భారీగా పెరిగిన ఉల్లిధరలు
ఢిల్లీ, ముంబైలో రూ.80కి పెరిగిన కేజీ ధర
ఉల్లిధరలు ఒక్కసారిగా పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీ, ఆర్థిక రాజధాని ముంబైలో సామాన్యులు కొయ్యకుండానే కన్నీళ్లు తెప్పించే స్థాయికి ఉల్లి ధరలు చేరాయి. కొన్ని రోజుల క్రితం వరకు కేజీ ఉల్లిగడ్డల ధర రూ.40 నుంచి రూ.60 మధ్యనే ఉండగా.. ఇప్పుడు రూ.80 వరకు పెరిగాయి. మహారాష్ట్రలో ఉల్లి ఎక్కువగా సాగు చేస్తారు. అక్కడ అక్టోబర్ లో భారీ వర్షాలు కురవడంతో ఉల్లిసాగు ఆలస్యమైంది. పంజాబ్, హర్యానా, ఛండీడఢ్ తదితర ప్రాంతాలకు ఉల్లి దిగుమతి తగ్గింది. మార్కెట్ లో ఉల్లిధర అమాంతం పెరిగింది. రాబోయే కొన్ని రోజుల్లో కేజీ ఉల్లి ధర సెంచరీ కొట్టే అవకాశముందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఉల్లిధరలు కొన్ని రోజుల వ్యవధిలోనే డబుల్ కావడంతో పేద, మధ్య తరగతి ప్రజలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ప్రభుత్వాలు ఉల్లిధరలను అదుపు చేయాలని రైతుబజారులు, ఇతర మార్కెట్లలో సబ్సిడీ ధరకు ఉల్లి సరఫరా చేయాలని సామాన్యులు కోరుతున్నారు. మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతుండగా, కొత్త ఏడాది ఆరంభంలో ఢిల్లీ అసెంబ్లీకి ఎన్నికలు జరుగనున్నాయి. ఉల్లిధరల పెంపు ప్రభావం ఎన్నికలపైనా పడుతుందనని అన్ని రాజకీయ పార్టీలు ఆందోళన చెందుతున్నాయి.