు లాభాల్లో ముగిసిన సూచీలు
సూచీలకు కలిసొచ్చిన రిలయన్స్, జొమాటో, ఎన్టీపీసీ షేర్లలో కొనుగోళ్లు
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వరుసగా రెండో రోజు లాభాల్లో ముగిశాయి. ప్రధాన షేర్లలో కొనుగోళ్ల మద్దతుతో ఉదయం లాభాల్లో ప్రారంమైన సూచీలు.. రోజంతా అదే బాటలో పయనించాయి. రిలయన్స్, జొమాటో, ఎన్టీపీసీ షేర్లలో కొనుగోళ్లు సూచీలకు కలిసొచ్చాయి. దీంతో సెన్సెక్స్ 224 పాయింట్లు లాభపడగా.. నిఫ్టీ 23,200 ఎగువన ముగిసింది. డాలర్‌తో రూపాయి మారకం విలువ 86.37 వద్ద స్థిరపడింది. అంతర్జాతీయ మార్కెట్ లో బ్రెంట్ క్రూడ్ బ్యారెల్ ధర 80.12 డాలర్ల వద్ద ట్రేడవుతుండగా.. బంగారం ఔన్స్ 2,707.70 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.
సెన్సెక్స్ ఉదయం 76,900.14 వద్ద లాభాల్లో ప్రారంభమైంది. ఇంట్రాడేలో 76,901.05 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 224 పాయింట్ల లాభంతో 76,724.08 వద్ద ముగిసింది. నిఫ్టీ ఇంట్రాడేలో 23,293.65 వద్ద గరిష్ఠాన్ని తాకింది. చివరికి 37 పాయింట్ల లాభంతో 23,213 వద్ద ముగిసింది. సెన్సెక్స్30 సూచీలో జొమాటో, ఎన్టీపీసీ, పవర్‌గ్రిడ్ కార్పొరేషన్, కోటక్ మహీంద్రా బ్యాంక్, మారుతీ సుజుకీ, టెక్ మహీంద్రా, ఎల్‌అండ్‌టీ, రిలయన్స్ ఇండస్ట్రీస్, అదానీ పోర్ట్స్ లాభపడ్డాయి. ఎంఅండ్‌ఎం, బజాజ్‌ఫిన్‌సర్వ్, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, టాటా మోటార్స్, నెస్లే ఇండియా షేర్లు నష్టపోయాయి.