ఆసియా-బెర్లిన్ సదస్సులో ప్రసంగించాలని కోరుతూ మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం
'ఆసియా-బెర్లిన్ సదస్సు 2023'కు హాజరు కావాలని కోరుతూ నిర్వాహకులు ఆహ్వానం పంపించారు. ఈ సమ్మిట్‌లో 'కనెక్టింగ్ స్టార్టప్ ఎకో సిస్టమ్' అనే అంశంపై మంత్రి కేటీఆర్‌ను ప్రసంగించాలని కోరినట్లు అధికారులు తెలిపారు.
తెలంగాణ ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌కు మరో అంతర్జాతీయ సద్సస్సుకు ఆహ్వానం అందింది. ఈ ఏడాది జూన్ 12 నుంచి 15 వరకు జర్మనీలోని బెర్లిన్‌లో నిర్వహించున్న 'ఆసియా-బెర్లిన్ సమ్మిట్ 2023'కు హాజరు కావాలని కోరుతూ నిర్వాహకులు ఆహ్వానం పంపించారు.
ఈ సమ్మిట్‌లో 'కనెక్టింగ్ స్టార్టప్ ఎకో సిస్టమ్' అనే అంశంపై మంత్రి కేటీఆర్‌ను ప్రసంగించమని కోరినట్లు అధికారులు తెలిపారు.
జర్మనీ సెనేట్ డిపార్ట్‌మెంట్ ఫర్ ఎకనామిక్స్, ఎనర్జీ, పబ్లిక్ ఎంటర్‌ప్రైజెస్ ఆధ్వర్యంలో ఈ సమ్మిట్‌ను నిర్వహిస్తున్నారు. ఆసియా, జర్మనీ దేశాల మధ్య మరింత మెరుగైన ఆర్థిక సంబంధాలు, భాగస్వామ్యాలు ఉండాలనే లక్ష్యంతో ఈ అంతర్జాతీయ సదస్సును అక్కడి ప్రభుత్వం నిర్వహిస్తోంది. కాగా, ఈ సద్సస్సులో ప్రసంగించడం ద్వారా ఇండియా, ఇతర దేశాల మధ్య బలమైన భాగస్వామ్యాలు ఏర్పాటు చేసుకోవడానికి వీలుంటుందని, ఇందుకు అవసరమైన ప్రయత్నాలు మరింత పటిష్టం చేయాలని మంత్రి కేటీఆర్‌ను నిర్వహకులు కోరారు.
జర్మనీలో ఉన్న స్టార్టప్‌లను ఆసియా దేశాల్లోని మార్కెట్లతో అనుసంధానం చేసేందుకు ఈ సమ్మిట్ ఉపయోగపడుతుంది. ఈ సారి సదస్సులో మొబిలిటి, లాజిస్టిక్స్, ఎనర్జీ, గ్రీన్‌టెక్, క్లైమేట్ ఛేంజెస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి ప్రధానమైన అంశాలపై విస్తృతంగా చర్చించనున్నారు. అంతే కాకుండా పెట్టుబడిదారులకు ప్రత్యేక కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేస్తున్నారు.
అద్భుతమైన ఆలోచనలు కలిగి ఉన్న స్టార్టప్ కంపెనీలు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చని మంత్రికి పంపిన ఆహ్వానంలో పేర్కొన్నారు. జర్మనీలో ఉన్న స్టార్టప్ ఎకో సిస్టమ్ బలాన్ని.. ఆసియాలోని స్టార్టప్‌లతో పంచుకునేందకు ఈ సదస్సు ఉపయోగపడుతుందని నిర్వాహకులు వివరించారు.