మేఘా ఇంజనీరింగ్ చేతికి రూ.14,440 కోట్ల కాంట్రాక్టు.. ఎల్ అండ్ టీని ఓడించి థానే-బోరివలి టన్నెల్ ప్రాజెక్ట్ దక్కించుకున్న సంస్థ

రెండు భారీ టన్నెల్స్‌కు సంబంధించి మేఘా, ఎల్ అండ్ టీ మాత్రమే సాంకేతికంగా అర్హత సాధించాయి. దీంతో తుది ఫైనాన్షియల్ బిడ్లను ఏప్రిల్‌ 25న తెరిచారు.

Advertisement
Update:2023-05-12 16:53 IST

హైదరాబాద్ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్న మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ లిమిటెడ్ (మెయిల్) ప్రతిష్టాత్మక ప్రాజెక్టును చేజిక్కించుకున్నది. ముంబై మెట్రొపాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీ (ఎంఎంఆర్టీఏ) నిర్మించ తలపెట్టిన థానే-బోరివలి ట్విన్ టన్నెల్ ప్రాజెక్టుకు సంబంధించిన రెండు ప్యాకేజీలను కూడా మేఘా సంస్థ దక్కించుకున్నది. ఇంజనీరింగ్, ఇన్‌ఫ్రా దిగ్గజ కంపెనీ అయిన ఎల్ అండ్ టీని బిడ్డింగ్‌లో ఓడించి.. రూ.14,400 కోట్ల ప్రాజెక్టును మేఘా సంస్థ తమ ఖాతాలో వేసుకున్నది.

మేఘా సంస్థకు టన్నెల్ ప్రాజెక్టు కేటాయించడాన్ని సవాలు చేస్తూ ఎల్ అండ్ టీ సంస్థ బాంబే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. కానీ ఎల్ అండ్ టీ వినతిని బాంబే హైకోర్టు తోసిపుచ్చడంతో మేఘాకు కాంట్రాక్టు ఇస్తున్నట్లు లేఖ పంపించామని ఎంఎంఆర్డీఏ కమిషనర్ ఎస్వీఆర్ శ్రీనివాస్ తెలిపారు.ఈ ఏడాది జనవరిలో థానే-బోరివలి మధ్య టన్నెల్ నిర్మాణానికి సంబంధించి రెండు ప్యాకేజీల కోసం టెండర్లను పిలిచారు. ఈ టన్నెల్ నిర్మాణం వల్ల థానే, బోరివలి మధ్య ప్రస్తుతం ఉన్న 60 నిమిషాల ప్రయాణ సమయం 15 నుంచి 20 నిమిషాలకు తగ్గిపోనున్నది. ప్రయాణ దూరం తగ్గడం వల్ల వాతావరణంలోకి కర్బన ఉద్గారాలు కూడా తక్కువగా కలుస్తాయని ఎంఎంఆర్డీఏ అంచనా వేసింది.

రెండు భారీ టన్నెల్స్‌కు సంబంధించి మేఘా, ఎల్ అండ్ టీ మాత్రమే సాంకేతికంగా అర్హత సాధించాయి. దీంతో తుది ఫైనాన్షియల్ బిడ్లను ఏప్రిల్‌ 25న తెరిచారు. ప్యాకేజీ 1కు సంబంధించి మేఘా, ప్యాకేజీ 2కు సంబంధించి ఎల్ అండ్ టీ తక్కువ కోట్ చేశాయి. అయితే ప్యాకేజీ 2కు సంబంధించి ఎల్ అండ్ టీ తక్కువ కోట్ చేసినా అధిక మొత్తంలో ట్యాక్స్‌లు చూపించడంతో అధికారులు దాన్ని తిరస్కరించారు. దీంతో ఎల్ అండ్ టీ యాజమాన్యం బాంబే హైకోర్టును ఆశ్రయించింది. ప్యాకేజీ 1లో తమను అనర్హులుగా ప్రకటించడంతో పాటు.. ప్యాకేజీ 2ను కూడా తిరస్కరించడాన్ని సవాలు చేసింది. అయితే.. ఎల్ అండ్ టీ వేసిన పిటిషన్‌ను బాంబే హైకోర్టు కొట్టేసింది.

ముంబై శివారులోని థానే, బోరివలి మధ్య ప్రస్తుతం ప్రయాణించడానికి సంజయ్ గాంధీ నేషనల్ పార్కును చుట్టి వెళ్లాల్సి వస్తోంది. దీంతో ఆ పార్కు కింద టన్నెల్స్ నిర్మించాలని ఎంఎంఆర్డీఏ నిర్ణయించింది. మొదటి ప్యాకేజీలో బోరివలి వైపు నుంచి 5.57 కిలోమీటర్లకు గాను మేఘా రూ.7,464 కోట్లు కోట్ చేసింది. ఇక థానే వైపు నుంచి 6.09 కిలోమీటర్ల రెండో ప్యాకేజీకి మేఘా సంస్థ రూ.6,937 కోట్లు కోట్ చేసింది. ఇప్పుడు ఎల్ అండ్ టీకి ఏ ప్యాకేజీ దక్కక పోవడంతో మేఘా ఇంజనీరింగ్ సంస్థ రెండు ప్యాకేజీలకు కలిపి రూ.14,401 కోట్లకు పూర్తి ప్రాజెక్ట్ చేపట్టనున్నది.

ఒక్కో టన్నెల్‌లో మూడు లేన్ల రహదారితో పాటు.. ఇరు వైపులా అప్రోచ్ రోడ్లను నిర్మించాల్సి ఉన్నది. ఈ టన్నెల్ నిర్మాణం వల్ల థానేలోని ఘోడ్‌బందర్ రోడ్డులో ట్రాఫిక్ చాలా వరకు తగ్గిపోతుందని అధికారులు వెల్లడించారు. ఈ ఏడాది వర్షాకాలం ముగిసిన తర్వాత మేఘా సంస్థ టన్నెల్ ప్రాజెక్ట్ పనులను ప్రారంభించనున్నట్లు ఎంఎంఆర్డీఏ అధికారులు చెప్పారు.

Tags:    
Advertisement

Similar News