Gold ETFs | భౌగోళిక ఉద్రిక్తతలున్నా.. డోంట్‌కేర్.. మిలమిలా మెరుస్తున్న గోల్డ్ ఈటీఎఫ్‌లు.. మదుపర్లకు ఆకర్షణీయ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్ ఇదేనా..?!
Gold ETFs | బంగారం అంటే భారతీయులకు.. అందునా మహిళలకు ఎంతో ఇష్టం.. పండుగలు.. పెండ్లిండ్లు, ఫ్యామిలీ వేడుకలకు బంగారం కొనుక్కోవాలని భావిస్తారు.. తమకు ఉన్న ఆభరణాలు ధరించడానికి మక్కువ చూపుతుంటారు.
Gold ETFs | బంగారం అంటే భారతీయులకు.. అందునా మహిళలకు ఎంతో ఇష్టం.. పండుగలు.. పెండ్లిండ్లు, ఫ్యామిలీ వేడుకలకు బంగారం కొనుక్కోవాలని భావిస్తారు.. తమకు ఉన్న ఆభరణాలు ధరించడానికి మక్కువ చూపుతుంటారు. కానీ, దేశీయ అవసరాలకు సరిపడా బంగారం కావాలంటే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాల్సిందే. ద్రవ్యోల్బణం నేపథ్యంలో పెరుగుతున్న ధరలను పరిగణనలోకి తీసుకుంటే ఇన్వెస్టర్లకు ఆలర్నేటివ్ ఇన్వెస్ట్‌మెంట్ ఆప్షన్‌గానూ బంగారం నిలుస్తుంది. మహిళల ఆకాంక్షలకు అనుగుణంగా డిజిటల్ పెట్టుబడి రూపంలోనూ బంగారంపై ఇన్వెస్ట్‌మెంట్ చేయొచ్చు. ఫిజికల్ బంగారం వాడాకాన్ని నిరుత్సాహ పరిచేందుకు కేంద్రమే సావరిన్ గోల్డ్ బాండ్లను తీసుకొస్తున్నది. అలాగే ప్రైవేట్‌గా వివిధ మ్యూచువల్ ఫండ్స్ సంస్థలూ గోల్డ్ ఎక్స్చేంజ్ ట్రేడెడ్ ఫండ్స్ (ఈటీఎఫ్) తీసుకొస్తున్నాయి.
ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం.. మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు.. ఆర్థిక మాంద్యం ప్రభావం ఉన్నా గతేడాది దేశీయంగా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో పెట్టుబడులకు మాత్రం ఇన్వెస్టర్లు వెనక్కు తగ్గలేదు. గోల్డ్ ఈటీఎఫ్‌ల్లోకి 2023లో రూ.2,920 కోట్ల పెట్టుబడులు మదుపు చేశారు. 2022తో పోలిస్తే ఆరు రెట్లు పెట్టుబడులు పెరిగాయి. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు, అధిక వడ్డీరేట్లు, భారీగా పెరుగుతున్న ద్రవ్యోల్బణం నేపథ్యంలో ఇన్వెస్టర్లు తమ సంప్రదాయ స్వర్గధామం బంగారంపై పెట్టుబడులు పెట్టడమే సేఫ్ అని భావిస్తున్నారు. గోల్డ్ ఈటీఎఫ్స్‌లో అసెట్ బేస్‌తోపాటు ఇన్వెస్టర్ల ఖాతాలు పెరిగాయని అసోసియేషన్ ఆఫ్ మ్యూచువల్ ఫండ్స్ ఇన్ ఇండియా (ఏఎంఎఫ్ఐ) తెలిపింది.
2023 పొడవునా గోల్డ్ ఈటీఎఫ్‌ల్లో రూ.2,920 కోట్ల పెట్టుబడులు పెడితే, 2022 కంటే రూ.459 కోట్లు ఎక్కువ. గత ఆగస్టులో రూ.1,028 కోట్ల పెట్టుబడులను గోల్డ్ ఈటీఎఫ్‌లు ఆకర్షించాయి. ఇది ఆగస్టు నాటికి 16 నెలల గరిష్టం. ద్రవ్యోల్బణంతోపాటు వడ్డీరేట్లు పెరుగుతుండటంతో ఇన్వెస్టర్లు బంగారంలో మదుపు చేయడానికే మొగ్గు చూపుతున్నారు.
2022లో రూ.21,455 కోట్ల పెట్టుబడులు పెడితే గోల్డ్ మ్యూచువల్ ఫండ్స్‌లో 2023లో 27 శాతానికి పైగా గ్రోత్ నమోదై రూ.27,336 కోట్లకు చేరుకున్నది. గత కొన్నేండ్లుగా బంగారంపై పెట్టుబడులు అద్భుతమైన రిటర్న్స్ అందిస్తుండటంతో ఇన్వెస్టర్లు సైతం పసిడి వైపే మొగ్గు చూపుతున్నారు. ఇక 2022 డిసెంబర్ నాటికి 46.38 లక్షల గోల్డ్ ఈటీఎఫ్ ఖాతాలు ఉంటే, గత డిసెంబర్‌కల్లా 2.73 లక్షలు పెరిగి 49.11 లక్షలకు చేరుకున్నాయి. ఇన్వెస్టర్లు తమ సంపాదనను బంగారంలో మదుపు చేయడానికి మళ్లుతున్నారని చెప్పడానికి ఇదొక్కటి చాలు. కరోనా మహమ్మారితో 2022, ఆర్థిక మాంద్యం ప్రభావంతో 2021లో ఇన్వెస్ట్‌మెంట్‌కు సవాళ్లు ఎదురవుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లకు 2023 బంగారం ఆకర్షణీయ పెట్టుబడి మార్గంగా కనిపిస్తున్నది. 2020లో బంగారంపై రూ.6,657 కోట్లు, 2021లో రూ.4,814 కోట్ల పెట్టుబడులు పెట్టారు.