పీఎం-కిసాన్ పెంపు ఉత్తిదే.. కేంద్రం క్లారిటీ
PM-KISAN: ఈ రెండు కారణాల వల్ల ఈపథకం విఫల ప్రయత్నంగా మారింది. అయితే ఇటీవల 6వేలను 8వేలకు పెంచారని వార్తలొచ్చాయి. మోదీ భక్తులు కూడా ఈ విషయంపై సెల్ఫ్ డబ్బాలు వాయించారు.
ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పేరుతో రైతులకు కేంద్ర ప్రభుత్వం ఏడాదికి 6 వేల రూపాయల ఆర్థిక సాయం అందచేస్తున్న సంగతి తెలిసిందే. ఏడాది కేడాది పీఎం కిసాన్ కి కేటాయిస్తున్న నిధులను తగ్గిస్తూ కేంద్రం ఇప్పటికే పలాయనవాదం చిత్తగించింది.
ఈ క్రమంలో ఇటీవల ఓ పుకారు షికారు చేసింది. కేంద్రం పీఎం కిసాన్ నిధులను పెంచుతోందంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే అది వట్టి పుకారేనని తేలిపోయింది. అది పుకారేనని రైతులకు ఇచ్చే పీఎం కిసాన్ ఆర్థిక సాయాన్ని పెంచడం లేదని కేంద్రం క్లారిటీ ఇచ్చింది.
ఏడాదికి 6 వేలు ఇస్తున్నా.. ఒక్కో విడతకు 2వేలు చొప్పున మూడు విడతల్లో ఆ సాయాన్ని రైతుల అకౌంట్లలో జమ చేస్తుంది కేంద్రం. ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే.. కౌలు రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి అందదు. కమతం పెద్దదైనా, చిన్నదైనా కిసాన్ సమ్మాన్ నిధి సాయంలో పెంపు ఉండదు.
ఈ రెండు కారణాల వల్ల ఈపథకం విఫల ప్రయత్నంగా మారింది. అయితే ఇటీవల 6వేలను 8వేలకు పెంచారని వార్తలొచ్చాయి. మోదీ భక్తులు కూడా ఈ విషయంపై సెల్ఫ్ డబ్బాలు వాయించారు. మా మోదీ వీరుడు, శూరుడు, రైతుల పాలిట దేవుడు అంటూ బాకాలూదారు అందరూ. కానీ చివరకు అదంతా ఉత్తిదేనని తేలిపోయింది.
బడ్జెట్ లో ఊసే లేదు..
కిసాన్ సమ్మాన్ నిధి పెంచాలంటే ముందు బడ్జెట్ లో కేటాయింపులు పెరగాలి. కానీ నిర్మలమ్మ ఈ ఆర్థిక సంవత్సరం బడ్జెట్ లో కేటాయింపులు పెంచలేదు. దీంతోపాటు పార్లమెంట్ సభ్యులు అడిగిన ప్రశ్నకు కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లిఖిత పూర్వక సమాధానం కూడా ఇచ్చారు.
ప్రస్తుతానికి పీఎం-కిసాన్ మొత్తాన్ని పెంచే ఉద్దేశమేదీ లేదని ఆయన చెప్పారు. ఈ ఏడాది జనవరి 30 వరకు అర్హులైన రైతులకు మొత్తం రూ.2.24 లక్షల కోట్లను రైతుల ఖాతాల్లో జమ చేసినట్లు కేంద్రమంత్రి తెలిపారు.