Maruti Grand Vitara | శరవేగంగా మారుతి గ్రాండ్ విటారా.. ఏడాదిలోనే లక్ష యూనిట్లు.. సెప్టెంబర్ కార్ల సేల్స్ ఆల్‌టైం రికార్డ్..!
Maruti Grand Vitara | మారుతి సుజుకి (Maruti Suzuki) దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ.. ప్రతి నెలా కార్ల విక్రయాల్లో అగ్రతాంబూలం మారుతిదే.. బుల్లి కార్లు మొదలు సెడాన్, హ్యాచ్‌బ్యాక్, మల్టీ పర్పస్, ఎస్‌యూవీ తదితర సెగ్మెంట్లలో 17 కార్లు మార్కెట్లో విక్రయిస్తోంది.
Maruti Grand Vitara | మారుతి సుజుకి (Maruti Suzuki) దేశంలోకెల్లా అతిపెద్ద కార్ల తయారీ సంస్థ.. ప్రతి నెలా కార్ల విక్రయాల్లో అగ్రతాంబూలం మారుతిదే.. బుల్లి కార్లు మొదలు సెడాన్, హ్యాచ్‌బ్యాక్, మల్టీ పర్పస్, ఎస్‌యూవీ తదితర సెగ్మెంట్లలో 17 కార్లు మార్కెట్లో విక్రయిస్తోంది. గతంతో పోలిస్తే ఇప్పుడు కార్ల మార్కెట్‌లో ఎస్‌యూవీ కార్లదే ప్రధాన వాటా.. ఎస్‌యూవీ సెగ్మెంట్‌లో ఇతర కార్లను ఢీ కొట్టేందుకు అత్యాధునిక ఫీచర్లతో గతేడాది సెప్టెంబర్ 26న మారుతి సుజుకి ఆవిష్కరించిన మోడల్ గ్రాండ్ విటారా (Grand Vitara) శరవేగంగా దూసుకెళుతోంది. కస్టమర్లను ఆకట్టుకుంటూ సరిగ్గా ఏడాది లోపు లక్ష కార్ల విక్రయ మైలురాయిని దాటేసింది. మిడ్‌సైజ్ ఎస్‌యూవీల్లో శరవేగంగా అమ్ముడవుతున్న గ్రాండ్ విటారా (Grand Vitara) సెప్టెంబర్ నెలాఖరు నాటికి 1.20 లక్షల యూనిట్లు విక్రయించింది.
మారుతి సుజుకి గ్రాండ్ విటారా ధర రూ.10.70 లక్షల (ఎక్స్ షోరూమ్) నుంచి ప్రారంభమై రూ.19.99 లక్షల (ఎక్స్ షోరూమ్) వరకూ పలికింది. హ్యుండాయ్ క్రెటా, కియా సెల్టోస్, టయోటా అర్బన్ క్రూయిజర్ హైరైడర్, స్కోడా కుషక్, ఫోక్స్ వ్యాగన్ టైగూన్, హోండా ఎలివేట్, ఎంజీ ఆస్టర్ వంటి కార్లకు గ్రాండ్ విటారా టఫ్ ఫైట్ ఇస్తోంది. వేర్వేరు ఇంజిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంది. 1.5 లీటర్ల ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హ్రైబ్రీడ్, 1.5 లీటర్ల కే సిరీస్ డ్యుయల్ జెట్, స్మార్ట్ హైబ్రీడ్‌తో డ్యుయల్ వీవీటీ ఇంజిన్ ఆప్షన్లలో లభిస్తుంది.
ఈ-సీవీటీ ఇంటెలిజెంట్ ఎలక్ట్రిక్ హైబ్రీడ్ మోటార్ గరిష్టంగా 115 బీహెచ్పీ విద్యుత్, 122 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. 1.5 లీటర్ల కే-సిరీస్ ఇంజిన్ 103 బీహెచ్పీ విద్యుత్, 137 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. ఈ ఇంజిన్లు 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ లేదా 6-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కలిగి ఉంటాయి. సీఎన్జీ ఆప్షన్ ఇంజిన్ 5-స్పీడ్ మాన్యువల్ ట్రాన్స్‌మిషన్ ఆప్షన్ కలిగి ఉండటంతోపాటు గరిష్టంగా 87 బీహెచ్పీ విద్యుత్, 121 ఎన్ఎం టార్క్ వెలువరిస్తుంది. కే-సిరీస్ ఇంజిన్ యూనిట్ ఫోర్-వీల్ డ్రైవ్ ఆప్షన్ (సుజుకి ఆల్ గ్రిప్ టెక్నాలజీ)తోపాటు ఆటో, స్పోర్ట్, స్నో, లాక్ డ్రైవ్ మోడ్స్‌లో లభిస్తుంది.
గ్రాండ్ విటారా సేల్స్‌లో హైబ్రీడ్ వర్షన్ 22-23 శాతం, సీఎన్జీ వర్షన్ 13-14 శాతం, మిగతా పెట్రోల్ వర్షన్ కార్లు కొనుగోలు చేస్తున్నారు. ఆల్ గ్రిప్ వేరియంట్లు కేవలం రెండు శాతం మాత్రమే ఉన్నాయి. గ్రాండ్ విటారా ఆవిష్కరణతో ఎస్‌యూవీ సేల్స్‌లో వృద్ధి వేగవంతానికి దారి తీసింది. 22 శాతం విక్రయాలతో ఎస్‌యూవీ కార్లలో మారుతి సుజుకి నంబర్ వన్ స్థానంలో నిలిచింది. గ్రాండ్ విటారా కేవలం 12 నెలల్లోనే లక్ష మందికి పైగా కస్టమర్లను ఆకట్టుకున్నదని మారుతి సుజుకి సీనియర్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (మార్కెటింగ్ అండ్ సేల్స్) శశాంక్ శ్రీవాత్సవ తెలిపారు. గ్రాండ్ విటారాతోపాటు ఫ్రాంక్స్, బ్రెజా, జిమ్నీ ఎస్‌యూవీ కార్లను విక్రయిస్తోంది మారుతి.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి అర్థభాగంలో మారుతి 10,50,085 యూనిట్లు విక్రయించిన రికార్డు నమోదు చేసింది. గతేడాదితో పోలిస్తే సెప్టెంబర్‌లో 3.9 శాతం గ్రోత్‌తో 1,76,306 యూనిట్ల కార్లు విక్రయించింది. దేశీయంగా 1,59,832 కార్లు విక్రయిస్తే, విదేశాలకు 22,511 యూనిట్లు ఎగుమతి చేసింది. మారుతి సుజుకితోపాటు హ్యుండాయ్ మోటార్స్ తదితర కార్ల తయారీ సంస్థలు సకాలంలో కార్లు డీలర్లకు సరఫరా చేయడంతో సెప్టెంబర్ సేల్స్ మరో ఆల్‌టైం రికార్డు నమోదు చేసింది. 2022 సెప్టెంబర్‌లో 1,76,306 యూనిట్లు విక్రయిస్తే ఈ ఏడాది 3,63,733 యూనిట్లు విక్రయించింది. గత ఆగస్టులో 3,60,700 కార్లు విక్రయించిన రికార్డు నమోదు చేసింది.ఫెస్టివ్ సీజన్ నేపథ్యంలోనే మెరుగ్గా కార్ల విక్రయాలు జరుగుతున్నాయని ఆటో మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.