రూపాయి తప్పులేదు, డాలర్ ఒళ్లుచేసింది.. నిర్మలమ్మ కవరింగ్

తప్పు తమది కాదని, డాలర్ ది అని చెబుతున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. డాలర్ బలపడటంతో ఆటోమేటిక్ గా రూపాయి బలహీనపడిందని కవర్ చేసుకోవాలని చూశారామె.

Advertisement
Update:2022-10-16 17:10 IST

ఇటీవల కాలంలో తన వాక్ చాతుర్యాన్ని బలంగా చాటుకుంటున్న బీజేపీ నేతల్లో నిర్మలా సీతారామన్ మొదటి వరుసలో ఉన్నారు. రేషన్ షాపుల్లో మోదీ ఫొటోలు లేవని చిందులు తొక్కడం మొదలు, ఫామ్ హౌస్ లో కేసీఆర్ క్షుద్రపూజలు చేశారంటూ చిత్ర విచిత్రంగా మాట్లాడే వరకు ఆమె తన స్థాయిని మెల్ల మెల్లగా తగ్గించుకుంటూ వచ్చారు. ఇప్పుడు రూపాయి బలహీన పడటానికి ఓ విచిత్రమైన సమధానం చెప్పి అంతర్జాతీయ స్థాయిలో భారత్ పరువు తీసేశారు. తన ఆర్థిక నైపుణ్యం ఏంటో బయటపెట్టుకున్నారు.

డాలర్ బలపడింది అంతే..

అంతర్జాతీయ మార్కెట్ లో రూపాయి పతనావస్థకు చేరిందనే విషయం వాస్తవం. డాలర్ తో పోల్చి చూస్తే రూపాయి విలువ ఆల్ టైమ్ కనిష్టానికి చేరుకుంది. 82.30 వద్ద రూపాయి మారక విలువ ట్రేడ్ అవుతోంది. ఇంత దారుణమైన స్థితి ఎప్పుడూ లేదు. అయితే ఈ దుస్థితికి కారణం ఎవరు..? అసమర్థ, అస్తవ్యస్థ విధానాలతో దేశాన్ని కష్టాలపాలు చేస్తున్న బీజేపీ సర్కారుదేనని విపక్షాలు గొంతు చించుకుంటున్నాయి. కానీ తప్పు తమది కాదని, డాలర్ ది అని చెబుతున్నారు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. డాలర్ బలపడటంతో ఆటోమేటిక్ గా రూపాయి బలహీనపడిందని కవర్ చేసుకోవాలని చూశారామె. అయితే ఈ కవరింగ్ ఇండియాలో అయితే పర్లేదు, అమెరికా పర్యటనలో ఉన్న నిర్మల, వాషింగ్టన్ డీసీలో మీడియాతో మాట్లాడుతూ ఈ కథ చెప్పారు. దీంతో అంతర్జాతీయ మీడియా కూడా ఉలిక్కిపడింది. భారత ఆర్థిక మంత్రి ప్రతిభాపాఠవాలు చూసి నివ్వెరపోయింది.

ఈ లాజిక్ పనిచేస్తుందా.. ?

భారత్ లో ద్రవ్యోల్బణం పెరిగిపోవడం, అంతర్జాతీయ మార్కెట్ ని ఒడిసిపట్టుకోలేకపోవడం, ఎగుమతులు క్షీణించడం, దిగుమతులపై ఆధారపడాల్సి రావడం.. ఇలా సవాలక్ష కారణాలతో డాలర్ తో రూపాయి మారక విలువ పడిపోతూ వస్తోంది. ఆర్థిక సంస్కరణలతో డాలర్ కి కళ్లెం వేసి, రూపాయిని రక్షించే ప్రయత్నం చేయొచ్చు కానీ కేంద్రానికి అది సాధ్యం కావడంలేదు. దీంతో తప్పుని డాలర్ పైకి నెట్టేశారు.

భౌగోళిక-రాజకీయ ఉద్రిక్తతలు పెరగడమే రూపాయి పతనానికి కారణం అని చెబుతున్నారు నిర్మలా సీతారామన్. అభివృద్ధి చెందుతున్న ఇతర దేశాల ఆర్థిక వ్యవస్థ, కరెన్సీలతో పోలిస్తే రూపాయి చాల మెరుగ్గానే ఉందన్నారు. రూపాయి విలువ స్థిరీకరించడానికి ఆర్బీఐ ప్రయత్నిస్తోందని చెప్పుకొచ్చారు. యుద్ధం నిత్యావసరాల ధరలను పెంచిందని చెబుతున్న నిర్మలమ్మ.. మరి అదే యుద్ధ ప్రభావం అమెరికాపై కూడా ఉంటుందనే విషయాన్ని మరచిపోయారు. జీఎస్టీపై పెట్టిన శ్రద్ధ, రూపాయిని కాపాడటంపై పెట్టలేదు కాబట్టే భారత్ లో ఈ దుస్థితి.

Tags:    
Advertisement

Similar News