కొత్త ఫైనాన్షియల్ ఇయర్‌ను కొత్తగా మలచుకోండి!
ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకునేందుకు కొత్త ఫైనాన్షియల్ ఇయర్ సరైన సమయం.
ఆర్థిక పరమైన నిర్ణయాలు తీసుకునేందుకు ఫైనాన్షియల్ ప్లానింగ్ చేసుకునేందుకు కొత్త ఫైనాన్షియల్ ఇయర్ సరైన సమయం. ఇప్పట్నుంచి కొన్ని పాత అలవాట్లు వదిలేసి కొత్త ఆర్థిక క్రమశిక్షణ అలవరచుకుంటే ఆర్థికంగా స్థిరపడొచ్చు. అదెలాగంటే..
ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కావాలంటే మీ ఫైనాన్షియల్ ప్లానింగ్‌ను సరిచేసుకోవాల్సి ఉంటుంది. దానికై ఎప్పుడో ఒకప్పుడు కచ్చితమైన నిర్ణయాలు తీసుకోవాలి. అది ఈ రోజే అయితే ఇంకా మంచిది. అలాగే వాటికి కట్టుబడి ఉండడం కూడా ఎంతో ముఖ్యం.
క్రెడిట్స్ క్లియర్ చేస్తే..
కొత్త ఫైనాన్షియల్ ఇయర్‌లో అప్పులన్నీ తీర్చేయాలి అని నిర్ణయం తీసుకోండి. దీనికై కాస్త ఎక్కువ శ్రమ చేయండి. అప్పులు లేని జీవితాన్ని గడపడం వల్ల సగం ఫైనాన్షియల్ ఫ్రీడమ్ దొరికినట్టే. కాబట్టి వచ్చే ఏప్రిల్ కల్లా వీలైనంతవరకూ అప్పు లేకుండా చూసుకునేందుకు ఇప్పట్నుంచే ప్లాన్ చేసుకోండి.
పొదుపుకి లేట్ ఎందుకు
ఆర్థిక లక్ష్యాలను సాధించడం కోసం పొదుపు, పెట్టుబడులు పెట్టడం అత్యంత అవసరం. కాబట్టి సేవింగ్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ మొదలుపెట్టనివాళ్లు ఇకనైనా మొదలుపెట్టాలి. ఆదాయం ఎంత తక్కువగా ఉన్నా అందులో కొంత భాగాన్ని ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో మదుపు చేయకపోతే ఆర్థికంగా ఎప్పటికీ ఉన్నచోటే ఉంటారు. కాబట్టి ఎంతోకొంత మదుపు చేయడం ఇప్పట్నుంచే మొదలుపెట్టండి.
బడ్జెట్ రీవిజిట్
మీ బడ్జెట్‌ను రీవిజిట్ చేసుకునేందుకు ఇదే సరైన సమయం. అసలు మీ ఆదాయం ఎంత? ఖర్చు ఎంత? అందులో అవసరాలు ఎన్ని? పొదపు ఎంత? ఇలా అన్నింటిని కేటగిరీల వారీగా లెక్క కట్టుకోండి. అందులో అవసరమైన మార్పులు చేసుకుని ఖర్చుల్ని తగ్గించేలా, పొదుపు పెంచేలా ప్లాన్ చేసుకోండి.
గోల్ ఏంటి?
మీ ఆర్థిక లక్ష్యం ఏంటి? అందులో ఇప్పుడు మీరు ఎక్కడ ఉన్నారు? అన్నది ఒకసారి చెక్ చేసుకుని దానికి తగిన ప్రణాళిక వేసుకునేందుకు ఇదే అనువైన సమయం. కాబట్టి గోల్ ఉన్నవాళ్లు దానికై మరింత ఫోకస్డ్‌గా పనిచేయాలి. గోల్ లేని వారు ఇప్పుడైనా ఒక ఫైనాన్షియల్ గోల్‌ను నిర్దేశించుకోవాలి.
సేఫ్టీ టూల్స్
జీవితంలో ఎదురయ్యే అనుకోని ఖర్చులను ఎదుర్కొనేందుకు బీమా పాలసీలు పనికొస్తాయి. కాబట్టి మీకు, ఫ్యామిలీకి అవసరమైన లైఫ్ ఇన్సూరెన్స్‌లు, హెల్త్ ఇన్సూరెన్స్‌ల వంటివాటికై ప్లాన్ చేసుకోండి. ఇవి జీవితానికి ఒక భరోసాని అందిస్తాయి.