IT Industry Laid Offs | రోజూ 555 మంది.. గంట‌కు 23 మంది ఐటీ ఉద్యోగుల లే-ఆఫ్స్‌.. తొల‌గ‌ని ముప్పు..!

IT Industry Laid Offs | ఉక్రెయిన్‌-ర‌ష్యా యుద్ధం.. అటుపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ద్ర‌వ్యోల్బ‌ణం ప్ర‌భావం కార్పొరేట్ కంపెనీల‌ను, ప్ర‌త్యేకించి ఐటీ కంపెనీల‌ను వెంటాడుతున్న‌ది.

Advertisement
Update:2023-10-18 10:54 IST

IT Industry Laid Offs | ఉక్రెయిన్‌-ర‌ష్యా యుద్ధం.. అటుపై ప్ర‌పంచ‌వ్యాప్తంగా ద్ర‌వ్యోల్బ‌ణం ప్ర‌భావం కార్పొరేట్ కంపెనీల‌ను, ప్ర‌త్యేకించి ఐటీ కంపెనీల‌ను వెంటాడుతున్న‌ది. ద్రవ్యోల్బ‌ణ నియంత్ర‌ణ‌కు ప్ర‌పంచ దేశాల సెంట్ర‌ల్ బ్యాంక్‌ల‌న్నీ వ‌డ్డీరేట్లు పెంచ‌డంతో మాంద్యం ప్ర‌భావం పెరిగిపోయింది. దీంతో ఐటీ, సాఫ్ట్‌వేర్ కంపెనీల‌తోపాటు కార్పొరేట్ సంస్థ‌లు పొదుపు చ‌ర్య‌ల్లో భాగంగా ఉద్యోగుల‌కు ఉద్వాస‌న ప‌లుకుతున్నాయి. మైక్రోసాఫ్ట్ ఆధీనంలోని లింక్డ్ఇన్ సైతం.. ఇంజినీరింగ్‌, ప్రొడ‌క్ట్‌, టాలెంట్‌, ఫైనాన్స్ టీమ్స్‌ల సుమారు 668 మంది ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. వ‌రుస‌గా ఎనిమిది త్రైమాసికాల్లో (రెండేండ్ల‌లో) రెవెన్యూ గ్రోత్ త‌గ్గ‌డంతో మైక్రోసాఫ్ట్ మ‌రోమారు సంస్థ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ చ‌ర్య‌ల‌కు దిగింది. దీంతో ఉద్యోగుల ఉద్వాస‌న ప్రారంభ‌మైంది.

ఒక్క మైక్రోసాఫ్ట్‌, దాని అనుబంధ లింక్డ్ఇన్‌లో మాత్ర‌మే ఈ దుస్థితి లేదు. భార‌త్‌లో పేరొందిన ఎడ్యుటెక్ స్టార్ట‌ప్ బైజూ`స్ త‌న బిజినెస్ పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ‌లో భాగంగా 4000-5000 మంది ఉద్యోగుల‌ను ఇండ్ల‌కు సాగ‌నంపింది. ఐటీ ప‌రిశ్ర‌మ‌ల్లో ఉద్యోగాల కోత కొత్తేమీ కాదు.. ఆశ్చ‌ర్యం అంత‌క‌న్నా కాదు. గ‌త రెండేండ్లుగా అతిపెద్ద ఐటీ సంస్థ‌ల‌తోపాటు ఐటీ, సాఫ్ట్‌వేర్ సంస్థ‌ల్లో నిరంత‌రం ఉద్యోగుల ఉద్వాస‌న కొన‌సాగుతూనే ఉంది. ప్ర‌తి గంట‌కూ స‌గ‌టున‌ 23 మంది ఐటీ నిపుణులు ఉద్యోగాలు కోల్పోతున్నారని గ‌ణాంకాలు చెబుతున్నాయి.

ఉద్యోగాల ఉద్వాస‌న‌పై ఏర్పాటైన లేఆఫ్స్.ఎఫ్‌వైఐ అనే వెబ్‌సైట్ ప్ర‌కారం ప్ర‌పంచ వ్యాప్తంగా 2,120 టెక్ కంపెనీలు ఇప్ప‌టి వ‌ర‌కూ 404,962 మంది ఉద్యోగుల‌ను తొల‌గించాయి. 2022లో 1061 టెక్ సంస్థ‌లు 1,64,769 మంది ఉద్యోగులు, 2023 ఈ నెల 13వ‌ర‌కూ 1,059 కంపెనీలు 2,40,193 మంది ఉద్యోగుల‌కు ఉద్వాస‌న ప‌లికాయి. ప్ర‌తి రోజూ స‌గ‌టున 555 మంది..ప్ర‌తి గంట‌కు 23 మంది ఐటీ నిపుణులు నిరుద్యోగుల‌వుతున్నారు.

2022లో మొద‌లైన ఉద్యోగాల ఉద్వాస‌న ప‌ర్వం.. 2023 ప్రారంభంలో గ‌రిష్ట స్థాయికి దూసుకెళ్లింది. ఈ ఏడాది జ‌న‌వ‌రిలో గ‌రిష్టంగా 89,554 మంది టెక్ నిపుణులుకోల్పోయారు. ఇటీవ‌లి కాలంలో కొన్ని నెల‌లుగా ఉద్యోగుల ఉద్వాస‌న‌లు త‌గ్గుముఖం ప‌ట్టాయి. ఆర్థిక మాంద్యం, పున‌ర్వ్య‌వ‌స్థీక‌ర‌ణ వ‌ల్ల గ‌త జూన్‌లో 4,632 టెక్ నిపుణులు ఉద్యోగులు ఇండ్ల‌కు ప‌రిమితం అయ్యారు.

మెటా, మైక్రోసాఫ్ట్ వంటి టెక్ దిగ్గ‌జ సంస్థ‌లు స‌హా టెక్నాల‌జీ ప‌రిశ్ర‌మ‌లోని ప్ర‌తి ఒక్క‌రి మీద‌ ఆర్థిక మాంద్యం ప్ర‌భావం చూపింది. టెక్ రంగంలో కొన్ని సెక్టార్లపై భారీగా ప్ర‌భావం ప‌డంది. ఈ ఏడాది రిటైల్ టెక్ రంగంలో 29,161 మంది, క‌న్జూమ‌ర్ టెక్ రంగంలో 28,873 మంది ఉద్వాస‌న‌కు గుర‌య్యారు.

ఇటీవ‌ల గేమింగ్ కంపెనీలు కూడా ఉద్యోగుల‌ను తొల‌గిస్తున్నాయి. ఆస్కిడెంట్ స్టూడియోస్‌, బీండాగ్‌, క్రిస్ట‌ల్ డైన‌మిక్స్‌, రోబ్లోక్స్‌, బ్లిజార్డ్‌, టీం 17, నాటీ డాగ్‌, నైయాంటిక్‌, కీవ‌ర్డ్స్ వంటి సంస్థ‌లు ఉద్యోగుల తొల‌గింపున‌కు ప్ర‌ణాళిక‌లు రూపొందించాయి. ఇక హార్ట్‌వేర్ కంపెనీ.. అందునా చిప్‌ల త‌యారీ సంస్థ క్వాల్ కామ్.. కాలిఫోర్నియాలోని రెండు యూనిట్ల‌లోనే 1258 మంది ఉద్యోగుల ఉద్వాస‌న‌కు ప్లాన్ సిద్ధం చేశాయి. ఇంకా చైనాలిసిస్‌, ప్లెక్స్‌, సిస్క‌, పీ ఇన్సూరెన్స్ కూడా ఉద్యోగుల ఉద్వాస‌న‌కు పాల్ప‌డ్డాయి. ఎపిక్ గేమ్స్ సంస్త ఫార్‌నైట్ 16 శాతం ఉద్యోగుల‌ను త‌గ్గించుకునే ప్ర‌ణాళిక సిద్ధం చేసింది.

భార‌త్‌లో ఎడ్యుటెక్ జెయింట్ బైజూ`స్ ఒక్క‌టే ఉద్యోగుల లే-ఆఫ్స్‌కు మిన‌హాయింపు కాదు. 70కి పైగా భార‌త్ టెక్ స్టార్ట‌ప్ కంపెనీలు 21 వేల‌కు పైగా ఉద్యోగుల‌ను తొల‌గించాయి. ఆ జాబితాలో బైజూస్‌, చార్జ్‌బీ, కార్స్ 24, లీడ్‌, ఓలా, ఓయో, మీషో, ఎంపీఎల్‌, ఇన్నోవాక‌ర్‌, ఉడాన్‌, అన్ అకాడ‌మీ, వేదాంతు ఉన్నాయి. క్విక్ గ్రాస‌రీ డెలివ‌రీ సంస్థ డుంజో..గ‌త‌నెల‌లో ఆర్థిక స‌మ‌స్య‌ల పేరిట 150-200 మందిని ఇంటికి సాగ‌నంపింది. ఈ ఏడాదిలో రెండు ద‌ఫాల్లో సుమారు 400 మందిని తొల‌గించింది డుంజో. బైజూ`స్ ప్ర‌త్య‌ర్థి సంస్థ అన్ అకాడ‌మీ గ‌త జూలైలో 1500 మందిని తొల‌గిస్తే, హెల్త్‌కేర్ స్టార్ట‌ప్ మోజోకేర్ త‌న సిబ్బందిలో 80 శాతం మందికి లే-ఆఫ్ ప్ర‌క‌టించింది.

Tags:    
Advertisement

Similar News