భారీ నష్టాలతో ప్రారంభమైన సూచీలు

దేశీయ మార్కెట్లపై అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రభావం

Advertisement
Update:2024-10-03 10:16 IST

అంతర్జాతీయంగా చోటు చేసుకుంటున్న పరిణామాల ప్రభావం దేశీయ మార్కెట్లపై పడింది. దీంతో గురువారం ట్రేడింగ్‌ సూచీలు భారీ నష్టాలతో మొదలయ్యాయి. ప్రారంభంలోనే సెన్సెక్స్‌ ఏకంగా 1,264 పాయింట్లు పతనమైంది. ఉదయం 9:30 గంటల సమయంలో సెన్సెక్స్‌ 693 పాయింట్లు తగ్గి 83,572 వద్ద కొనసాగింది. నిఫ్టీ 211 పాయింట్లు కోల్పోయి 25,585 వద్ద ట్రేడవుతున్నది.సెన్సెక్స్‌ 30 సూచీలో ఎంఅండ్‌ఎం, ఏషియన్‌ పెయింట్స్‌, టాటా మెటార్స్‌, మారుతీ సుజికీ, రిలయన్స్‌ ఇండస్ట్రీస్‌, ఐసీఐసీఐ బ్యాంక్‌, నెన్లే ఇండియా, ఎల్‌అండ్‌టీ, టైటాన్‌, టీసీఎస్‌, కోటక్‌ మహీంద్రా బ్యాంక్‌ షేర్లు లాభాల్లో కొనసాగుతున్నాయి. జేఎస్‌డబ్ల్యూ, స్టీల్‌, టాటా స్టీల్‌ మినహా మిగిలిన స్టాక్స్‌ అన్నీ నష్టాల్లో ట్రేడవుతున్నాయి.

డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రూ. 83.91 వద్ద ప్రారంభమైంది. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్‌ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 74.64 డాలర్ల వద్ద ట్రేడవుతున్నది. బంగారం ఔన్స్‌ 2,657.30 డాలర్ల వద్ద కొనసాగుతున్నది.

మదుపర్లపై లాభాల వర్షం

ఈ సంవత్సరం స్టాక్‌ మార్కెట్లు మదుపర్లపై లాభాల వర్షాన్ని కురిపించాయి. సెన్సెక్స్‌, నిఫ్టీ సరికొత్త శిఖరాలను అధిరోహించాయి. దీంతో మదుపర్ల సంపద ఏకంగా రూ.110.57 లక్షల కోట్లు పెరిగింది. 2024లో ఇప్పటిదాకా బీఎస్‌ఈలో మదుపర్ల సంపదగా పరిగణించే నమోదిత సంస్థల మొత్తం మార్కెట్‌ విలువ రూ.474.86 లక్షల కోట్ల (5.67 లక్షల కోట్ల డాలర్ల)కు చేరింది. సెప్టెంబర్‌ 27న రూ. 477.93 లక్షల కోట్ల వద్ద జీవనకాల గరిష్ఠాన్ని నమోదు చేసింది. భారత ఆర్థిక వ్యవస్థ బలమైన మూలాలు, నగదు లభ్యత పెరగడం, ఎఫ్‌ఐఐ-డీఐఐల కొనుగోళ్లు, అమెరికాలో వడ్డీ రేట్ల కోతలు వంటివి మన మార్కెట్ల జోరుకు కారణమని మార్కెట్‌ విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా పశ్చిమాసియాలో పెరిగిన ఉద్రిక్తతల వల్ల గత మూడు ట్రేడింగ్‌ రోజుల్లో మార్కెట్లు కొంత నష్టపోయాయి. 

Tags:    
Advertisement

Similar News