త్వరలో 'సెబీ' కి కొత్త చీఫ్
దరఖాస్తులు ఆహ్వానించిన కేంద్ర ప్రభుత్వం
మార్కెట్ నియంత్రణ సంస్థ సెక్యూరిటీస్ అండల్ ఎక్స్చేంజీ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబీ) కు త్వరలో కొత్త చీఫ్ రానున్నారు. దీనికి సంబంధించి కేంద్రం తాజాగా దరఖాస్తులు ఆహ్వానించింది. ప్రస్తుత చీఫ్ మాధవి పురీ బచ్ మూడేళ్ల పదవీ కాలం ఈ ఏడాది ఫిబ్రవరి 28తో ముగియనున్నది. ఆమె 2022 మార్చి 2న బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎకానమిక్ అఫైర్స్ దరఖాస్తులు కోరింది. ఫిబ్రవరి 17వ తేదీని గడువుగా నిర్దేశించింది.
పదవీ కాలం చేపట్టిన తర్వాత గరిష్ఠంగా ఐదేళ్లు లేదా 65 ఏళ్లు వచ్చే వరకు ఈ పదవిలో ఉండాల్సి ఉంటుందని కేంద్రం తన ప్రకటనలో తెలిపింది. సెబీ చీఫ్‌గా నియమితులయ్యే వారికి ప్రభుత్వ కార్యదర్శితో సమాన వేతనం ఉంటుంది. అంటే నెలకు రూ. 5.62 లక్షల వేతనం(ఇల్లు, కారు కాకుండా) చెల్లిస్తారు. సెబీ వంటి అత్యున్నత సంస్థకు చీఫ్‌గా వ్యవహరించాలంటే కనీసం ఈ రంగంలో 25 ఏళ్ల అనుభవం, కనీసం 50 ఏళ్ల వయసు ఉండాలని కేంద్రం ప్రకటనలో తెలిపింది. సెక్యూరిటీ మార్కెట్లో ఎదురయ్యే సవాళ్లను అధిగమించడంతో పాటు న్యాయ, ఆర్థిక, అకౌంటెన్సీ రంగాల్లో ప్రావీణ్యం ఉండాలని సూచించింది. ఫైనాన్షియల్ సెక్టార్ రెగ్యులేటరీ అపాయింట్‌మెంట్స్ సెర్చ్ కమిటీ ప్రతిపాదనల ఆధారంగా ప్రభుత్వం సెబీ చీఫ్‌ను నియమిస్తుంది.