Maruti Suzuki Invicto | మారుతి నుంచి సెవెన్ సీటర్ కారు.. 19 నుంచి ప్రీబుకింగ్స్.. 5న ఆవిష్కరణ.. ఇవీ డిటైల్స్.!
Maruti Suzuki Invicto | కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు.
Maruti Suzuki Invicto | కరోనా మహమ్మారి తర్వాత ప్రతి ఒక్కరూ పర్సనల్ మొబిలిటీకి ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రత్యేకించి కుటుంబ సభ్యులంతా హాయిగా ప్రయాణించేందుకు స్పేసియస్‌గా ఉన్న కార్ల కొనుగోలుకు మొగ్గు చూపుతున్నారు. మారుతి సుజుకి సైతం కస్టమర్ల ఆకాంక్షలకు, అభిరుచులకు అనుగుణంగా కొత్త డిజైన్లు, ఫీచర్లతో కొత్త కొత్త కార్లు తీసుకు వస్తున్నది. తాజాగా ఏడు సీట్ల మల్టీ పర్పస్ వెహికల్ (ఎంపీవీ) కూడా మార్కెట్లో ఆవిష్కరించేందుకు రంగం సిద్ధం చేస్తున్నది. మారుతి సుజుకి ఇన్‌విక్టో (Maruti Suzuki Invicto) పేరుతో డిజైన్ చేసిన కొత్త ఎంవీపీ కారు.. ప్రీ బుకింగ్స్ ఈ నెల 19 నుంచి ప్రారంభం అవుతాయి. జూలై ఐదో తేదీన కారు ధర ప్రకటించనున్నది. టయోటా కిర్లోస్కర్ మోటార్స్ `ఇన్నోవా హైక్రాస్ (Toyota Innova Hycross)` టెక్నాలజీ ఆధారంగా మారుతి సుజుకి ఇన్‌విక్టో (Maruti Suzuki Invicto) రూపుదిద్దుకుంటున్నది.
భారత్ మార్కెట్లో ఆవిష్కరణతో మారుతి సుజుకి ఫ్లాగ్‌షిప్ వెహికల్ కానున్నది ఇన్‌విక్టో (Invicto). ప్రస్తుతం మారుతి సుజికి నుంచి మార్కెట్లో ఉన్న ఎస్‌యూఈ మోడల్ గ్రాండ్ విటారా అత్యంత కాస్ట్‌లీ. గ్రాండ్ విటారా ధర రూ.10.70 లక్షల నుంచి రూ.19.79 లక్షల మధ్య పలుకుతుంది. టయోటా ఇన్నోవా హైక్రాస్ ధర రూ.18.55-29.55 లక్షల మధ్య ధర పలుకుతుంది. మారుతి సుజుకి ఇన్‌విక్టో దర కూడా ఇదే రేంజీలో ఉంటుందని తెలుస్తున్నది.
మారుతి సుజుకి, టయోటా కిర్లోస్కర్ మోటార్స్ మధ్య టెక్నాలజీ మార్పిడి ఒప్పందం ఉన్నది. టయోటా డిజైన్ చేసిన కార్లలో తొలిసారి మారుతి సుజుకి సొంత బ్రాండ్ పేరిట విక్రయిస్తున్నది ఇన్‌విక్టోనే కావడం గమనార్హం. ఇప్పటి వరకు మారుతి సుజుకి విటారా బ్రెజా, బాలెనో తయారీకి ఉపయోగించిన టెక్నాలజీని టయోటా ఉపయోగించుకున్నది. మారుతి గ్రాండ్ విటారాను టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్‌గా, మారుతి సుజుకి బాలెనోను గ్లాన్జాగా టయోటా.. భారత్ మార్కెట్లో విక్రయిస్తున్నది.