ఆ ఐదు కార్పొరేట్ కంపెనీల వల్లే అధిక ధరలు: ఆర్బీఐ మాజీ డిప్యుటీ గవర్నర్ విరాల్ ఆచార్య

ఇండియాలో కార్పొరేట్ దిగ్గజాలైన రిలయన్స్, టాటా, ఆదిత్యా బిర్లా గ్రూప్, అదానీ గ్రూప్, భారతి తెలికాం.. ఈ ఐదు కార్పొరేట్ కంపెనీలే అధిక ధరలకు కారణమని ఆయన చెప్పారు.

Advertisement
Update:2023-03-31 09:34 IST

దేశంలో పలు ఉత్పత్తులు, సేవల ధరలు భారీగా పెరగడానికి కార్పొరేట్ కంపెనీలే కారణమని.. అవి ధరల్ని భారీగా పెంచి, ద్రవ్యోల్బణాన్ని ఎగదోస్తున్నాయని ప్రముఖ ఆర్థికవేత్త విరాల్ ఆచార్య అన్నారు. ఇండియాలో ధరలు భారీగా పెరగకుండా ఉండాలంటే ఈ కార్పొరేట్ గ్రూప్‌లను బద్దలు కొట్టాల్సిన అవసరం ఉందని చెప్పారు. 2017-19 మధ్య రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యుటీ గవర్నర్‌గా పని చేసిన ఆచార్య, ప్రస్తుతం న్యూయార్క్ యూనివర్సిటీ అనుబంధ స్టెర్న్ స్కూల్ ఆఫ్ బిజినెస్‌లో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్నారు.

ఇండియాలో కార్పొరేట్ దిగ్గజాలైన రిలయన్స్, టాటా, ఆదిత్యా బిర్లా గ్రూప్, అదానీ గ్రూప్, భారతి తెలికాం.. ఈ ఐదు కార్పొరేట్ కంపెనీలే అనేక చిన్న సంస్థలను దిగమింగి బడా గ్రూప్‌లుగా ఎదిగాయని.. ఇప్పుడు వీటికి రిటైల్, సహజ వనరులు, టెలికమ్యునికేషన్ల రంగంలో ధరలు పెంచే శక్తి ఏర్పడిందని ఆయన ఆరోపించారు. వర్థమాన దేశాలపై బ్రూకింగ్స్ ఇన్‌స్టిట్యూట్ ప్యానల్‌కు సమర్పించిన ఒక పేపర్‌లో ఆయన భారత్‌లోని స్థితిగతులకు సంబంధించి పలు విషయాలు వెల్లడించారు.

కేంద్ర ప్రభుత్వ విధానాలు ఈ ఐదు కార్పొరేట్లకు బాసటగా నిలుస్తున్నాయని చెప్పారు. ప్రభుత్వం దిగుమతి సుంకాలు భారీగా పెంచడంతో.. ఈ ఐదు సంస్థలకు అనుకూలంగా మారతోందని ఆచార్య వెల్లడించారు. ఇలాంటి కార్పొరేట్ శక్తులు గ్రూపలు కట్టకుండా విడగొట్టాల్సిన అవసరం ఉంది. లేకపోతే ధరలు మరింతగా పెరిగిపోతాయి. ఒక వేళ ఆ పని చేయలేకపోతే.. వాటి వృద్ధిని అడ్డుకునే చర్యలు తీసుకోవాలి. దీని వల్ల అధిక ధరలు కాస్తైనా నియంత్రణలోకి వస్తాయి.

ముడి పదార్థాల ధరలు బాగా తగ్గుతున్నా.. భారత్‌లోని వినియోగదారులకు ఆ ఫలాలు అందడం లేదని విరాల్ ఆచార్య చెప్పారు. లోహాలు, బొగ్గు, పెట్రోలియం రిఫైనరీలు ఈ బిగ్-5 చేతుల్లో ఉండటమే కారణమని ఆయన చెప్పారు. రిటైల్ వ్యాపారం, టెలికాం సర్వీసులు కూడా వీరిదే గుత్తాధిపత్యమని అన్నారు. అందుకే వాళ్లు నిర్ణయించిన ధరలే మార్కెట్‌లో చలామణి అవుతున్నాయని పేర్కొన్నారు. అంతర్జాతీయంగా వస్తూత్పత్తుల ద్రవ్యోల్బణం తగ్గినప్పటికీ.. ఇండియాలో మాత్రం ఇంకా అధికంగానే ఉన్నాయన్నారు. ఇన్‌ఫ్లేషన్ గరిష్ట స్థాయిలో ఉండటంతో వడ్డీ వ్యయాలు కూడా అధికంగా ఉంటున్నాయని ఆచార్య పేర్కొన్నారు. ధరల్ని నిర్ణయించే శక్తి కార్పొరేట్లకు ఉండటమే వీటన్నింటికీ కారణమని ఆయన చెప్పారు.

Tags:    
Advertisement

Similar News