Gold ETFs | గోల్డ్ ఈటీఎఫ్‌లకు మళ్లీ ఆదరణ.. ఆకర్షణీయం బంగారంపై రిటర్న్స్
Gold ETFs | గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్స్) ఆదరణ పెరుగుతోంది. అనిశ్చిత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు స్వర్గధామంగా బంగారం కనిపిస్తోంది.
Gold ETFs | గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్స్) ఆదరణ పెరుగుతోంది. అనిశ్చిత పరిస్థితుల్లో ఇన్వెస్టర్లకు స్వర్గధామంగా బంగారం కనిపిస్తోంది. అందుకే అక్టోబర్‌లో గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్స్)లో అనూహ్యంగా దాదాపు ఐదు రెట్లు పెరిగాయి. సెప్టెంబర్‌లో రూ.175.3 కోట్లకు పరిమితమైన గోల్డ్ ఈటీఎఫ్స్ పెట్టుబడులు అక్టోబర్‌లో రూ.841 కోట్లకు వృద్ధి చెందాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) పేర్కొంది. హమాస్-ఇజ్రాయెల్ మధ్య ఉద్రిక్తతలు, అంచనాలకు మించి అమెరికాలో ద్రవ్యోల్బణం ఎక్కువగా ఉండటం, ఆర్థిక వృద్ధిరేటు మందగమనం వంటి కారణాలతో బంగారం ఆల్టర్నేటివ్ పెట్టుబడి మార్గంగా కొనసాగుతున్నదని మార్నింగ్ స్టార్ భారత్ ఇన్వెస్ట్‌మెంట్ అడ్వైజర్ రీసెర్చ్ మేనేజర్ అండ్ అనలిస్ట్ మెల్వియన్ సంతారియా పేర్కొన్నారు.
చురుగ్గా బంగారం కొనుగోళ్లు..
మరోవైపు ప్రీ-దీపావళి ధంతేరాస్ పర్వదినం సందర్భంగా భారత్‌లో బంగారం, వెండి కొనుగోళ్లు చురుగ్గా సాగుతున్నాయి. ధరలు తగ్గుతున్నాయన్న సంకేతాల మధ్య బంగారానికి గిరాకీ పెరిగింది. మార్చి నుంచి భారీగా పెరుగుతూ వచ్చిన బంగారం ధర గత నెల 29న తులం (24 క్యారట్స్) రూ.62,960తో ఆల్‌టైం గరిష్టానికి చేరువలోకి వెళ్లి దిగి వచ్చింది. గత వారంలోనే తులం బంగారం ధర రూ.800-1500 మధ్య తగ్గిపోవడం ఆసక్తికర పరిణామం. ప్రతియేటా ధంతేరాస్ సందర్భంగా 20-30 టన్నుల బంగారం కొనుగోళ్లు జరుగుతాయి. గతేడాది (2022) ధంతేరాస్ నాడు తులం బంగారం ధర రూ.50,139 పలికితే, గురువారం రూ.60,950 వద్ద నిలిచింది.
ధర పెరిగినా తగ్గని డిమాండ్
గతేడాదితో పోలిస్తే 20 శాతం ధర పెరిగినా.. ధంతేరాస్ సందర్భంగా కస్టమర్లు జ్యువెల్లరీ దుకాణాలకు పోటెత్తారు. హోల్‌సేల్, రిటైల్ మార్కెట్లలో బంగారం, వెండి విక్రయాలు 10 శాతం పెరిగాయని పీపీ జ్యువెల్లర్స్ అండ్ డైమండ్స్ డైరెక్టర్ రాహుల్ గుప్తా చెప్పారు. సుమారు 30 శాతం విలువ గల బంగారం, వెండి కొనుగోళ్లు పెరుగుతాయని అంచనావేస్తున్నట్లు తెలిపారు. మున్ముందు ధరలు పెరుగుతాయన్న అంచనాల మధ్య ప్రజలు బంగారం కొనుగోళ్లకు ముందుకు వస్తున్నారన్నారు.
గోల్డ్ ఈటీఎఫ్‌లకు పెరుగుతున్న ఆదరణ
ఇదిలా ఉంటే బంగారం లింక్డ్ ఈటీఎఫ్‌ల్లోకి సెప్టెంబర్‌లో రూ.175.3 కోట్ల పెట్టుబడులు రాగా, గత నెలలో రూ.841 కోట్లకు దూసుకెళ్లాయి. అంతకుముందు ఆగస్టులో రూ.1,028 కోట్లకు చేరుకున్నాయి. 2022 ఏప్రిల్ తర్వాత అంటే ఆగస్టులో గోల్డ్ లింక్డ్ ఈటీఎఫ్ పెట్టుబడులు 16 నెలల గరిష్ట స్థాయికి చేరుకున్నాయి. జూలైలో రూ.456 కోట్లు రికార్డయ్యాయి.
మూడు త్రైమాసికాల్లో వరుసగా నిధుల ఉపసంహరణ తర్వాత గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి ఏప్రిల్-జూన్ మధ్య రూ.298 కోట్ల విలువైన పెట్టుబడులు వచ్చాయి. గతేడాది సెప్టెంబర్ త్రైమాసికంలో రూ.165 కోట్లు, డిసెంబర్ త్రైమాసికంలో రూ.320 కోట్లు, మార్చి త్రైమాసికంలో రూ.1,243 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. గత కొన్ని నెలలుగా బంగారంపై పెట్టుబడులు ఆకర్షణీయంగా మారుతున్నాయి. సెప్టెంబర్ నాటికి బంగారం ఆధారిత ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులు రూ.23,800 కోట్లయితే, గత నెలలో పది శాతం వృద్ధి చెంది రూ.26,163 కోట్లకు చేరుకున్నాయి.
ధంతేరాస్ ముహూర్తం ఇలా
ప్రపంచంలోకెల్లా భారత్‌లోనే అత్యధిక బంగారం వినియోగిస్తారు. పండుగలు, పెండ్లిండ్లు, ఇతర శుభకార్యాలకు బంగారం కొనుగోళ్లు చేస్తారు. గురువారం మధ్యాహ్నం 12 గంటల నుంచి అర్ధరాత్రి పొద్దు పోయే వరకూ జ్యువెల్లరీ దుకాణాలు కస్టమర్లతో పోటెత్తాయి. ధంతేరాస్ సందర్భంగా బంగారం కొనుగోళ్లకు గురువారం మధ్యాహ్నం 12.35 గంటల నుంచి శుక్రవారం మధ్యాహ్నం 1.57 గంటలకు ముగుస్తుంది. క్రమంగా కస్టమర్లు పెరుగుతున్నారని ఆల్ ఇండియా జెమ్ అండ్ జ్యువెల్లరీ డొమెస్టిక్ కౌన్సిల్ (జీజేసీ) డైరెక్టర్ దినేశ్ జైన్ తెలిపారు. వజ్రాల ధరలు పతనం కావడంతో లైట్ వెయిట్ జ్యువెల్లరీ కొనుగోళ్లకు యువతరం ఆసక్తి చూపుతున్నారన్నారు.