నవీ టెక్నాలజీస్ విస్తరణపై ఫోకస్
ఓలాలో తన వాటాను ఉపసంహరించుకోవాలని చూస్తున్నసచిన్ బన్సల్
ప్రముఖ ఇ-కామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్డ్ సహ వ్యవస్థాపకుడు సచిన్ బన్సల్ తన ఫిన్‌టెక్ స్టార్టప్ నవీ టెక్నాలజీస్‌ను విస్తరించే దిశగా చర్యలు చేపట్టారు. ఈ మేరకు ఓలాలో తన వాటాను ఉపసంహరించుకోవాలని చూస్తున్నట్లు సమాచారం. దీనికోసం చర్చలు జరుపుతున్నట్లు నేషనల్ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.
బన్సల్ 2019 ఓలాలో 100 మిలియన్లు (భారత కరెన్సీలో రూ. 857 కోట్లు) పెట్టుబడి పెట్టాడు. ఆ సమయానికి ఓలా మార్కెట్ విలువ సుమారు3 బిలియన్ డాలర్లు ఉన్నది. ప్రస్తుతం కంపెనీ విలువ సుమారు 4 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 34 వేల కోట్లకు పైమాటే)కు పెరిగిందని అంచనా. ఈ క్రమంలోనే తన స్టార్టప్ విస్తరణలో భాగంగా సచిన్ బన్సల్ తన వాటాను ఉపసంహరించుకోవడానికి సిద్ధమయ్యాడు. ఈ మేరకు ఓలా వ్యవస్థాపకుడు భవీశ్ అగర్వాల్‌తో సంబంధిత అంశాలపై చర్చలు జరిపిట్లు తెలుస్తోంది.
ఓలా విక్రయం ద్వారా సేకరించిన నిధులు నవీ టెక్నాలజీస్ ఆర్థికస్థితిని బలోపేతం చేయడానికి సాయపడతాయని నివేదికలు వెల్లడిస్తున్నాయి. ఎలక్రిక్ స్కూటర్ తయారీ సంస్థ ఏథర్ ఎనర్జీ నుంచి బన్సల్ ఇటీవలే నిష్క్రమించిన విషయం విదితమే. సంస్థలో తన వాటాను జెరోధా సహ వ్యవస్థాపకుడు నిఖిల్ కామత్‌కు విక్రయించారు. ఈ చర్య తర్వాత ఓలా నుంచి వాటా ఉప సంహరించుకోవడానికి సిద్ధమౌతున్నారు.