రతన్ టాటా వారసుడిగా నోయల్
టాటా ట్రస్ట్స్ చైర్మన్ గా ఎన్నుకున్న బోర్డు
రతన్ టాటా వారసుడిగా ఆయన సవతి సోదరుడు నోయల్ టాటా ఎంపికయ్యారు. రతన్ టాటా మరణంతో ఆయన స్థానంలో టాటా ట్రస్ట్స్ చైర్మన్ గా నోయల్ ను ఎంపిక చేస్తూ బోర్డు శుక్రవారం నిర్ణయం తీసుకుంది. 67 ఏళ్ల నోయల్ టాటా గ్రూప్ లోని ట్రెంట్, వోల్టాస్, టాటా ఇన్వెస్ట్‌మెంట్ కార్పొరేషన్, టాటా ఇంటర్నేషనల్ కంపెనీలకు చైర్మన్ గా ఉన్నారు. రతన్ టాటా తండ్రి నావల్ టాటా ఆయన రెండో భార్య సిమోన్ టాటా కుమారుడు నోయల్. టాటా స్టీల్స్, టైటాన్ కు వైస్ చైర్మన్‌గా, రతన్ టాటా ట్రస్ట్ బోర్డు మెంబర్ గా ఉన్నారు. టాటా సన్స్ లో టాటా ట్రస్ట్స్ కు 66 శాతం ఉంది. ఈ హోదాలో ఉన్న వ్యక్తి మొత్తం కంపెనీ వ్యవహారాల్లో క్రియాశీలంగా వ్యవహరిస్తారు. టాటా ట్రస్ట్స్ కు నోయల్ ఆరో చైర్మన్. ఈ పదవి కోసం పలువురి పేర్లు ప్రచారంలో ఉన్నా బోర్డు నోయల్ వైపే మొగ్గు చూపింది. టాటా వ్యాపార సామ్రాజ్యాన్ని అగ్రగామిగా నిలిపేందుకు రతన్ టాటా ఎంతో కృషి చేశారు. టాటా గ్రూప్ టర్నోవర్ 4 బిలియన్ డాలర్లు ఉన్నప్పుడు చైర్మన్ గా పగ్గాలు చేపట్టిన రతన్ టాటా తన హయాంలో వంద బిలియన్ డాలర్ల మార్క్ క్రాస్ చేయించారు. ఇప్పుడు ఆయన వారసత్వాన్ని అందుకున్న నోయల్ టాటా గ్రూప్ సంస్థలను ఎలా ముందుకు తీసుకెళ్తారు అనే ఆసక్తి అన్నివర్గాల్లో నెలకొంది.