Mutual Funds | స్థిరంగా స్మాల్‌క్యాప్ ఫండ్స్ వృద్ధి.. నవంబర్‌కల్లా రూ.లక్షల కోట్లకు..!
Mutual Funds | మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్‌లోకి నిరంతరాయంగా పెట్టుబడులు వచ్చి చేరుతున్నాయి. నవంబర్ నెలాఖరు నాటికి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్‌లో పెట్టుబడులు రూ.2 లక్షల కోట్ల మైలురాయికి చేరువయ్యాయి.
Mutual Funds | మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్‌లోకి నిరంతరాయంగా పెట్టుబడులు వచ్చి చేరుతున్నాయి. నవంబర్ నెలాఖరు నాటికి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్ సెగ్మెంట్‌లో పెట్టుబడులు రూ.2 లక్షల కోట్ల మైలురాయికి చేరువయ్యాయి. ఈ ఏడాదిలో స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో 69 శాతం వృద్ధిరేటు నమోదైంది. అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) గణాంకాల ప్రకారం నెలవారీ పెట్టుబడుల ప్రాతిపదికన చూస్తే అక్టోబర్ నెలతో పోలిస్తే 10 శాతం వృద్ధి సాధించి రూ.1.99 లక్షల కోట్లకు చేరుకున్నది. 2019-20 ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంతో పోలిస్తే స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీలో పెట్టుబడులు అసాధారణ స్థాయిలో వృద్ధి చెందాయి.
మార్కెట్‌లో సానుకూల పరిణామాల నేపథ్యంలో స్మాల్ క్యాప్స్ మ్యూచువల్ ఫండ్స్ కేటగిరీలో రికార్డు స్థాయిలో నికర పెట్టుబడులు వచ్చి పడుతున్నాయి. ఈ ఏడాది నవంబర్ వరకు స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ విభాగంలోకి రూ.37,178 కోట్లకు చేరుకున్నాయి. నవంబర్‌లో 3,699 కోట్లు, అక్టోబర్‌లో రికార్డు స్థాయిలో రూ.4,495 కోట్ల పెట్టుబడులు వచ్చి చేరాయి.
మరోవైపు లార్జ్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్ సెగ్మెంట్‌లో గత 11 నెలల్లో రూ.2,699 కోట్ల పెట్టుబడులు ఉపసంహరించారు. సెబీ రూల్స్ ప్రకారం స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్, ఫండ్ మేనేజర్లు తమ పోర్ట్‌ఫోలియో నిధుల్లో కనీసం 65 శాతం స్మాల్ క్యాప్ స్టాక్స్‌లో పెట్టుబడులు పెట్టాల్సి ఉంటుంది. స్వల్పకాలిక అనిశ్చితుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు స్మాల్ క్యాప్, మిడ్ క్యాప్ ఫండ్స్‌లో పెట్టుబడులకు వెనుకంజ వేస్తారని యూనియన్ అసెట్ మేనేజ్‌మెంట్ కంపెనీ సీఈఓ జీ ప్రదీప్ కుమార్ తెలిపారు.
ఏఎంఎఫ్ఐ ఇండియా డేటా ప్రకారం నవంబర్ నెలాఖరు నాటికి స్మాల్ క్యాప్ మ్యూచువల్ ఫండ్స్‌లో అసెట్స్ బేస్ రూ.2.2 లక్షల కోట్లకు చేరింది. ఈ విభాగంలో ఇన్వెస్టర్ల ఖాతాలు 62 లక్షల నుంచి 1.6 కోట్లకు పెరిగాయి. గతేడాది నవంబర్ నాటికి 97.52 లక్షల ఖాతాలు మాత్రమే ఉన్నాయి. 42 సంస్థల మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ గత ఏడాది కాలంలో 22 శాతం వృద్ధి సాధించింది. 2022 నవంబర్ నాటికి మ్యూచువల్ ఫండ్స్‌లో రూ.40.37 లక్షల కోట్ల పెట్టుబడులు మదుపు చేస్తే ఈ ఏడాది అది రూ.49.04 లక్షల కోట్లకు దూసుకెళ్లింది.