Gold Rates | జీవిత కాల గరిష్టానికి బంగారం ధరలు.. త్వరలో రూ.72 వేలు @ తులం..!
Gold Rates | అంతర్జాతీయ, దేశీయ బులియన్ మార్కెట్లలో బంగారం ధరలు చారిత్రక రికార్డు పలికాయి.
Gold Rates | అంతర్జాతీయ, దేశీయ బులియన్ మార్కెట్లలో బంగారం ధరలు చారిత్రక రికార్డు పలికాయి. ఈ నెల మొదటి వారంలో లండన్‌లో స్పాట్ గోల్డ్ ఔన్స్ 2195 డాలర్లతో జీవితకాల గరిష్ట ధర పలికింది. 2024లోనే ఆరు శాతానికి పైగా బంగారం ధర పెరిగింది. అంతర్జాతీయ ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌కు అనుగుణంగానే దేశీయ మార్కెట్లో పది గ్రాముల బంగారం (24 క్యారట్స్) ధర రూ.66 వేల మార్క్‌ను దాటేసింది. మున్ముందు తులం బంగారం ధర రూ.72 వేలకు చేరుతుందని అంచనా వేస్తున్నారు.
కీలక వడ్డీరేట్లను యూఎస్ ఫెడ్ రిజర్వ్ తగ్గిస్తే బంగారం ధరలు మరింత మెరుస్తాయి. రోజురోజుకు పెరుగుతున్న భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో అనూహ్య ఫలితాలు, ప్రధాన దేశాల కేంద్రీయ బ్యాంకులు బంగారం కొనుగోళ్లకు ముందుకు రావడంతో పసిడి ధరలు మరింత పెరుగుతాయని విశ్లేషకులు అభిప్రాయ పడుతున్నారు. జూన్ నుంచి యూఎస్ ఫెడ్ రిజర్వ్ కీలక వడ్డీరేట్లు తగ్గిస్తుందని ఇన్వెస్టర్లు అంచనా వేస్తున్నారు. అమెరికా ద్రవ్యోల్బణం నిర్దేశిత రెండు శాతానికి వచ్చే వరకూ యూఎస్ ఫెడ్ రిజర్వ్ వేచి చూసే అవకాశాలు ఉన్నాయి.
యూఎస్ ఫెడ్ రిజర్వ్ వడ్డీరేట్లు తగ్గిస్తే, డాలర్ ఆధారిత ఆస్తుల విలువ తగ్గుదలకు, యూఎస్ డాలర్ విలువ పతనం అవుతుంది. అంతర్జాతీయంగా డాలర్లలోనే బంగారం కొనుగోలు చేస్తుంటారు. యూఎస్ డాలర్ పతనమైతే ఇతర కరెన్సీ గల దేశాల ఇన్వెస్టర్లకు బంగారం చౌకగా లభిస్తుంది. ఫలితంగా బంగారానికి గిరాకీ పెరుగుతుందని విశ్లేషకులు చెబుతున్నారు.
ప్రపంచ ఆర్థిక వ్యవస్థ బలహీనతలు, తారాస్థాయికి భౌగోళిక రాజకీయ సంక్షోభం వంటి అంశాలు బంగారం ధరలను నిర్దేశిస్తాయి. 2024లో సానుకూల ఆర్థిక వృద్ధిరేట్ సాధిస్తామని అమెరికా అంచనా వేసినా, జర్మనీ, జపాన్, బ్రిటన్ వంటి అభివృద్ధి చెందిన దేశాల ఆర్థిక వ్యవస్థలు మందగించాయి. తిరోగమన ఆర్థికాభివృద్ధి వల్ల, ద్రవ్యోల్బణంతో విలువ తగ్గకుండా బంగారానికి డిమాండ్ పెరుగుతుంది.
భౌగోళిక రాజకీయ అస్థిరత వల్ల పెరిగే ద్రవ్యోల్బణం ప్రభావాన్ని అధిగమించేందుకు ఇన్వెస్టర్లు బంగారం కొనుగోలుకు మొగ్గు చూపుతుంటారు. ఇజ్రాయెల్-హమస్, రష్యా- ఉక్రెయిన్ మధ్య యుద్ధం, నవంబర్‌లో అమెరికా అధ్యక్ష ఎన్నికలపై ఇన్వెస్టర్లు కేంద్రీకరించారు.
దీనికి తోడు ఇటీవలి కాలంలో కేంద్రీయ బ్యాంకుల నుంచి బంగారానికి మంచి గిరాకీ వచ్చింది. 2010 తర్వాత వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు రికార్డు స్థాయిలో బంగారం కొనుగోలు చేశాయని ప్రపంచ పసిడి మండలి తెలిపింది. గత రెండేండ్లుగా కేంద్రీయ బ్యాంకులు 1000 టన్నులకు పైగా బంగారం కొనుగోలు చేశాయి. అదే ధోరణి 2024లోనూ కొనసాగుతుందని విశ్లేషకులు అంచనా వేశారు. అయితే, సాధారణంగా బంగారం ఆభరణాల తయారీకి పసిడి కొనుగోలు చేసే వారు ధర తగ్గినప్పుడు కొనుగోలు చేయడానికి మొగ్గు చూపుతుంటారు.