Car Recalls | మారుతి.. హ్యండాయ్ 23,739 కార్లు రీకాల్.. కారణం ఇదే..!
మారుతి సుజుకి 16 వేలకు పైగా కార్లు, హ్యుండాయ్ 7698 కార్లు రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. మారుతి సుజుకి బాలెనో11,851, వ్యాగన్ఆర్ 4,190 కార్లు రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది.
Car Recalls | ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీ కోసం ప్రాధాన్యం ఇస్తున్నారు. విశాలవంతమైన స్పేసియస్‌గా ఉండే ఎస్‌యూవీల వైపు మోజు పెట్టుకుంటున్నారు. రోజురోజుకు ఎస్‌యూవీ కార్ల సేల్స్ పెరుగుతున్నాయి. ఈ క్రమంలో దేశంలో అత్యధికంగా కార్లు విక్రయిస్తున్న మారుతి సుజుకి, హ్యుండాయ్.. తమ టాప్ సెల్లింగ్ మోడల్ కార్లను రీకాల్ చేస్తున్నాయి. ఇటు మారుతి సుజుకి, అటు హ్యుండాయ్ కార్లలోనూ ఫ్యుయల్ పంప్ మోటార్‌లో సాంకేతిక లోపం తలెత్తడంతో రీకాల్ చేశాయి. మారుతి సుజుకి 16 వేలకు పైగా కార్లు, హ్యుండాయ్ 7698 కార్లు రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. మారుతి సుజుకి బాలెనో11,851, వ్యాగన్ఆర్ 4,190 కార్లు రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. 2019 జూలై-నవంబర్ మధ్య తయారైన బాలెనో, వ్యాగన్ ఆర్ కార్లను రీకాల్ చేసింది.
మారుతి సుజుకి కార్లు కొన్ని నెలలుగా విక్రయాలు పెరుగుతున్నాయి. 2023 ఫిబ్రవరితో పోలిస్తే గత నెలలో దేశీయంగా మారుతి సుజుకి కార్ల విక్రయాలు తొమ్మిది శాతం పెరిగి 1,68,544 యూనిట్లకు చేరాయి. విదేశాలకు 2023లో 17,207 కార్లు ఎగుమతి చేస్తే గత నెలలో 68 శాతం వృద్ధితో 28,927 యూనిట్లకు చేరింది. కానీ, 2019 జూలై-నవంబర్ మధ్య తయారైన బాలెనో, వ్యాగన్ఆర్ మోడల్ కార్ల ఫ్యుయల్ పంప్ మోటార్‌లో సాంకేతిక లోపం (Defect) తలెత్తిందని తెలిపింది మారుతి సుజుకి. దీనివల్ల ఇంజిన్ స్తంభించి పోవడానికి లేదా ఇంజిన్ స్టార్ట్ కావడం లేదని పేర్కొంది. ప్రస్తుతం భారత్ మార్కెట్లో 24 మోడల్ కార్లు విక్రయిస్తున్నది. వాటిలో ఒకటి పికప్ ట్రక్, 10 హ్యాచ్‌బ్యాక్ కార్లు, మూడు సెడాన్లు, రెండు మినీ వ్యాన్లు, నాలుగు ఎస్‌యూవీలు, నాలుగు మల్టీ పర్పస్ వెహికల్స్ (ఎంవీపీ) ఉన్నాయి.
7698 యూనిట్ల క్రెటా, వెర్నా రీకాల్
దక్షిణ కొరియా ఆటోమేజర్ హ్యుండాయ్ మోటార్ ఇండియా తన ఎస్‌యూవీ క్రెటా, సెడాన్ వెర్నా కార్లు 7,698 యూనిట్లు రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. సాంకేతిక లోపం వల్లే రీకాల్ చేస్తామని వెల్లడించింది. హ్యుండాయ్ పాపులర్ ఎస్‌యూవీ క్రెటా, సెడాన్ సెగ్మెంట్ వెర్నా మోడల్ కార్లలో 1.5 లీటర్ల నేచురల్లీ యాస్పిరేటెడ్ పెట్రోల్ ఇంజిన్‌తోపాటు సీవీటీ ఆటోమేటిక్ వేరియంట్లను రీకాల్ చేస్తున్నామని తెలిపింది. ఈ విషయమై కేంద్ర జాతీయ రహదారులు, రవాణాశాఖకు సమాచారం ఇచ్చింది.
క్రెటా, వెర్నా కార్లలో ఎలక్ట్రానిక్ ఫ్యుయల్ పంప్ కంట్రోలర్‌లో సాంకేతిక లోపం తలెత్తింది. సీవీటీ గేర్ బాక్స్‌లోని ఎలక్ట్రానిక్ ఫ్యుయల్ పంప్ పనితీరు సరిగ్గా లేదు. 2023 ఫిబ్రవరి 13 నుంచి జూన్ ఆరో తేదీ మధ్య తయారైన క్రెటా, వెర్నా యూనిట్ కార్లను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది. సంబంధిత క్రెటా, వెర్నా మోడల్ కార్లు కొనుగోలు చేసిన యూజర్లకు కంపెనీ అఫిషియల్ వర్క్‌షాప్.. ఫోన్, ఎస్ఎంఎస్‌ల ద్వారా వ్యక్తిగతంగా సమాచారం అందిస్తుంది. కస్టమర్లు కూడా డీలర్‌షిప్‌లు, హ్యండాయ్ కాల్ సెంటర్ 1800-114-645 టోల్ ఫ్రీ నంబర్‌కు ఫోన్ చేసి అపాయింట్ మెంట్ తీసుకోవచ్చు. సాంకేతిక లోపం గల కార్లకు ఉచితంగా సదరు విడి భాగాలను రీకాల్ చేస్తున్నట్లు తెలిపింది.
ఇప్పటి వరకూ భారీగా రీకాల్ చేసిన కార్ల వివరాలివే..
* 2018 నవంబర్ 18 నుంచి 2019 అక్టోబర్ 15 మధ్య తయారైన మారుతి బాలెనో, వ్యాగన్ ఆర్ కార్లు 1,34,885 యూనిట్లను 2020 జూలైలో రీకాల్ చేసింది. ఫ్యుయల్ పంప్‌లో సాంకేతిక లోపం కారణం.
* 2019 నవంబర్ నాలుగో తేదీ నుంచి 2020 ఫిబ్రవరి 25 మధ్య తయారైన ఎకో కార్లు 40,453 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు 2020 నవంబర్‌లో రీకాల్ చేసింది. హెడ్ ల్యాంప్ స్టాండర్డ్ సింబల్ మిస్ కావడం కారణం.
* 2020 జనవరి - 2021 ఫిబ్రవరి మధ్య తయారైన మహీంద్రా పికప్ కమర్షియల్ వాహనాలు 29,878 యూనిట్లను రీకాల్ చేస్తున్నట్లు 2021లో మహీంద్రా అండ్ మహీంద్రా తెలిపింది. ఫ్లూయిడ్ పైప్ రీప్లేస్ చేయాల్సి రావడం దానికి కారణం.
* 2020 సెప్టెంబర్ ఏడో తేదీ నుంచి డిసెంబర్ 25 మధ్య తయారైన మహీంద్రా థార్ అప్‌లోడ్ ఎస్‌యూవీ కార్లు 1577 యూనిట్లను రీకాల్ చేసినట్లు 2021 ఫిబ్రవరిలో ప్రకటించింది. మహీంద్రా థార్ మెషిన్‌లో టెక్నికల్ గ్లిచ్ రావడంతో థార్ కార్లు దెబ్బ తినడం కారణం.
* 2020 డిసెంబర్ నుంచి 2021 ఏప్రిల్ మధ్య తయారైన రాయల్ ఎన్‌ఫీల్డ్ 2,36,966 మోటారు సైకిళ్లను రీకాల్ చేస్తున్నట్లు 2021 మేలో ప్రకటించింది. వాటిలో బుల్లెట్ 350, క్లాసిక్ 350, మీటర్ 350 మోటారు సైకిళ్లు ఉన్నాయి. ఈ మోటారు సైకిళ్లలో షార్ట్ షర్క్యూట్ అవుతుందన్న భయంతో రీకాల్ చేసింది.