ఎయిర్ టాక్సీలు వచ్చేస్తున్నాయ్..! - భారత్‌లో తయారీ ప్లాంట్
2025 కల్లా ప్లాంటు ఏర్పాటు చేయనున్నామని భారత్-అమెరికా వ్యాపారవేత్త, జాంట్ ఎయిర్‌కు చెందిన చిరింజీవ్ కథూరియా వెల్లడించారు. భారత్‌లో అర్బన్ ఎయిర్ మొబిలిటీ (యూఏఎం)ని అభివృద్ధి చేసేందుకు ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్‌తో జాంట్ ఎయిర్ మొబిలిటీ ఒప్పందం కుదుర్చుకుందని ఆయన తెలిపారు.
భారత్‌లో ఎయిర్ టాక్సీలు ఎగరబోతున్నాయ్.. వచ్చే నాలుగేళ్లలో ఇవి అందుబాటులోకి రానున్నాయ్.. వీటి తయారీ ప్లాంటును భారత్‌లో ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమవుతోంది. 2025 కల్లా ప్లాంటు ఏర్పాటు చేయనున్నామని భారత్-అమెరికా వ్యాపారవేత్త, జాంట్ ఎయిర్‌కు చెందిన చిరింజీవ్ కథూరియా వెల్లడించారు. భారత్‌లో అర్బన్ ఎయిర్ మొబిలిటీ (యూఏఎం)ని అభివృద్ధి చేసేందుకు ఎల్ అండ్ టీ టెక్నాలజీ సర్వీసెస్‌తో జాంట్ ఎయిర్ మొబిలిటీ ఒప్పందం కుదుర్చుకుందని ఆయన తెలిపారు.
జాంట్ ఎయిర్ తయారు చేసిన అత్యాధునిక(ఆర్‌క్యూ-35 హీడ్రన్ ఇంటెలిజెన్స్) నిఘా డ్రోన్లు ప్రస్తుతం ఉక్రెయిన్‌లో వినియోగిస్తున్నట్టు ఆయన వెల్లడించారు. భారత రక్షణ రంగానికి సేవలందించేందుకు ఈ డ్రోన్లను భారత్‌లోనే తయారు చేసేందుకు అవకాశముందని కథూరియా తెలిపారు. భారత్‌కు చెందిన ఓ హెలికాప్టర్ సేవల సంస్థ నుంచి 250 ఎయిర్ టాక్సీలకు జాంట్ ఎయిర్ సంస్థకు ఆర్డర్ వచ్చిందని ఇటీవల ఓ ఆంగ్ల పత్రిక వెల్లడించడం గమనార్హం.
ఒకేసారి భారత్, అమెరికాల్లో ఎయిర్ టాక్సీల తయారీ ప్లాంట్లను ప్రారంభిస్తామని కథూరియా వెల్లడించారు. అందులో భాగంగా ముందుగా అమెరికాలో, అనంతరం భారత్‌లో వీటిని ప్రారంభిస్తామని తెలిపారు. 2025 కల్లా ఎయిర్ టాక్సీల తయారీని ఆయా ప్లాంట్లలో ప్రారంభిస్తామని వెల్లడించారు. కెనడాలోనూ 2026-27 కల్లా ప్లాంటును ప్రారంభించాలని భావిస్తున్నట్టు తెలిపారు.
చిరింజీవ్ కథూరియా మన భారతీయుడే. ఢిల్లీలో పుట్టిన ఆయన వృత్తిరీత్యా డాక్టర్. బ్రౌన్ యూనివర్సిటీ నుంచి డాక్టరేట్ ఆఫ్ మెడిసిన్ చేసిన ఆయన.. స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీ నుంచి ఎంబీఏ చేశారు. న్యూ జనరేషన్ పవర్‌కు ఆయన సహ వ్యవస్థాపకుడు. ప్రస్తుతం దీనికి చైర్మన్‌గా ఉన్నారు.