కరోనా టైమ్ లో వైరస్ తో పోటీ పడిన లోన్ యాప్ లు
2019లో సైబర్ సెల్ కు లోన్ యాప్ ల గురించి 322 ఫిర్యాదులందాయి. 2020లో వాటి సంఖ్య 837కి పెరిగింది, 2021లో 928, 2022లో ఇప్పటి వరకు 3151 ఫిర్యాదులందాయి.
కరోనా టైమ్ లో ఆర్థిక వ్యవహారాల్లో చాలా మార్పులొచ్చాయి. ఆన్ లైన్ నగదు లావాదేవీల సంఖ్య బారీగా పెరిగింది. అదే సమయంలో ఆన్ లైన్ మోసాలు కూడా పెరిగాయి. లోన్ యాప్ ల వ్యవహారం కొవిడ్ వైరస్ తో పాటే వృద్ధి చెందింది. కరోనా టైమ్ లో లోన్ యాప్ ల వైపు చాలామంది ఆకర్షితులయ్యారు. మొదట్లో వడ్డీరేటు తక్కువగా వసూలు చేసే నిజాయితీగల సంస్థలు లోన్లు ఇచ్చాయి. దీంతో ఈ యాప్ లపై నమ్మకం పెరిగింది. ఆ తర్వాత అధిక వడ్డీ వసూలు చేసే సంస్థలు రంగప్రవేశం చేశాయి. ఒక్కసారిగా పరిస్థితి తారుమారైంది. అసలుకి మించి వడ్డీకట్టాల్సి రావడంతో చాలామంది భయపడ్డారు, వెనకాడారు, ఎగ్గొట్టచ్చులే అని లైట్ తీసుకున్నారు. అలాంటి వారంతా మార్ఫింగ్ వీడియోల బారిన పడ్డారు, కొంతమంది బలవన్మరణాలకు కూడా పాల్పడ్డారు.
లోన్ యాప్ ల పై ఫిర్యాదులు..
లోన్ యాప్ ల వేధింపులు పెరిగిపోవడంతో వాటిపై ఫిర్యాదులు కూడా రోజురోజుకీ పెరిగిపోతున్నాయి. కరోనా కాలంలో లోన్ యాప్ ల పై ఫిర్యాదులు 376శాతం పెరిగాయంటే పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. 2019లో సైబర్ సెల్ కు లోన్ యాప్ ల గురించి 322 ఫిర్యాదులందాయి. 2020లో వాటి సంఖ్య 837కి పెరిగింది, 2021లో 928, 2022లో ఇప్పటి వరకు 3151 ఫిర్యాదులందాయి.
15రోజులనుంచి 6నెలల కాలపరిమితి వరకు లోన్ యాప్ లు రుణాలు మంజూరు చేస్తున్నాయి. రూపాయి వడ్డీతో మొదలై.. పెద్ద మొత్తాలకు అత్యథిక వడ్డీని వసూలు చేస్తున్నారు నిర్వాహకులు. లోన్ యాప్ ఇన్ స్టాల్ చేసుకోవడమే అతి పెద్ద తప్పు అంటున్నారు నిపుణులు. ఒకసారి లోన్ యాప్ ఇన్ స్టాల్ చేసుకుంటే.. లోన్ దరఖాస్తు నింపే సమయంలో మన కాంటాక్ట్ లిస్ట్, కెమెరా యాక్సెస్ లోన్ యాప్ తీసేసుకుంటుంది. ఆ తర్వాత రికవరీ విషయంలో తేడా వస్తే, స్నేహితులు, బంధువులకు ఫోన్లు చేసి వేధించడం, మన ఫొటోలను మార్ఫింగ్ చేసి బెదిరించడం.. ఇలాంటివి సహజంగా మారిపోతున్నాయి. దీంతో బాధితులు పరువుపోతుందనే భయంతో సూసైడ్ అటెంప్ట్స్ చేస్తున్నారు.
నిబంధనలు లేకుండా, తక్షణం లోన్ అమౌంట్ ఇచ్చేస్తామనే ప్రకటనలపట్ల ఎవరూ ఆకర్షితులు కావొద్దని చెబుతున్నారు పోలీసులు. చట్టబద్ధంగా రుణాలు ఇచ్చే సంస్థల్లో మాత్రమే రుణాలకోసం దరఖాస్తు చేసుకోవాలని చెబుతున్నారు. వేధింపులు ఎదురైతే తక్షణం పోలీసులకు ఫిర్యాదు చేయాలంటున్నారు. ఆర్బీఐ అనుమతి తీసుకున్న 577 ఆర్థిక సంస్థలు మాత్రమే ప్రజలకు అధికారికంగా రుణాలు మంజూరు చేస్తున్నాయని, అవి మినహా మిగతా ఇన్ స్టంట్ లోన్ యాప్స్ జోలికి వెళ్లొద్దని చెబుతున్నారు నిపుణులు.